Alleti Maheshwar Reddy : ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చి వాళ్లకు అన్యాయం చేసింది వాస్తవం కాదా?- కాంగ్రెస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

మైనారిటీలను చేతి కింద పెట్టుకుని వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేయలేదా? 40 సీట్లు కూడా గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ ది.

Alleti Maheshwar Reddy : తెలంగాణలో సవాళ్ల పర్వం నడుస్తోంది. నాయకులు ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ చెలరేగిపోతున్నారు. ఇప్పటికే రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్, మాజీమంత్రి హరీశ్ రావు మధ్య రాజీనామా సవాల్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆగస్టు 15లోపు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.

”రేవంత్ రెడ్డి మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. గజినీలా వ్యవహరిస్తున్నారు. సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం పక్కన పెట్టి కొత్త అంశాలు తెరపైకి తెస్తున్నారు. 14 సీట్లు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెబితే ఛాలెంజ్ స్వీకరించలేదు. రుణమాఫీపై ఇప్పటికైనా మాటకు కట్టుబడి ఉంటారా? హరీశ్, రేవంత్ రెడ్డి డ్రామాలో చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలి? కాంగ్రెస్ కు హరీశ్ రావు షిండేనా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

మీ హామీలలో కేవలం రుణమాఫీ మాత్రమే లేదు. మిగిలిన 419 హామీల గురించి మాట్లాడరా? రుణమాఫీ చేయకుంటే అధికారం ఎందుకనే నీవు.. రైతుబంధు, మహాలక్ష్మి పథకం, యువకులకు ఉద్యోగ క్యాలెండర్ గురించి మాట్లడరా? కేవలం రుణమాఫీ గురించి మాట్లాడే నీవు బీసీలకు 10లక్షల గురించి ఎందుకు మాట్లాడటం లేదు. బీసీ, రైతు, యువత వంటి ఐదు డిక్లరేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఆగస్టు 15లోపు మీరు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తే రాజీనామా చేస్తా. జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుంటా.

నా ఓపెన్ లెటర్ హెడ్ ను గాంధీ భవన్ కు పంపిస్తా. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా రాసి పెట్టుకో. నీవు కూడా రాజీనామా లేఖ రాసి పెట్టుకో. ఎక్కడ డిపాజిట్ చేద్దామో చెప్పు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. రిజర్వేషన్లు తీసేస్తామని బీజేపీ ఎక్కడ రాసింది? అత్యధికంగా రాజ్యాంగాన్ని మార్చిన పార్టీ కాంగ్రెస్. ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ లకు అన్యాయం చేసింది వాస్తవం కాదా? స్థానిక సంస్థల్లో బీసీల పేరుతో ముస్లింలు గెలిచిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనారిటీలకూ 10శాతం రిజర్వేషన్లు ఇస్తుంది. మైనారిటీలను చేతి కింద పెట్టుకుని వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేయలేదా? కాంగ్రెస్ 300 సీట్లలో కూడా పోటీలో లేదు.

రీజనల్ పార్టీలకు ఎక్కువ, జాతీయ పార్టీలకు తక్కువ కాంగ్రెస్. 40 సీట్లు కూడా గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ ది. ఇలాంటి పార్టీ తరఫున రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎలా అమలు చేస్తారు. అందుకు సంబంధించిన నిధులు ఎక్కడ నుంచి తెస్తారు? రేవంత్ రెడ్డికి ఉన్న క్రెడిబులిటీ ఏంటి? హామీలను నెరవేర్చడం కోసం చాలెంజ్ లు ఎందుకు వేస్తున్నారు?” అని విరుచుకుపడ్డారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

Also Read : రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు సాయం అడిగారు- కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు