Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

పాలకొండలో విశ్వసరాయి కళావతి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆమెకు మంచి పట్టు ఉంది. ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం అయినా.. పాలకొండ, వీరఘట్టం మండలాల్లో తూర్పు కాపులు ప్రధాన సామాజికవర్గంగా ఉన్నారు. పాలవలస కుటుంబానికి నియోజకవర్గ రాజకీయాల్లో మంచి పట్టు ఉంటుంది.

Araku Lok Sabha Constituency : దూరంగా కొండలు.. దగ్గరగా పొగమంచు.. ప్రకృతి పరిచయం చేసే అనుభూతులు.. అరకు అంటే గుర్తొచ్చేది ఇదే కదా ! నిజమే.. అరకు ఎంత కూల్‌గా ఉంటుందో.. ఇక్కడి రాజకీయాలు అంత హాట్‌గా ఉంటాయ్‌. మాటల్లో, ఇక్కడి మనుషుల్లో అమాయకత్వం కనిపిస్తుందేమో.. నిర్ణయాల్లో, ఇచ్చే తీర్పులో కాదు ! అరకుతో పాటు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ ఫలితాలు చూస్తే అర్థం అయ్యేది ఇదే ! అరకు ఎంపీ స్థానం.. వైసీపీకి కంచుకోటలా ఉంది. పేరుకే గిరిజన ప్రాబల్యం ఉన్న స్థానం అయినా.. మిగిలిన సామాజికవర్గాలు కూడా అదేస్థాయిలో గెలుపోటములను శాసిస్తాయ్‌. మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న అరకు పార్లమెంట్‌.. వైసీపీకి ఆయువు పట్టులాంటిది. మరి వచ్చే ఎన్నికల్లోనూ ఈ పట్టును ఫ్యాన్‌ పార్టీ నిలుపకుంటుందా.. మరోసారి గెలిచి.. గెలుపు అలవాటుగా మారిందని చెప్పుకుంటుందా.. వైసీపీ కోటను బద్దలుకొట్టేందుకు టీడీపీ సిద్ధం చేసిన వ్యూహాలేంటి.. రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగబోయే రేసుగుర్రాలు ఎవరు.. ఏ పార్టీ బలం ఏంటి.. బలహీనత ఏంటి..

READ ALSO : Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన !

మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా… రాజకీయాలకు వార్ జోన్‌గా
పచ్చదనం కప్పుకున్నట్లు కనిపించే ప్రాంతం.. అమాయక గిరిజన జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన ప్రాంతం.. అరకు అంటే ఓ ఏరియానే కాదు.. ఎమోషన్ కూడా ! పచ్చదనానికి, చల్లదనానికి కేరాఫ్ అయిన అరుకులో.. రాజకీయాలు అంతే హాట్‌గా ఉంటాయ్ మరి! గిరిజన జీవనశైలిలో మాత్రమే అమాయకత్వం కనిపిస్తుంది. రాజకీయాల్లో చైతన్యం ఉంటుంది. తీర్పు ఇవ్వడంలో ఎలాంటి తడబాటు ఉండదు. 2019ఎన్నికల్లో స్పష్టమైన తీర్పుతో వైసీపికి తిరుగులేని విజయాన్ని అందించారు గిరిజన ఓటర్లు. ఒకప్పుడు మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉన్న ఈ ప్రాంతం… ఇప్పుడు రాజకీయాలకు వార్ జోన్‌గా మారింది. అరకు పార్లమెంట్‌కు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. సామాన్యులను నాయకులుగా మార్చిన ఘటన సొంతం ఈ లోక్‌సభ సెగ్మెంట్‌ది !

goddeti madhavi, Kishore Chandra Dev

వివాదాలకు దూరంగా… ప్రజాసేవలో ముందుండే గొడ్డేటి మరోసారి అరకు బరిలో నిలిచేనా..

