NDA: 18న హోటల్‌లో ఎన్డీఏ కీలక సమావేశం… టీడీపీకి ఆహ్వానం.. ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ కీలక పరిణామం

జూన్ 3న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చించారు.

Chandrababu-Narendra Modi (File pic)

NDA – TDP: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతుండడం, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు (Lok sabha election 2024) జరగాల్సి ఉన్న వేళ ఏపీ రాజకీయాల్లో శరవేగంగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్డీఏని బలోపేతం చేయడంపై బీజేపీ దృష్టి సారించింది. 2024 ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతను ఎదుర్కొనేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకుంటోంది బీజేపీ.

జులై 18న ఢిల్లీలో ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ, శిరోమణి అకాలీ దళ్, లోక్ జన శక్తి పార్టీలకు ఆహ్వానం పంపింది. ఢిల్లీలోని అశోక హోటల్ లో ఈ సమావేశం జరగనుంది. ఎన్డీఏలో చేరాలని టీడీపీతో పాటు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలతో బీజేపీ అధిష్ఠానం చర్చలు జరిపింది. జూన్ 3న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చించారు.

నిన్న మోదీ, అమిత్ షాతో జగన్ సమావేశమయ్యారు. ఇప్పటికే ఎన్డీఏలో లేకపోయినా పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ.. ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, విభజన హామీలు అమలు చేయడం లేదని 2018, మార్చి 16న ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది.

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్న సమయంలో ఎన్డీఏ కూడా అప్రమత్తమైంది. పాత మిత్రులను మరోసారి దగ్గరకు చేర్చుకుంటోంది. ఏపీ నుంచి ఎన్డీఏలో టీడీపీ చేరుతుందా? వైసీపీ చేరుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. దాదాపు ఐదేళ్లుగా ఆయన ఎన్డీఏకు దూరంగా ఉంటున్నారు.

Bandi Sanjay: హైదరాబాద్ చేరుకున్నాక కిషన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ 

ట్రెండింగ్ వార్తలు