Andra pradesh : ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ

ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది.

Andra pradesh : ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. అర్హత ఉన్నా తమకు పెన్షన్ నిలిపివేశారు అంటూ మంత్రి అంబటి రాంబాబును ఓ మహిళ నిలదీసింది. వికలాంగుడైన తన తమ్ముడికి పెన్షన్ రావట్లేదని..అధికారుల్ని ఎంతగా ప్రాధేయపడినా పట్టించుకోవటంలేదని ఇదేనా మీ పాలన ఇదేనా ప్రజలకు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న సంక్షేమ పథకాలు అంటూ కడిగిపారేసింది. అర్హత ఉన్నా పెన్షన్ ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. వాలంటీర్లు ఉద్ధేశపూర్వకంగా తన పెన్షన్ ఆపేశారని బాధిత వికలాంగుడు ఆవేదన వ్యక్తంచేశాడు.

దీంతో మంత్రి అంబటి రాంబాబుకు ఏం చేయాలో తోచక మీకు న్యాయం చేస్తామని పెన్షన్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలపైనా..మహిళలు మంత్రి అంబటిని నిలదీశారు. సమస్యలను పరిష్కరిస్తాం అని అంబటి హామీ ఇచ్చారు. కాగా..పల్నాడు జిల్లా సత్తెనపల్లి మడలం కంటెపూడిలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కూడా మంత్రి అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ తగిలింది. ఈ సెగ మాత్రం సొంతపార్టీ నుంచే తగలటం గమనించాల్సిన విషయం. టీడీపీ మద్దతుతో సర్పంచిగా గెలిచిన వారికి మంత్రి గ్రామంలో ప్రాధాన్యమిస్తున్నారని గ్రామ వైసీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన గళం విప్పాయి. వైఎస్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.

పార్టీ నేతలు సముదాయించినప్పటికీ పట్టు వీడిచిపెట్టకుండా ఆందోళన కొనసాగించారు. గ్రామంలో మరోచోట కూడా మంత్రితో వైసీపీ నాయకుడు ఒకరు వాగ్వాదానికి దిగారు. తన తండ్రి చనిపోయి ఏడాది గడిచినా తల్లికి పెన్షన్ మంజూరు చేయలేదంటూ గ్రామ వాలంటీరును వైసీపీ నేత ఒకరు నిలదీయగా సదరు వ్యక్తిమీద వాలంటీరు వాగ్వాదానికి దిగారు. ఏంటి..నోరు లేస్తోంది అని అనేసరికి ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో అధికారులు సముదాయించినా సదరు వ్యక్తి ఏమాత్రం తగ్గకపోయేసిరికి మంత్రి అంబటి చేసేదేమీ లేక మరో ఇంటి వైపు వెళ్లారు. అలా ఆరోజు దాదాపు అంబటికి నిరసనలు తప్పలేదు. రైతు భరోసా రాలేదని కొందరు..పెన్షన్లు రావటంలేదని మరికొందరు మహిళలు మంత్రిని నిలదీశారు.

గతంలో రూ.10,000 సహాయం అందేదని, ఇప్పుడు రూ.3వేలు మాత్రమే ఇస్తున్నారని పక్షవాతంతో బాధపడుతున్న ఒక మహిళ కన్నీటితో మంత్రిని ప్రశ్నించింది. దీంతో మంత్రి రాంబాబు తనకు తోచిన సమాధాలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో వైసీపీ నేతలకు వ్యతిరేకతలే ఎక్కువగా ఎదురు అవుతుండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు