జనసేన వైపు చూస్తున్న మాజీ వైసీపీ నేతలు ఎవరు?

వైసీపీ నేతలు చేరే విషయంలో కూటమిలోని మూడు పార్టీలు ఒకే మాటపై ఉండాలని ఇటీవల నిర్ణయించడంతో వైసీపీ మాజీ నేతల చేరికపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Gossip Garage : శాసనమండలి పక్ష నేత నియామకం వైసీపీలో చిచ్చు రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పార్టీకి రాజీనామా చేయడం వెనుక శాసనమండలిలో వైసీపీ పక్ష నేత కూడా ఓ కారణమా? మాజీ ఎమ్మెల్యేకు… శాసనమండలి పక్ష నేతకు మధ్య లింకేంటి? వైసీపీలో మండలిపక్ష నేత రేపిన మంటలు ఏంటి?

ఏదో కారణం చూపి పార్టీ నుంచి జంప్‌..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల తీరు మారుతున్నట్లు కనిపిస్తోంది. అధికారం కోల్పోవడంతో ఐదేళ్ల పాటు వైసీపీలో కొనసాగలేమని భావిస్తున్న నేతలు.. ఏదో కారణం చూపి పార్టీ నుంచి జంప్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతుండగా, కొందరు ముందుగా పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి పెడదామని భావిస్తున్నారు.

తన మామ కోసమే వైసీపీకి రాజీనామా..!
అలాంటి వారిలో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఒకరు. వైసీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు స్వయంగా అల్లుడైన రోశయ్య 2019లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనను గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా నిలిపింది వైసీపీ. ఐతే పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందిన కిలారి రోశయ్య… ఫలితాలు విడుదల నుంచి పార్టీపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. సమయం చూసుకుని పార్టీని వీడాలని ఇన్నాళ్లు వేచి చూసిన రోశయ్య… మండలిలో శాసనసభాపక్ష నేతగా గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిని నియమించిన వెంటనే… పార్టీకి రాజీనామా చేశారు. వాస్తవానికి లేళ్ల అప్పిరెడ్డికి.. రోశయ్య రాజీనామాకు నేరుగా ఎటువంటి సంబంధం లేకపోయినా… తన మామ ఉమ్మారెడ్డి కోసమే రోశయ్య ముందుగా బయటకు వచ్చినట్లు చెబుతున్నారు.

అందుకే ముందుగా అల్లుడితో పార్టీకి రాజీనామా చేయించారట..
వైసీపీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో క్రియాశీలంగా పనిచేసిన ఉమ్మారెడ్డి… చంద్రబాబుతో విభేదిస్తూ వైసీపీలో చేరారు. ఇక ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత జగన్‌ కూడా సముచిత గౌరవమే ఇచ్చారు. గత ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌ పదవిని కట్టబెట్టారు. ఐతే, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత శాసనమండలిలో విపక్ష నేత హోదాపై కన్నేశారు ఉమ్మారెడ్డి. వైసీపీ పక్ష నేతగా తనకు అవకాశం ఇస్తే.. విపక్ష హోదాతో కేబినెట్‌ సౌకర్యాలు అనుభవించొచ్చని భావించారు. ఐతే తాను ఒకటి తలిస్తే… పార్టీ మరోకటి ఆలోచించింది. ఉమ్మారెడ్డికి బదులుగా గుంటూరు జిల్లాకే చెందిన లేళ్ల అప్పిరెడ్డికి శాసనమండలి వైసీపీ పక్ష నేతగా నియమించింది. ఈ పరిణామం రుచించని ఉమ్మారెడ్డి అసంతృప్తికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ముందుగా తన అల్లుడైన కిలారి రోశయ్యతో పార్టీకి రాజీనామా చేయించారని అంటున్నారు.

జనసేనలో చేరేందుకు ఆసక్తి.. తన వియ్యంకుడైన తిరుపతి ఎమ్మెల్యేతో రాయబారం..
ఇక వైసీపీ నుంచి బయటకు వచ్చిన కిలారి రోశయ్య… జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం తన వియ్యంకుడైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ద్వారా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో చర్చలకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఐతే రోశయ్య, ఉమ్మారెడ్డి ఇద్దరూ ఒకేసారి జనసేనలో చేరతారా? లేక ముందుగా రోశయ్య… తర్వాత ఉమ్మారెడ్డి వెళతారా? అన్న చర్చ జరుగుతోంది. ఐతే వయసురీత్యా తాను వెళ్లే కన్నా.. తన కుమారుడు రాజకీయ భవిష్యత్‌ కోసం అల్లుడు రోశయ్యతోపాటు కుమారుడు వెంకటరమణను జనసేనకు పంపించాలని ఉమ్మారెడ్డి భావిస్తున్నట్లు ఇంకో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైసీపీకి రాజీనామా చేసిన కిలారి రోశయ్య తనతోపాటు కుటుంబ సభ్యులను కూడా జనసేనలోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

గుంటూరు జిల్లా వైసీపీలో కలకలం..
మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గుంటూరు జిల్లా వైసీపీలో కలకలం చెలరేగుతోంది. ఇప్పటికే గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవికి.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి రాజీనామా చేయగా, ఆయన వెనుక రోశయ్య కూడా వైసీపీకి బైబై చెప్పేశారు. ఈ లిస్టులో మరికొందరు ఉన్నారంటున్నారు. ఐతే ఇలా వైసీపీ నుంచి బయటకు వచ్చిన నేతలకు టీడీపీలో అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా జనసేనను ఎంచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదైనా సరే వైసీపీ నేతలు చేరే విషయంలో కూటమిలోని మూడు పార్టీలు ఒకే మాటపై ఉండాలని ఇటీవల నిర్ణయించడంతో వైసీపీ మాజీ నేతల చేరికపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : భూకబ్జాలపై ఒకేసారి 300మంది ఫిర్యాదు.. పెద్దిరెడ్డిని చుట్టుముడుతున్న వరుస వివాదాలు

ట్రెండింగ్ వార్తలు