Indian Skimmer : ఆంధ్రాలో అరుదైన అతిథులు… కాకినాడ తీరంలో స్కిమ్మర్ కనువిందు.. ఆసియా ఖండంలోని 230 జాతుల పక్షలు ఇక్కడే

అరుదైన అతిథులు ఇండియన్‌ స్కిమ్మర్‌ (రైనోచోప్స్‌ ఆల్బికోల్లిస్‌) పక్షులు తూర్పు తీరంలో సందడి చేస్తున్నాయి. అంతరించిపోతున్న పక్షుల జాబితాలో వీటిని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఐయూసీఎన్‌) చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా 2వేల 900 వరకు ఈ జాతి పక్షులు ఉంటే.. అందులో 230 పక్షులు కాకినాడ సమీపంలోనే గుర్తించారు.

Indian Skimmer : అరుదైన అతిథులు ఇండియన్‌ స్కిమ్మర్‌ (రైనోచోప్స్‌ ఆల్బికోల్లిస్‌) పక్షులు తూర్పు తీరంలో సందడి చేస్తున్నాయి. అంతరించిపోతున్న పక్షుల జాబితాలో వీటిని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఐయూసీఎన్‌) చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా 2వేల 900 వరకు ఈ జాతి పక్షులు ఉంటే.. అందులో 230 పక్షులు కాకినాడ సమీపంలోనే గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలో సుదీర్ఘ సాగర తీరం, గోదావరి నదీ ప్రవాహంతోపాటు.. విశాలమైన అటవీ ప్రాంతమూ ఉంది. ఏటా వంద జాతులకు చెందిన 30వేల వరకు వివిధ రకాల పక్షులు జిల్లాకు వస్తున్నట్లు అటవీశాఖలోని వన్యప్రాణి విభాగం గుర్తించింది.

104 రకాలకు చెందిన 34వేల 207 పక్షులు:
2020లో నిర్వహించిన ఆసియా ఖండపు నీటిపక్షుల గణనలో 96 జాతులకు చెందిన 26వేల 734 పక్షులు జిల్లాకు వచ్చినట్లు తేలింది. 2021 నాటి తాజా గణనలో 104 రకాలకు చెందిన 34వేల 207 పక్షులు తూర్పునకు వచ్చినట్లు గుర్తించారు. ఇక్కడి విదేశీ, స్వదేశీ అతిథుల్లో పెలికాన్‌, పెయింటెడ్‌ స్టార్క్స్‌, లిటిల్‌ గ్రేబ్‌, లిటిల్‌ కార్మొరెంట్‌, గాడ్‌విత్‌, కాటన్‌ టీల్‌, కేటిల్‌ ఈగ్రెట్‌, కామన్‌ స్నైప్‌, రఫ్‌, వాటర్‌ కాక్‌, బ్రౌన్‌ హెడెడ్‌ గల్‌, రివర్‌ టెర్న్‌, కింగ్‌ ఫిషర్‌ తదితర పక్షులతోపాటు.. అరుదైన ఇండియన్‌ స్కిమ్మర్‌ (నదీ ఊడ్చు పక్షి) వంటివి కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

8శాతం సంతతి జిల్లాల్లోనే:
అరుదైన ఇండియన్‌ స్కిమ్మర్‌ పక్షి జాతి ప్రపంచ సంతతిలో ఎనిమిది శాతం జిల్లాలోనే ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ జాతి పక్షులు పాకిస్థాన్‌లో 15 మాత్రమే ఉన్నట్లు గణనలో తేలింది. మధ్యప్రదేశ్‌లో చంబల్‌, ఒడిశాలో మహానది ప్రాంతాల్లో సంచరించే ఈ పక్షులు అక్కడి నుంచి జిల్లాకు వస్తున్నట్లు బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్‌) ప్రతినిధులు వాటి కాళ్లకు కట్టిన ట్యాగ్‌ల ఆధారంగా గుర్తించారు. కాకినాడకు గతేడాది(2020) 146 పక్షులు వస్తే.. ఈ ఏడాది(2021) 230 వచ్చినట్లు గుర్తించారు. కాకినాడ గ్రామీణంలోని డీప్‌ సీ పోర్ట్‌ వెనక ప్రాంతంలో సముద్ర ఆటుపోట్లతో ఏర్పడిన ఉప్పునీటి కాలువ (క్రీక్‌) దగ్గర ఇవి సంచరిస్తున్నాయి.

అభివృద్ధితో ఆవాసానికి విఘాతం:
ఈ ప్రాంతం కోరింగ వన్యప్రాణి సంరక్షణ విభాగానికి 3 కి.మీ దూరంలో ఉంది. గతంలో డీప్‌ వాటర్‌ పోర్టు ప్రాంతంలో ఈ పక్షులు ఎక్కువగా సంచరించేవి. ఏడో బెర్త్‌ అభివృద్ధితో వీటి ఆవాసానికి విఘాతం కలగడంతో ఇవి కుంభాభిషేకం.. కోరమండల్‌ ప్రాంతాల్లో, యానాం పరిసరాల్లో సంచరిస్తున్నాయి. అరుదైన పక్షుల ఆవాస ప్రాంతాలను పరిరక్షిస్తే ఈ పక్షిజాతుల వృద్ధికి మరింత వీలుందని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.

ప్రమాదంలో స్మిమ్మర్ పక్షి జాతి:
ఉత్తర భారతదేశం, పాకిస్థాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌లోని పెద్ద నదుల్లో, ఆగ్నేయ ఆసియాలోని మెకాంగ్‌ నదిలోనూ ఇండియన్‌ స్కిమ్మర్లు సంచరిస్తుండేవి. ఇప్పుడు వీటి సంఖ్య బాగా తగ్గింది. నదులు, నదీ ముఖద్వారాలు, సముద్ర తీర ప్రాంతాలు.. వీటి నివాస ప్రదేశాలు. ఇవి నదుల్లోని ఇసుక తిన్నెలపై మార్చి నుంచి మే వరకు సంతానోత్పత్తి చేస్తాయి. వేసవిలో వరద ప్రవాహం తగ్గడంతో ఇసుక తిన్నెలపై సంచారం పెరగడం, కుక్కల బెడదతో వీటి గూళ్లు నాశనం అవుతున్నాయి. ప్రమాదకర స్థితిలో ఉన్న ఈ పక్షి జాతులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

ట్రెండింగ్ వార్తలు