Razole: ఏపీ పాలిటిక్స్‌లో హీట్ రేపుతోన్న రాజోలు రాజకీయం.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..

గత ఎన్నికల్లో ఎవరైతే రాపాక విజయం కోసం పనిచేశారో.. ఇప్పుడు వాళ్లే.. అతన్ని ఓడిస్తామంటూ కంకణం కట్టుకున్నారు. దాంతో.. రాజోలు రాజకీయం కాక రేపుతోంది.

Razole Assembly Constituency: ఆంధ్రప్రదేశ్ మొత్తంలో.. జనసేన గెలిచిన ఏకైక సీటు.. రాజోలు. ఇక్కడ.. జనసేన టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే.. ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి.. ఈసారి జనసేన నుంచి రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా పక్కనబెడితే.. గత ఎన్నికల్లో ఎవరైతే రాపాక విజయం కోసం పనిచేశారో.. ఇప్పుడు వాళ్లే.. అతన్ని ఓడిస్తామంటూ కంకణం కట్టుకున్నారు. దాంతో.. రాజోలు రాజకీయం కాక రేపుతోంది. మరి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురుతుందా? ఏ పార్టీ తరఫున ఎవరు బరిలో నిలవబోతున్నారు? రాజోలు సెగ్మెంట్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

కోనసీమలో అత్యంత సుందరమైన ప్రాంతం రాజోలు నియోజక వర్గం. సముద్రతీర ప్రాంతంగా.. అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి వెలసిన ప్రాంతం. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 15 సార్లు ఎన్నికలు జరిగాయ్. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌గా ఉంది రాజోలు. అంతటి వైసీపీ వేవ్‌లోనూ.. రాజోలులో జనసేన జెండా ఎగిరింది. అంతేకాదు.. ఏపీ మొత్తంలో జనసేన గెలిచిన ఏకైక సీటు.. రాజోలు మాత్రమే. ఈ సెగ్మెంట్‌లో మొత్తం నాలుగు మండలాలున్నాయ్. అవి.. సఖినేటిపల్లి, మలికిపురం రోజాలు, మామిడికుదురు. నియోజకవర్గంలో మొత్తంగా లక్షా 86 వేల ఓట్లు ఉన్నాయ్. గత ఎన్నికల్లో స్టేట్ మొత్తంలో ఫ్యాన్ హవా కనిపించినా.. రాజోలులో మాత్రం గాజు గ్లాసే గెలిచింది. ఆంధ్రా మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది.

2019 ఎన్నికల ఫలితాల తర్వాత.. ఏపీ మొత్తం వైసీపీ ప్రభంజనం గురించి ఎంత మాట్లాడుకుందో.. రాజోలులో జనసేన విజయం గురించి కూడా అంతే చర్చించింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్.. తొలిసారి జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకముందు.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో.. వైసీపీ అభ్యర్థిపై కేవలం 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో.. గట్టెక్కారు రాపాక వరప్రసాద్. అయితే.. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో.. రాపాక అధికార వైసీపీ పంచన చేరారు. అభివృద్ధి కోసం.. అధికార పార్టీతోనే ఉండాలనే డైలాగులు చెప్పి.. అధికారికంగా.. అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. తాను గెలిచింది.. జనసేనకున్న ఇమేజ్ వల్లే.. జనసైనికుల కష్టం వల్లో కాదని.. సొంత ఇమేజ్‌తోనే గెలిచానని.. చాలా సార్లు చెప్పారు. దాంతో.. జనసేన క్యాడర్‌కు.. ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరిగింది. అక్కడి నుంచి.. వైసీపీలో బలం పెంచుకోవడంపై ఫోకస్ పెంచారు. అందులో భాగంగానే.. తన కొడుకుని వైసీపీలో చేర్చారు రాపాక. ఆయన మాత్రం వైసీపీ కండువా కప్పుకోకుండా అనధికారికంగా వైసీపీలో కొనసాగుతున్నారు.


