Janasena: చిత్తూరు జిల్లాలో మూడు సీట్లపై జనసేన గురి.. డైలమాలో టీడీపీ నేతలు!

టీడీపీ బలంగా ఉన్నచోట జనసేనకు టికెట్ కేటాయిస్తానని చంద్రబాబు చెప్పడం వెనుక బలమైన కారణం ఉందని చెబుతున్నారు పరిశీలకులు.

how tdp janasena parties sharing assembly seats in united chittoor district?

Janasena TDP Seats Sharing : టీడీపీ – జనసేన పొత్తు ఎత్తుల్లో సరికొత్త లెక్కలు హీట్‌పుట్టిస్తున్నాయి. అధికార వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో పవన్ ద్వారా బలం పెంచుకోవాలని టీడీపీ స్కెచ్ వేస్తోంది.. ఇదే సమయంలో టీడీపీ ఆసరాతో గరిష్టంగా ఎమ్మెల్యే స్థానాల్లో గెలవాలని జనసేన ఆశిస్తోంది. రెండు పార్టీలు ఎవరి లెక్కల్లో వారు ఉండగా.. ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న టీడీపీ నేతలు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ టీడీపీ-జనసేన పొత్తు లెక్కలేంటి? టీడీపీ నేతలకు టెన్షన్ ఎందుకు? తెరవెనుక ఏం జరుగుతోందో చూద్దాం.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి తహతహలాడుతోంది జనసేన.. తిరుపతి, మదనపల్లి, చిత్తూరు నియోజకవర్గాలను తమకు వదిలిపెట్టాలని టీడీపీని కోరుతోంది. ఐతే ఈ మూడు సీట్లు టీడీపీకి అత్యంత ప్రధానం కావడంతో డైలమాలో పడిపోతున్నారు ఆ పార్టీ నేతలు.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జనసేనకు మూడు సీట్లు ఇచ్చే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తిరుపతి నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తే ఆ సీటు వదులుకోడానికి రెడీ అంటూ పవన్‌కే బాబు చెప్పారన్న టాక్.. తిరుపతి నేతల్లో దడపుట్టిస్తోంది.

టీడీపీ బలంగా ఉన్నచోట జనసేనకు టికెట్ కేటాయిస్తానని చంద్రబాబు చెప్పడం వెనుక బలమైన కారణం ఉందని చెబుతున్నారు పరిశీలకులు. రాయలసీమ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే రెండు పార్టీలకు మేలు చేకూరే అవకాశం ఉందని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఐతే పవన్ తిరుపతిలో పోటీకన్నా.. గతంలో తాను పోటీచేసిన నియోజకవర్గాల నుంచే మళ్లీ పోటీ చేస్తానని చెబుతుండటంతో టీడీపీ డైలమాలో పడిపోయినట్లు చెబుతున్నారు.

ఇక ఇదే జిల్లాలో మదనపల్లి సీటును జనసేన ఆశిస్తోంది. స్థానిక నేత రాందాస్ చౌదరి ఇక్కడి నుంచి బరిలో నిలవడం దాదాపు ఖాయంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరఫున రాందాస్ చౌదరి భార్య స్వాతి పోటీ చేసి సుమారు 15 వేల ఓట్లు సాధించారు. త్రిముఖ పోటీలోనే రాందాస్ చౌదరి సత్తా చాటినందున వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు రాందాస్ చౌదరి. అయితే టీడీపీలో ఇక్కడ అర డజనుకు పైగా ఎమ్మెల్యే స్థాయి నేతలు ఉండటంతో.. ఈ సీటుపై పీటముడి పడితోందని అంటున్నారు. జనసేనకు ఈ స్థానాన్ని వదిలిపెడితే టీడీపీ ఆశావహుల పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: సైకిల్-గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్.. బీజేపీపై పవన్ వైఖరి మారిందా?

ఇక మిగిలిన చిత్తూరులోనూ పంచాయితీ అంత సులువుగా తెగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలోనూ టిడిపి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల లెక్క చాంతాడంత ఉంది. ఇంకా చిత్రంగా చిత్తూరులో జనసేనకు ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కూడా ఎవరూ లేరంటున్నారు. మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు కుమారుడు శ్రీనివాస్‌ను పార్టీలో చేర్చుకుని.. ఎమ్మెల్యేగా బరిలో దింపాలని ఆ పార్టీ భావిస్తోందని చెబుతున్నారు. కానీ డీకే కుటుంబానికి జనసేనతోపాటు వైసీపీ, టీడీపీ నుంచీ ఆహ్వానం ఉండటంతో ఎటు వెళ్లాలో ఏ పార్టీ తరఫున పోటీచేయాలో తేల్చుకోలేకపోతున్నారట.. ఇదే సమయంలో జనసేన ఓ అడుగు ముందుకు వేసి చిత్తూరు టికెట్తో పాటు అధికారంలోకి వస్తే జనసేన కోటా కింద మంత్రి వర్గంలో స్థానం ఇస్తామని శ్రీనివాస్కు ఆశ పెడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఎమ్మెల్యేలు, ఎంపీపీలపై మంత్రి బొత్సకు ఆగ్రహమెందుకు?

ఇంకా పొత్తులపై ఎలాంటి వైఖరి తీసుకోకుండానే జనసేన ఇలాంటి హామీలు ఇస్తుండటంపై కలవరపడుతున్నారు టీడీపీ నేతలు.. తమ సీట్లకు ఎసరు పెట్టేలా జనసేన పావులు కదుపుతున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగంగా విభేదించలేక మౌనంగా పరిశీలిస్తూ.. సమయం కోసం ఎదురుచూస్తున్నారు టీడీపీ నేతలు.

ట్రెండింగ్ వార్తలు