PBKS vs CSK: పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిమర్జీత్ సింగ్, తుషార్ రెండేసి వికెట్లు తీయగా..

ఘన విజయం
పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై ఇచ్చిన 168 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ ఛేదించలేకపోయింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభసిమ్రాన్ సింగ్ 30, శశాంక్ సింగ్ 27 మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో పంజాబ్ స్కోరు 139-9గా నమోదైంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిమర్జీత్ సింగ్, తుషార్ రెండేసి వికెట్లు తీయగా, శాంట్నర్, శార్దూర్ ఠాకూర్‌కు చెరో వికెట్ దక్కాయి.

కష్టాల్లో పంజాబ్
79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. సీఎస్‌కే బౌలర్లు చెలరేగడంతో పంజాబ్ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు.

పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్
168 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కేవలం 9 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. జానీ బెయిర్‌స్టో(7), రిలీ రోసోవ్(0) అవుటయ్యారు. వీరిద్దరినీ తుషార్ దేశ్‌పాండే అవుట్ చేశాడు.

సీఎస్‌కే ఫస్ట్ బ్యాటింగ్
పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్ 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 168 పరుగుల టార్గెట్ ఉంచింది. పంజాబ్ బౌలర్లు రాహల్ చహర్, హర్షల్ పటేల్ విజృంభించడంతో సీఎస్కే సాధారణ స్కోరుకు పరిమితమైంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అజింక్య రహానే(9) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు.

తర్వాత డారిల్ మిచెల్‌తో కలిసి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరూ కాసేపు పంజాబ్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. జట్టు స్కోరు 69 పరుగుల వద్ద రుతురాజ్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. రుతురాజ్ 21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 32 పరుగులు చేశాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే గోల్డెన్ డకౌటయ్యాడు. మిచెల్‌ 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 30 పరుగులు చేసి 4వ వికెట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా పోరాడి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా హర్షల్ పటేల్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌటయ్యాడు.

పంజాబ్ బౌలర్లలో రాహల్ చహర్, హర్షల్ పటేల్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. సామ్ కరణ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Also Read: ఏంద‌య్యా దూబె ఇదీ.. రింకూ కాద‌ని టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సెల‌క్ట్ చేస్తే.. బ్యాటింగ్ మ‌రిచిపోయావా ఏందీ?

తుది జట్లు

చెన్నై సూపర్ కింగ్స్
అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే

పంజాబ్ కింగ్స్‌
జానీ బెయిర్‌స్టో, రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్

ట్రెండింగ్ వార్తలు