అరకు లోక్‌సభలో గొడ్డేటి మాధవి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ఇప్పుడు పార్లమెంట్‌లో అధ్యక్ష అనే స్థాయికి ఎదిగారు. 2019లో తొలి ప్రయత్నంలోనే టీడీపీ అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి కిషోర్ చంద్రదేవ్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించి.. అతి చిన్న వయసులో ఎంపీ అయిన మహిళగా రికార్డ్ క్రియేట్‌ చేశారు. వివాదాలకు దూరంగా ఉంటూ.. ప్రజాసేవలో ముందుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు మాధవి. ఐతే ఈసారి అరకు పార్లమెంట్‌ బరిలో నిలిచేందుకు ఆమె ఆసక్తి చూపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. సొంత నియోజకవర్గమైన పాడేరు నుంచి.. అసెంబ్లీకి పోటీ చేయాలని మాధవి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పాడేరు నుంచి పోటీకి లైన్ క్లియర్ అయితే.. వైసీపీ తరఫున లోక్‌సభ బరిలో మాజీ ఎమ్మెల్యే కుంబ రవిబాబు నిలిచే అవకాశాలు ఉన్నాయని టాక్‌. ఇక విపక్ష పార్టీల నుంచి ఎంపీ బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో పక్కా క్లారిటీ లేకపోయినా.. టీడీపీ నుంచి కిషోర్ చంద్రదేవ్ పేరు వినిపిస్తోంది. ఐతే 2019ఎన్నికల తర్వాత ఆయన పూర్తికే ఢిల్లీకే పరిమితం అయ్యారు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

అరకు పార్లమెంట్ పరిధిలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయ్. ఇందులో పార్వతీపురం ఎస్సీ రిజర్వ్‌డ్‌ కాగా.. మిగిలిన ఆరు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్‌డ్‌. ఈ ఏడు స్థానాల్లోనూ వైసీపీకి తిరుగులేని పట్టు ఉంది.

bhagyalakshmi, eswari

READ ALSO : Anakapalle Lok Sabha Constituency : పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్

పాడేరులో అధికార పార్టీ ఎమ్మెల్యేకు అసమ్మతి సెగలు…

పాడేరు అసెంబ్లీ.. వైసీపీకి మొదటి నుంచి కంచుకోటగా నిలుస్తోంది. కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. గెలిచిన మొదట్లో ఎమ్మెల్యే పనితీరు మీద సానుకూలత కనిపించినా.. ఆ తర్వాత పార్టీలో వ్యతిరేకత పెరగడం మొదలైంది. సీనియర్లను లెక్కచేయరని.. సొంత సామాజికవర్గానికే పట్టం కడుతున్నారనే విమర్శలు భాగ్యలక్ష్మీ మీద వినిపిస్తున్నాయ్. ఎమ్మెల్యే ఆధిపత్య ధోరణి ఇబ్బందికరంగా మారిందననే ఫిర్యాదులు.. హైకమాండ్ వెళ్లాయ్‌. సీనియర్లు ఎవరికి వారు చాపకింద నీరులా టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరు మారకపోతే.. ఎలాంటి పరిణామాలు అయినా జరగొచ్చు అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పోరాడుతున్నా.. క్షేత్రస్ధాయిలో బలోపేతం కాలేకపోవడం ఇబ్బందికరంగా మారింది. పాడేరు మండలంలో తప్ప… మిగిలిన చోట్ల టీడీపీ వీక్‌గా ఉంది.