వైసీపీ ఆయనకు టికెట్ ఇస్తుందా?

రాజోలు ఎమ్మెల్యే రాపాక.. తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవలే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఆ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయి.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. తాజాగా.. తన ఇంటి దగ్గరున్న పోలింగ్ బూత్‌లో వేసిన దొంగ ఓట్ల వల్లే తాను గెలిచానని చెప్పడం కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓ పక్క జనసైనికులతో విరోధం.. మరో వైపు పూర్తిస్థాయి వైసీపీ క్యాడర్ తనతో లేకపోవడంతో.. రాపాక కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అయితే.. రాజోలులో.. ఎస్సీలు, కాపుల ఓట్లు దాదాపుగా సమానంగానే ఉన్నప్పటికీ.. క్షత్రియ సామాజికవర్గం ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. వాళ్లంతా.. రాపాకకు మద్దతుగానే ఉండటంతో.. ఆయనకే గెలుపు అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే.. వైసీపీ ఆయనకు టికెట్ ఇస్తుందా.. లేదా.. అన్నదే ఆసక్తిగా మారింది.

bonthu rajeswara rao


జనసేన టికెట్ రేసులో మాజీ ఐఏఎస్

మరోవైపు.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు.. ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. జనసైనికులను కలుపుకొని వెళుతూ.. పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఈసారి.. జనసేన టికెట్ రాజేశ్వరావుకు గానీ.. ఆయన కుటుంబీకుల్లో ఎవరికో ఒకరికి వచ్చే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇదే సమయంలో.. ఓ మాజీ ఐఏఎస్ కూడా జనసేన నుంచి టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో రాజోలులో గెలవడాన్ని.. జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవేళ.. తెలుగుదేశంతో పొత్తు కుదిరినా.. ఇక్కడన బలంగా ఉండటంతో.. కచ్చితంగా ఇక్కడ మళ్లీ జనసేన అభ్యర్థినే బరిలోకి దించుతారనే టాక్ వినిపిస్తోంది.

Also Read: దెందులూరులో వైసీపీ హవాకు చింతమనేని చెక్ పెడతారా?

gollapalli surya rao


పార్టీ బలోపేతంపై గొల్లపల్లి దృష్టి

రాజోలులో తెలుగుదేశం విషయానికొస్తే.. 2014లో ఇక్కడ టీడీపీ గెలిచింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పోటీ చేసినా.. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం.. ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. క్యాడర్‌లో జోష్ తగ్గకుండా చూస్తున్నారు. మరోవైపు.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపైనా దృష్టి పెట్టారు. అయినప్పటికీ.. సూర్యారావుపై కొంత వ్యతిరేకత ఉందనే చెప్పాలి. ఇక్కడ గనక టీడీపీ- జనసేన మధ్య పొత్తు కుదిరి.. తెలుగుదేశం అభ్యర్థిని గనక బరిలోకి దించితే.. అతనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

Also Read: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?

Bonthu, Gollapalli, Rapaka


టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..

తెలుగుదేశం, జనసేన గనక కలిసి పోటీ చేస్తే.. వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువేననే ప్రచారం జరుగుతోంది. అలా కాకుండా.. వైసీపీ, టీడీపీ, జనసేన.. విడివిడిగా పోటీ చేస్తే మాత్రం.. వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మొత్తంగా చూసుకుంటే.. రాజోలు రాజకీయం ఏపీ పాలిటిక్స్‌లో హీట్ రేపుతోంది. అందువల్ల.. అక్కడ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపిస్తుందన్న దానిపై.. అంతటా ఆసక్తి నెలకొంది. సిట్టింగ్ సీటును జనసేన నిలుపుకుంటుందా? వైసీపీ నుంచి పోటీ చేసి.. రాపాక సత్తా చాటుతారా? అన్న దానిపై.. రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు