సారు మైండ్‌గేమ్‌ను సీఎం రేవంత్‌ ప్లే చేస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి?

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లానే ఆసక్తికరంగా మారింది. 26 మంది చేరితే విలీనం.. లేకపోతే...

Gossip Garage : మేం గేట్లు ఎత్తేస్తే బీఆర్‌ఎస్‌లో ఒక్కరూ ఉండరు అంటారు సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరేందుకు 29 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటారు ఇంకో మంత్రి… ఇదిగో వీళ్లంతా హస్తం గూటికి వచ్చేస్తారంటూ పేర్లతో సహా చెప్పేస్తారు మరో నేత.. ఫలానా ఆయన కాంగ్రెస్‌లో చేరికకు డేట్‌ కూడా ఫిక్స్‌ అయిపోయిందంటారు ఇంకొకరు. ఇంతకీ కారు దిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నవారెందరు.. అంతన్నారు.. ఇంతన్నారు.. కానీ ఇప్పటికి ఐదుగురే చేతిని అందుకున్నారు. ఈ ఐదుగురిని కాపాడుకోడానికి కాంగ్రెస్‌ ప్లే చేస్తున్న మైండ్‌ గేమా లేక నిజంగానే మూడు రంగుల జెండా పట్టడానికి గులాబీ నేతలు ఉత్సాహం చూపుతున్నారా?

టచ్ లో 30 మంది? చేరింది ఐదుగురే..
ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల జంపింగ్‌తో తెలంగాణ రాజకీయం మళ్లీ హీటెక్కింది. బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌కు కఠీఫ్‌ చెప్పేసి కాంగ్రెస్‌ చేతిని అందుకోవడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌ అవుతోంది. అయితే కాంగ్రెస్‌ గెలిచిన నుంచి కారు పార్టీని ఖాళీ చేస్తామని.. తమతో 20-30 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరింది ఐదుగురు ఎమ్మెల్యేలే.. ఈ ఐదుగురిలో ముగ్గురిపై ఇప్పటికే అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది బీఆర్‌ఎస్‌. ఐతే అధికార పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు పడుతుందా? అనర్హత వేటు నుంచి తప్పించుకోడానికి ఇంకేమైనా ప్లాన్‌ చేస్తున్నారా? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.

వారిని రక్షించేందుకు కాంగ్రెస్‌ అనుసరించబోయే విధానం ఏంటి?
డిసెంబర్‌లో కాంగ్రెస్‌ గద్దెనెక్కినా, పార్లమెంట్‌ ఎన్నికల వరకు జంపింగ్స్‌ను పెద్దగా ప్రోత్సహించలేదనే చెప్పాలి. అయితే గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను పదునెక్కిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఎపిసోడ్‌ను బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఊహించలేదు. పోచారం ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లగా, సంజయ్‌ ఆల్‌ ఆఫ్‌ సడన్‌గా రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ జోరు పెంచుతుందనే టాక్‌ వినిపిస్తోంది. ఐతే ఇలా పార్టీ మారుతున్న నేతలపై అనర్హత కత్తి వేలాడుతుండటం… వారిని రక్షించేందుకు కాంగ్రెస్‌ అనుసరించబోయే విధానమే ఇప్పుడు అందరి మెదళ్లను తొళిచేస్తోంది.

ఆ పార్టీ శాసన సభాపక్షం విలీనమైనట్లు చేస్తేనే వారికి రక్షణ..
బీఆర్ఎస్‌ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు వస్తేనే.. ఇప్పుడు చేరిన ఐదుగురి ఎమ్మెల్యేలు సేఫ్‌గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. బీఆర్‌ఎస్‌ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలను లాగేసి ఆ పార్టీ శాసన సభాపక్షం విలీనమైనట్లు చేస్తే… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు రక్షణ ఉంటుందంట… అలా కాని పక్షంలో ఐదుగురిపై అనర్హత వేటు పడటం తప్పనిసరి అని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ నెల 27న దీనిపై హైకోర్టు విచారించనుంది. హైకోర్టులో తేడా వస్తే సుప్రీంలో సవాల్‌ చేయడానికి కూడా రెడీ అవుతోంది బీఆర్‌ఎస్‌.

కేసీఆర్ దారిలోనే కాంగ్రెస్ ప్రయాణం..!
బీఆర్‌ఎస్‌ పిటిషన్లతో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రక్షించుకోవడంపై ఒత్తిడి ఎదుర్కొంటోంది కాంగ్రెస్‌. 26 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించాలని ఆ పార్టీ ప్లాన్‌ చేస్తే.. ఇప్పటికి వలకు చిక్కింది కేవలం ఐదుగురే.. మిగిలిన వారు కారుతోనే మా ప్రయాణమంటేనే చిక్కులు ఎదుర్కోవాల్సి వుంటుందని భావిస్తోంది కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం. ఐతే దీనికి ప్లాన్‌ బీ కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మాజీ సీఎం కేసీఆర్‌ అనుసరించిన విధానాన్ని పాటించి ఎమ్మెల్యేలను సేఫ్‌గా ఉంచాలని చూస్తోంది.

అయితే విలీనం.. లేకపోతే రాజీనామాలు..
ప్రస్తుతానికి కాంగ్రెస్‌ రెండు ఆప్షన్లను ఎంచుకుంది. అందులో మొదటిది పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రచారం చేసి.. గోడ దూకే విషయంలో మీమాంస ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తమవైపు వచ్చేలా చేసే వ్యూహం ఒకటి కాగా, రెండోది ప్రస్తుతం చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలతో స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచడం. ఇలా చేయడం వల్ల అనర్హత వేటు నుంచి ఎమ్మెల్యేలను రక్షించవచ్చనేది కాంగ్రెస్‌ నేతల ప్లాన్‌. దీనికోసం ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు తీర్పును తెరపైకి తెస్తున్నారు. అదే సమయంలో అనర్హత విషయంలో మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని ఈ మధ్యే సుప్రీంకోర్టు సూచించింది.

Also Read : కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సంజయ్ చిచ్చు.. రాజీనామాపై వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి..!

అయితే సుప్రీంకు చిక్కకుండా ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం అనేది పూర్తిగా స్పీకర్‌ అధికార పరిధిలో ఉంటుందనేది హిమాచల్‌ హైకోర్టు తీర్పును తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాన్ని ఎంచుకుంటోంది హస్తం పార్టీ. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లానే ఆసక్తికరంగా మారింది. 26 మంది చేరితే విలీనం.. లేకపోతే రాజీనామాలతో గేమ్‌ప్లాన్‌ రక్తికట్టించాలని చూస్తోంది కాంగ్రెస్‌ నాయకత్వం.

ట్రెండింగ్ వార్తలు