Tomato : ఇదేందయ్యా ఇది ఏడా సూడలె.. టమాటా ఎఫెక్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆ బోర్డులు చూసి కస్టమర్లు షాక్

Tomato : గొడవలు, ఘర్షణలు జరక్కుండా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ముందు జాగ్రత్త పడుతున్నారు.

Tomato Effect : టమాటా.. ఇప్పుడీ పేరు వింటే చాలు జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు చుక్కలను తాకుతున్నాయి. టమాటా రేట్లు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర సెంచరీ దాటేసి దూసుకుపోతుంది. దాంతో ఈ కూరగాయ పేరు వింటే చాలు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక టమాటా ఎఫెక్ట్ మామూలుగా లేదు. హోటళ్ల నిర్వాహాకులకు నిద్ర లేకుండా చేస్తోంది. టమాట దెబ్బకు తమ హోటళ్లలో కొత్త రకం బోర్డులు పెట్టాల్సి వచ్చింది.

ఉప్పు లేని పప్పు టమాటా లేని కర్రీ రుచిగా ఉండదు. శాకాహారం నుంచి మాంసాహారం వరకు అన్ని కూరల్లో టమాటా పడాల్సిందే. కానీ ఇది కొన్ని రోజుల క్రితం. ఇప్పుడా పరిస్థితి లేదు. టమాటా రేట్లు ఠారెత్తిస్తున్నాయి. కిలో ధర రూ.120 నుంచి 160 రూపాయలకు చేరింది. దాంతో ఇళ్లతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగం భారీగా తగ్గించేశారు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

Also Read..Tomatoes Price : పచ్చని కాపురంలో ‘టమాటా’ చిచ్చు .. ఇల్లు వదిలివెళ్లిపోయిన భార్య

ఇంతకుముందు కూరలతో పాటు సాంబారు, రసంలో టమాటో వాడేవారు. అయితే, ఇప్పుడా సీన్ లేదు. కర్రీల్లోనే కాదు రసం, సాంబార్ లోనూ టమాటాను వాడటం లేదు. దాంతో హోటల్స్ లో టిఫిన్, భోజనం చేసే వారు గతంలోని రుచులను పోల్చుకుని టమాటా వేయలేదా అని నిర్వాహాకులను నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల కస్టమర్లు, హోటళ్ల నిర్వాహాకుల మధ్య గొడవలు, ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. దాంతో కస్టమర్లతో ఎందుకొచ్చిన తంటా అని.. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహాకులు జాగ్రత్త పడుతున్నారు. టమాటా కర్రీ అడగొద్దని ఏకంగా బోర్డులే పెట్టేస్తున్నారు. ”కస్టమర్ దేవుళ్లకు ముఖ్య గమనిక.. ఇక్కడ టమాటా కర్రీ అందుబాటులో లేదు.. ఇచ్చట టమాటా కర్రీ అడగొద్దు” అని హోటల్స్, రెస్టారెంట్లలో బోర్డులు తగిలిస్తున్నారు ఓనర్లు.

ఇక నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ పై డాబాలు, రెస్టారెంట్లు ఎక్కువ. ప్రయాణికులు, వాహనాల డ్రైవర్లు వీటిలోనే ఎక్కువగా తింటుంటారు. టమాటా ధర కిలో రూ.20 నుంచి రూ.50 ఉన్నప్పుడు రోజుకు 15 నుంచి 20 కిలోల టమాటా వాడిన నిర్వాహాకులు ఇప్పుడు 2 నుంచి 3 కిలోలతోనే సరిపెడ్తున్నారు. దాంతో సాంబారు, రసం, కర్రీలు రుచిగా ఉండటం లేదని కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. వారికి సమాధానం చెప్పలేక నిర్వాహాకులు సతమతం అవుతున్నారు. తమ పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు. రేట్లు పెంచితే వినియోగదారులకు కోపం, పెంచకపోతే మాకు తీవ్ర నష్టం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read..Alternative To Tomatoes : టమాటాలకు బదులు ఇవి వాడుకోండి .. వంటకాలకు రుచికి రుచీ..డబ్బు కూడా ఆదా..

ట్రెండింగ్ వార్తలు