palguna, sravan

అరకు వ్యాలీలో బలహీనంగా టీడీపీ…

అరకు వ్యాలీ అసెంబ్లీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. చెట్టి ఫల్గుణ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకే మళ్లీ టికెట్ ఖాయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఐతే సామాజిక సమీకరణాలు, ఎమ్మెల్యే పనితీరు ఆధారంగా.. ఇక్కడ మార్పు తప్పదు అని అధికార పార్టీలోని వ్యతిరేకవర్గం వాదన. స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ… తన వ్యతిరేక వర్గం గెలవడం ఎమ్మెల్యే ఫల్గుణకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఇక అటు అరకు వ్యాలీ టికెట్‌ కోసం సీనియర్లు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఎంపీ మాధవి పాడేరు లేదా అరకు వ్యాలీలో పోటీకి సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఫల్గుణ అలర్ట్ అయ్యారని.. టికెట్ విషయంలో తన మార్క్‌ రాజకీయం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి మాజీమంత్రి శ్రవణ్ మరోసారి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఆయనతో పాటు మరో ముఖ్య నేత దొన్ను దొర కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే అరకు వ్యాలీలో టీడీపీ బలహీనంగా ఉంది. అధికార పార్టీ బలహీనతలు కలిసి వస్తే తప్ప.. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇక్కడ టీడీపీ కోలుకునే వాతారణం కనిపించడం లేదనే ప్రచారం సొంత పార్టీలోనే వినిపిస్తోంది.

READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం

 

kurupam

కురుపాంలో వరుసగా రెండుసార్లు గెలిచినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయిన పుష్పశ్రీవాణి…

కురుపాం నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన పుష్పశ్రీవాణి.. హ్యాట్రిక్‌ విక్టరీ మీద కన్నేశారు. ఐతే జనాల నుంచి ఎమ్మెల్యే విషయంలో భిన్న స్పందన వినిపిస్తోందనే చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పుష్పశ్రీవాణి విఫలం అయ్యారనే విమర్శలు ఉన్నాయ్. డిప్యూటీ సీఎంలాంటి కీలక పదవి వరించినా…. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారనేది ప్రధాన ఆరోపణ. ఇక సొంత కుటుంబం నుంచే వర్గపోరు.. పుష్పశ్రీవాణికి ఇబ్బందిగా మారింది. బంధువులు అయిన శత్రుచర్ల చంద్రశేఖర్‌ కుటుంబంతోనూ.. శత్రుచర్ల విజయరామరాజుతోనూ రాజకీయంగా దూరం అయిన పరిస్థితి. ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం, పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం, ఇసుక అక్రమ తవ్వకాల్లాంటి వ్యవహారాలు పుష్పశ్రీవాణికి మైనస్‌గా మారాయ్‌. పార్టీలో గ్రూప్‌ రాజకీయాలు కూడా ఆమెకు ఇబ్బందిగా మారాయ్‌. ఐతే ఇక్కడ పుష్పశ్రీవాణిని కాదని, టికెట్ ఆశించే నేత ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే అని పుష్పశ్రీవాణి ధీమాతో ఉన్నారు.

READ ALSO : Kammam Politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయం… గులాబీ పార్టీలో గ్రూపుల గుబులు

తోయిక జగదీశ్వరిని ప్రోత్సహిస్తున్న శత్రుచర్ల వర్గం

అదే క్రమంలో కురుపాంలో వైసీపీ సీన్ అలా ఉంటే.. వర్గపోరుతో టీడీపీ రగిలిపోతోంది. ఇక్కడ సైకిల్ పార్టీ రెండుగ్రూపులుగా విడిపోయింది. టికెట్ ఆశిస్తున్న వారి లిస్టు కూడా భారీగానే ఉంది. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఒకవర్గం వైపు కొమ్ము కాస్తుండగా… ఈయనకు వ్యతిరేకంగా మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకుడు దత్తి లక్ష్మణరావు మరోవర్గాన్ని నడుపుతున్నారు. పార్టీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న తోయిక జగదీశ్వరిని… శత్రుచర్ల ప్రోత్సహిస్తున్నారు. ఈమెను కాదని, తాను చెప్పిన నేతను రంగంలోకి దించేందుకు దత్తి లక్ష్మణరావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పంచాయితీ అధిష్టానం వరకు వెళ్లింది. ఇక్కడ గిరిజనులతో పాటు బీసీలు అధికంగా ఉండటంతో… దత్తి లక్ష్మణరావు తనకంటూ ప్రత్యేక కేడర్ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలో ఈ వర్గ పోరు… పరోక్షంగా వైసీపీకి కలిసి వస్తుందని తెలుగుతమ్ముళ్లలో వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీ కూడా ఉనికిని చాటుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు… కమలం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుండగా.. అదే నిజం అయితే వైసీపీకి గట్టి పోటీ తప్పదన్నట్లు కనిపిస్తోంది.

