భూకబ్జాలపై ఒకేసారి 300మంది ఫిర్యాదు.. పెద్దిరెడ్డిని చుట్టుముడుతున్న వరుస వివాదాలు

సీఎం హోదాలో జగన్‌ ఏపీని పాలించగా, మంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలకనేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

Gossip Garage : గత సర్కారులో రాయలసీమ ప్రాంతానికి ఆయనో సామంతరాజు. ఆయన చెప్పిందే వేదం. తన కనుసైగే శాసనం… అలాంటి నేతకు… ఇప్పుడు అన్నీ కష్టాలే.. ప్రజా తీర్పుతో చేతిలో అధికారం గల్లంతైంది. తాను గెలిచినా.. తన పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి… ఇటు ప్రభుత్వం… అటు ప్రజలు ఒకేసారి దండెత్తుతూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ కష్టకాలం నుంచి బయటపడే మార్గం లేక బిత్తరచూపులు చూస్తున్నారు ఆ నేత… ఒకప్పుడు ప్రభుత్వాన్ని శాసించిన ఆ నేతకు ఇప్పుడెందుకీ పరిస్థితి? అసలేం జరిగింది..? ఏం జరగనుంది?

కొత్త ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులుగా పెద్దిరెడ్డిపై రకరకాల ఆరోపణలు..
వైసీపీలో సీఎం జగన్‌ తర్వాత… నెంబర్‌ టు ప్లేస్‌ ఎవరిది? ఇంకెవరిది… మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే… ఇందులో ఎవరికీ నో డౌట్‌. రాయలసీమకే చెందిన ఈ ఇద్దరు కీలక నేతలు గత ఐదేళ్లు రాష్ట్రాన్ని శాసించారు. సీఎం హోదాలో జగన్‌ ఏపీని పాలించగా, మంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలకనేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఇక ప్రస్తుత అధికార పక్షం కూడా వైసీపీ అధినేత జగన్‌తోపాటు, పెద్దిరెడ్డిని టార్గెట్‌ చేస్తూ అనేక విమర్శలు చేసేది. కాకపోతే ఎన్నికల తర్వాత వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్లాక… జగన్‌కన్నా ఎక్కువగా వివాదాలు పెద్దిరెడ్డినే చుట్టుముడుతున్నాయి. విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్ల దహనం నుంచి… కొత్త ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లో వెలుగుచూసిన ప్రతి వివాదంలోనూ పెద్దిరెడ్డిపైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మదనపల్లి సబ్‌ కలెక్టరేట్‌ ఇన్సిడెంట్‌లో పెద్దిరెడ్డిపై అనుమానాలు..
తక్కువ మాటలు… ఎక్కువ పని చేసే పెద్దిరెడ్డి… తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎక్కడా నోరు మెదపడం లేదు. ఐతే…. ఆయన చుట్టూ ఉన్నవారు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న మదనపల్లి సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ఇన్సిడెంట్‌లోనూ పెద్దిరెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ… ఆ దిశగానే దర్యాప్తు కొనసాగిస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తూ.. సంఘటనకు పెద్దిరెడ్డే కారణమనే అభిప్రాయం వ్యాపించేలా అడుగులు వేస్తోందంటున్నారు.

పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగించేలా అడుగులు..
గత ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగినా… ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించిందీ అధికారులు చెప్పడం లేదు. కానీ, పెద్దిరెడ్డి చుట్టూనే ఉచ్చు బిగించేలా అడుగులు పడుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే తిరుపతిలో పెద్దిరెడ్డి కార్యాలయానికి కార్పొరేషన్‌ నిధులతో రోడ్డు వేసుకున్నారని… ఆ రోడ్డుకు అడ్డంగా గేటు పెట్టారని జనసేన ఆందోళనకు దిగింది. ఈ ఇష్యూ కూడా హైకోర్టు వరకు వెళ్లింది. ఇలా ఉమ్మడి చిత్తురు జిల్లాలో ప్రతి వివాదమూ పెద్దిరెడ్డి చుట్టూనే తిరుగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పెద్దిరెడ్డిపై ఒకేసారి 300 మంది ఫిర్యాదు..
తిరుపతిలో రోడ్డు, మదనపల్లెలోని సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయం వంటివే కాదు. గత 45 రోజులుగా పెద్దిరెడ్డి కేంద్రంగా అనేక వివాదాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా పుంగనూరు మండలంలో 980 ఎకరాలను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు తమ పేర్లపై మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై దర్యాప్తు జరుగుతుండగానే మదనపల్లి సబ్‌ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనమయ్యాయి. దీంతో ఈ సంఘటనకు పెద్దిరెడ్డికి లింకు ఉందనే అనుమానం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. యావత్‌ పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాన్ని మదనపల్లెలో మొహరించింది. దీంతో పెద్దిరెడ్డి బాధితులమంటూ చెప్పుకుంటూ సుమారు 300 మంది ఒకేసారి మదనపల్లి కలెక్టరేట్‌కు తరలిరావడం, పెద్దిరెడ్డి ఆయన అనుచరులు తమ భూములు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

అనుమతులు లేకుండానే రిజర్వాయర్ల నిర్మాణ పనులు..
ఇక గనులు, మైనింగ్‌ లీజులు, ఇసుక తవ్వకాల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పెద్దిరెడ్డి. ఇవన్నీ ఒక ఎత్తైతే తన సొంత నియోజకవర్గం పుంగనూరు… తన తమ్ముడు ద్వారకానాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లిలో మూడు రిజర్వాయర్లను ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణానికి సిద్ధమయ్యారని పెద్దిరెడ్డి కంపెనీపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో ఆవులపల్లి, నేతిగుట్టవారిపల్లి, ముదివేడు రిజర్వాయర్లను పెద్దిరెడ్డికే చెందిన పీఎల్‌ఆర్‌ కంపెనీ చేపట్టింది. దీనికి పర్యావరణ అనుమతులు లేవు. నిర్వాసితులకు పైసా కూడా పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టుల పనులు చేపట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో అక్కడి యంత్రాలను వెనక్కి తీసుకురావాలని ప్రయత్నించారు.

ప్రభుత్వానికి ఆయుధంలా మారిన ప్రజల ఫిర్యాదులు..
ఐతే పెద్దిరెడ్డి తీరుపై అప్పటికే ఆగ్రహంగా ఉన్న రైతులు, నిర్వాసితులు ఆ యంత్రాలను అడ్డుకుని ఆందోళన చేశారు. ఇలా గత 45 రోజులుగా వరుస వివాదాల్లో ఇరుకుంటున్నారు పెద్దిరెడ్డి. ఇప్పుడు ఆయన కుటుంబం భూకబ్జాలపై నేరుగా రైతులు ఫిర్యాదులు చేస్తుండటం కూడా రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. పెద్దిరెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలిస్తున్న ఫిర్యాదులు ఆయుధంగా పనికొస్తున్నాయంటున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌ను పరిశీలిస్తే… మునుముందు పెద్దిరెడ్డికి చిక్కులు తప్పకపోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : షర్మిలతో రాజీపడతారా, బీజేపీని ఎదిరించి ఇండియా కూటమితో జతకడతారా.. వైఎస్ జగన్ దారెటు?

ట్రెండింగ్ వార్తలు