SRH vs LSG : ట్రావిస్ హెడ్, అభిషేక్ అదుర్స్.. చిత్తుగా ఓడిన లక్నో.. హైదరాబాద్ అద్భుత విజయం

ఉప్ప‌ల్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

SRH vs LSG : ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి భారీ విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి జట్టు లక్నో సూపర్ జైంట్స్‌పై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ గెలిచింది. ఇంకా 62 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ ఒక్క వికెట్ పడకుండా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఓపెనర్లలో అభిషేక్ శర్మ (75 నాటౌట్; 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్), ట్రావిస్ హెడ్ (89 నాటౌట్; 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్)తో హాఫ్ సెంచరీలతో విజృంభించారు. లక్నో జిత్తులు, ఎత్తులు సన్‌రైజర్స్ ఓపెనర్లు చిత్తు చేశారు..  లక్నో బౌలర్లు బంతులతో ఎలాంటి మాయాజాలం చేసినా హైదరాబాద్ ఆటగాళ్ల ముందు ఏమాత్రం పనిచేయలేదు. కొంచెం కూడా ఇద్దరు తడబడకుండా క్రీజులో నిలబడి ఆడుతూ పాడుతూ ఊచకోత కోశారు.

ధాటిగా బ్యాట్ ఝళిపిస్తూ లక్నో బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఓపెనర్ల దూకుడుకు కళ్లెం వేసేందుకు లక్నో బౌలర్లు ప్రయత్నించినా కట్టడి చేయలేకపోయారు. ఫలితంగా 10 ఓవర్లలోపే లక్నో నిర్దేశించిన లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేశారు.

కేవలం 9.4ఓవర్లలోనే మ్యాచ్‌ను సన్ రైజర్స్ ఓపెనర్లు అజేయంగా నిలిచి 167 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారీ స్కోరుతో బ్యాటింగ్ ఝళిపించిన ట్రావిడ్ హెడ్ (89/30)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


టాప్ 3లో హైదరాబాద్ :
పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 12 మ్యాచ్‌‌ల్లో 7 గెలిచి 5 ఓడి మొత్తం 14 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 6 ఓడి మొత్తం 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది.

హైద‌రాబాద్ ల‌క్ష్యం 166
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 165 ప‌రుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో ఆయుష్ బ‌దోని (55నాటౌట్‌; 30 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ బాద‌గా నికోల‌స్ పూర‌న్ (48నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్వింట‌న్ డికాక్ (2), మార్క‌స్ స్టోయినిస్ (3) విఫ‌లం అయ్యారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ రెండు వికెట్లు తీయ‌గా పాట్ క‌మిన్స్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

బ‌దోని హాఫ్ సెంచ‌రీ..
న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 28 బంతుల్లో 8 ఫోర్ల‌తో ఆయుష్ బ‌దోని హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

కేఎల్ రాహుల్ ఔట్‌
పాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో న‌జ‌రాజ‌న్ క్యాచ్ అందుకోవ‌డంతో కేఎల్ రాహుల్ (29; 33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) ఔట్ అయ్యాడు. దీంతో 9.6వ ఓవ‌ర్‌లో 57 ప‌రుగుల వ‌ద్ద ల‌క్నో మూడో వికెట్ కోల్పోయింది.

స్టొయినిస్ ఔట్‌..
ల‌క్నో మ‌రో వికెట్ కోల్పోయింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో సంవీర్ సింగ్ క్యాచ్ అందుకోవ‌డంతో మార్క‌స్ స్టొయినిస్ (3) ఔట్ అయ్యాడు. దీంతో 4.2వ ఓవ‌ర్‌లో 21 ప‌రుగుల వ‌ద్ద ల‌క్నో రెండో వికెట్ కోల్పోయింది.

క్వింట‌న్ డికాక్ ఔట్‌..
భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌ బౌలింగ్‌లో నితీశ్ రెడ్డి క్యాచ్ అందుకోవ‌డంతో క్వింట‌న్ డికాక్ (2) ఔట్ అయ్యాడు. దీంతో ల‌క్నో 2.1 ఓవ‌ర్ వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

లక్నో సూపర్ జెయింట్స్ తుది జ‌ట్టు : క్వింటన్ డికాక్, కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు : ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (క‌మిన్స్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియస్కాంత్, టి నటరాజన్

టాస్..
ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తొలుత బౌలింగ్ చేయ‌నుంది.

స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..
స‌న్‌రైజ‌ర్స్‌, ల‌క్నో మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు.

కీల‌క పోరుకు స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్ సిద్ధ‌మైంది. ఉప్ప‌ల్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇరు జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు చెరో 11 మ్యాచులు ఆడాయి. రెండు జ‌ట్లు కూడా చెరో ఆరు మ్యాచుల్లో విజ‌యాలు సాధించాయి. ఆయా జ‌ట్ల ఖాతాల్లో 12 పాయింట్లు ఉన్నాయి. ల‌క్నో క‌న్నా నెట్‌ర‌న్‌రేటు కాస్త మెరుగ్గా ఉండ‌డంతో పాయింట్ల ప‌ట్టిక‌లో హైద‌రాబాద్ నాలుగో స్థానంలో ల‌క్నో ఆరో స్థానంలో కొన‌సాగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్ మ‌రింత చేరువ కావాల‌ని ఇరు జ‌ట్లు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి

ట్రెండింగ్ వార్తలు