kurupam

పార్వతీపురం నుండి వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమౌతున్న జోగారావు

పార్వతీపురంలో అలజంగి జోగారావు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జోగారావు.. పార్టీలో, జనాల్లో తిరుగులేని పట్టు సాధించారు. సామాజికంగానూ, ఆర్థికంగా బలమైన నేత కావడం.. జోగారావుకు భారీ ప్లస్‌. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు జోగారావు సిద్ధం అవుతుండగా.. సీనియర్‌ నేత జమ్మాన ప్రసన్నకుమార్ కూడా టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టిడ్కో ఛైర్మన్‌గా ఉన్న జమ్మానకు.. వైసీపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయ్. ఈ ధీమాతోనే టికెట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్వతీపురంలోనూ టీడీపీని వర్గపోరు వెంటాడుతోంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌కు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మధ్య.. ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరింది. బొబ్బిలి చిరంజీవులు మరోసారి టికెట్ ఆశిస్తుండగా.. తన అనుచరుడిని రంగంలోకి దించేందుకు జగదీష్ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి.. టీడీపీ తరఫున బరిలో నిలవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీలోనూ టికెట్ విషయంలో గట్టి పోటీనే కనిపిస్తోంది. పెద్దగా బలం లేకపోయినా.. బరిలో నిలిచేందుకు భారీగానే ఆసక్తి చూపిస్తున్నారు. ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, సురగాల ఉమా మహేశ్వరరావు, గర్భాపు ఉదయభాను పేర్లు బీజేపీ తరఫున రేసులో వినిపిస్తున్నాయ్.

rajanna dora

రాజన్నదొర ఎంపీ బరిలోనా…తిరిగి సాలూరు అసెంబ్లీ బరిలోనా…

సాలూరులో రాజన్నదొర సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఆయనకే టికెట్ కన్ఫార్మ్ అనే చర్చ జరుగుతోంది. గిరిజనుల్లో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. సమస్యలపై స్పందించే తీరు.. జనాల గుండెల్లో ఆయనకు మంచి స్థానం సంపాదించి పెట్టిందనే టాక్ ఉంది ఇక్కడ ! ఐతే పార్టీలో ఓ వర్గం.. ఆయన బలమైన ఓటుబ్యాంక్‌కు గండికొట్టే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం.. రాజన్నదొరకు ఇబ్బందిగా మారే చాన్స్ ఉంది. ఐతే వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతుండగా.. అదే నిజం అయితే.. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌, ప్రస్తుత జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి.. ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఐతే రాజన్నదొర ఎంపీ బరిలో దిగే అవకాశమే లేదని ఆయన వర్గం అంటోంది. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా.. నాయకత్వలోపం ఇబ్బందిగా మారింది. నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి.. ప్రభుత్వంపై పోరాటంలో మొదట్లో దూకుడు చూపించినా.. తర్వాత స్లో అయ్యారనే అభిప్రాయం ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌తో అనుచరవర్గంతో సంధ్యారాణి వర్గానికి పడడం లేదని.. దీంతో చాలా మండలాల్లో గ్రూప్‌ రాజకీయాలు టీడీపీని ఇబ్బంది పెడుతున్నాయనే చర్చ జరుగుతోంది. సంధ్యారాణితో కలిసి పనిచేసేందుకు… భంజ్‌దేవ్ సుముఖుంగానే ఉన్నా.. ఆయన వర్గీయులు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో పార్టీ రెండువర్గాలుగా విడిపోయింది. ఇది టీడీపీకి బలహీనతగా మారే అవకాశం ఉంది.

kalavathi

పాలకొండ లో హ్యాట్రిసాధించాలన్న పట్టుదలలో సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతి…

పాలకొండలో విశ్వసరాయి కళావతి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆమెకు మంచి పట్టు ఉంది. ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం అయినా.. పాలకొండ, వీరఘట్టం మండలాల్లో తూర్పు కాపులు ప్రధాన సామాజికవర్గంగా ఉన్నారు. పాలవలస కుటుంబానికి నియోజకవర్గ రాజకీయాల్లో మంచి పట్టు ఉంటుంది. గిరిజనులు అధికంగా ఉండే సీతంపేట మండలానికే ఎమ్మెల్యే కళావతి పరిమితం అయ్యారనే చర్చ నడుస్తోంది. అటు పాలవలస కుటుంబానికి, ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ పెరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. టికెట్ విషయంలో కళావతికి ఎలాంటి పోటీ లేదు. గిరిజన ఓటర్ల బలంతో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆమె పట్టుదల మీద కనిపిస్తున్నారు. పాలకొండలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా.. నడిపించే నాయకుడు లేరు. గ్రూప్ రాజకీయాలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయ్. కళావెంకట్రావ్‌ వర్గం, అచ్చెన్నాయుడు వర్గంగా స్థానిక నేతలు విడిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఇంచార్జిగా ఉన్న జయకృష్ణ మరోసారి పోటీకి సిద్ధం అవుతుండగా.. సామాజిక కార్యకర్త పడాల భూదేవితో పాటు.. సీతంపేటకు చెందిన గేదెల రవి గిరిజన గ్రామాలను చుట్టేస్తున్నారు. సమస్యలపై ఉద్యమిస్తూ టీడీపీ టచ్ఇ స్తున్నారు. గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టకపోతే.. టీడీపీకి మరోసారి చేదు అనుభవం ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

rampachodavaram

రంపచోడవరంలో వైసీపీని టెన్షన్ పెడుతున్న అనంతబాబు వ్యవహారం…

ఏపీలో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం రంపచోడవరం. నాగులపల్లి ధనలక్ష్మీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ధనలక్ష్మీకి టికెట్ విషయంలో పోటీ కనిపించకపోయినా.. అనంతబాబు వ్యవహారమే వైసీపీని టెన్షన్‌ పెడుతుందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ వైసీపీలో అనంతబాబుదే హవా. 2014, 2019లో ఫ్యాన్ పార్టీ విజయంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఆయనను గుర్తించిన వైసీపీ.. డీసీసీబీ చైర్మన్‌ పదవి ఇచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా దక్కించుకున్నారు. ఐతే రంపచోడవరం ఏజెన్సీలో వైసీపీని బలోపేతం చేస్తూ.. తిరుగులేని నేతగా ఎదిగిన అనంతబాబుకు ఊహించని షాక్ తగిలింది. గతేడాది డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ప్రధాన నిందితునిగా జైలు పాలవడంతో… నియోజకవర్గంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అయింది. ఇదే అదనుగా టీడీపీ స్పీడ్‌ పెంచింది. పార్టీని స్ట్రాంగ్‌ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో టీడీపీ నుంచి ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో పార్టీలో గ్రూప్‌లు పెరిగిపోయాయ్. ఇప్పుడు అదే ఇబ్బందికర పరిణామంగా మారింది. నియోజకవర్గ ప్రస్తుత ఇంచార్జి వంతల రాజేశ్వరితో పాటు.. సీతంశెట్టి వెంకటేశ్వరరావు, బాబు రమేష్, గొర్ల సునీత పార్టీలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ టికెట్ ఆశిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో… కమ్యూనిస్టు ఓటుబ్యాంకు కూడా కీలకంగా మారింది.

అరకు పార్లమెంట్‌తో పాటు.. ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీకి తిరుగులేని బలం ఉంది. ఐతే ఆ అసెంబ్లీ స్థానాల్లో వర్గవిభేదాలు, గ్రూపు రాజకీయాలు.. అధికార పార్టీకి ఇబ్బందిగా మారాయ్‌. టీడీపీకి కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయ్. ఏమైనా అరకు పార్లమెంట్ ఫైట్ ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. రోజుకో రకంగా మారుతున్న రాజకీయంతో.. చల్లదనానికి కేరాఫ్ అయిన అరకులో.. రాజకీయం వేడివేడిగా మారుతోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు