Alternative To Tomatoes : టమాటాలకు బదులు ఇవి వాడుకోండి .. వంటకాలకు రుచికి రుచీ..డబ్బు కూడా ఆదా..

టమాటా కూర కాదు కదా పప్పులో టమాటాలు కానరావటంలేదు. కనీసం కూరలో రుచి కోసం ఒకే ఒక్క టమాటా వేయాలని మనస్సు కొట్టుకులాడుతున్నా కరెన్సీ నోట్లు కళ్లముందు కదలాడుతున్నాయి. మరి టమాటాలు లేకుండానే కూరలకు రంగు, రుచి వచ్చే బెస్ట్ ఏవో తెలుసుకోండి..

Alternative To Tomatoes : టమాటాలు కొంటేనే కాదు వింటేనే కళ్లముందు కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో ఉన్నాయి ప్రస్తుతం టమాటాల ధరలు. దేశ వ్యాప్తంగా కిలో టమాటాలు రూ.160 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నాయి. దీంతో టమాటా కూర కాదు కదా పప్పులో టమాటాలు కానరావటంలేదు. కనీసం కూరకు రుచి చేర్చేందుకు ఒకే ఒక్క టమాటా వేయాలని మనస్సు కొట్టుకులాడుతున్నా మళ్లీ వెంటనే కరెన్సీ నోట్లు కదలాడుతున్నాయి. ‘ఎందుకులే..అంత ఖరీదు పెట్టి..టమాటా లేకుండా తినలేమా ఏంటీ’అని ఎడ్జెస్ట్ అయి కూరలు వండేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.200లు పెట్టి ఒక్క బిర్యానీ అయినా కొంటున్నాం గానీ రూ.160 పెట్టి కిలో టమాటాలు కొనాలంటే మాత్రం వెనుకాడాల్సి వస్తోంది.

మరి టమాటాలు లేకపోతే కూరలకు రుచి రాదా..? టమాటాలకు ప్రత్యామ్నాయంగా కూరలు,వేపుళ్లు,పులుసు రుచిగా చేసుకోలేమా..?అంటే ఎందుకు చేసుకోలేం..టమాటాలకు ప్రత్యామ్నాయంగా డబ్బులు ఆదాచేసేలా రుచికి రుచి తగ్గేదేలేకుండా వండుకునే కొన్నింటి గురించి తెలుసుకుందాం..ఎంకంటే ఇప్పుడు అవి చాలా అవసరం మరి..టమాటాలు కొనకుండా కూడా కూరలకు రుచి వచ్చేలా..పైగా క్వాంటిటీ పెరిగేలా వాడుకునేవి ఏంటో తెలుసుకుందాం..టమాటా అన్ని కూరల్లోను ఇమిడిపోయి రుచిని పెంచుతుంది. చక్కగా కూరలకు గ్రేవీ వచ్చేలా చేస్తుంది. కానీ ఇప్పుడు టమాటాల ధరలు కొనేలా లేవు. టమాటాలకు బదులుగా ఏమేమి ఉపయోగించుకోవచ్చు చూద్దాం..

ఉసిరి చిన్న ఉసిరి పెద్ద ఉసిరి (amla): ఉసిరిలో సహజంగానే ఆరు రకాల రుచులు ఉంటాయి. చిన్న ఉసిరిని, పెద్ద ఉసిరిని కూడా వాడుకోవచ్చు. పెద్ద ఉసిరిని రాసి ఉసిరి అని అంటారు. దాంట్లో పులుపు ప్రధానమైనది చెప్పాలి. ఉసిరికాయల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. టొమాటో గుజ్జులా ఉసిరి ఉపయోగపడుతుంది. పులుపు ఉండటం వల్ల టమోటాకకు బదులుగా ఉసిరి వాడుకోవచ్చు. అంతేకాదు ఉసిరి కూరల్లో వాడితే టమాటాలాగా గ్రేవీ వస్తుంది. ఉసిరికాయతో అలాంటి గుజ్జు కావాలంటే వాటిని ఉడకబెట్టి..దాంట్లో బెల్లం కలిపితే చక్కటి ప్యూరీ తయారవుతుంది. పుల్లపుల్లగా ఉండే ప్యూరీని కూరలు, సాంబారు, రసంతో పాటు వేపుళ్లలో కూడా కాస్త వేసుకుంటే రుచికి రుచి మాంచి లుక్ కూడా వస్తుంది. ఇక టమాటా గుర్తే రానంత రుచినిస్తుంది ఉసిరి.

పెరుగు : టమాటాకు బదులు పెరుగు వాడుకోవచ్చును. పెరుగు వేసి కూరలు చక్కటి రుచితో పాటు గ్రేవి వచ్చేలా చేస్తుంది. చూడటానికి కూర మంచి లుక్ తో కనిపిస్తుంది. చూడగానే తినాలించేంత ఘుమఘుమలతో నోరూరిస్తుంది. కూరకు చిక్కదనాన్ని కలిగిస్తుంది పెరుగు. వెజ్, నాన్ వెజ్ వంటకాలకు పెరుగు ఎంచక్కా వాడుకోవచ్చు..

మామిడి, ఆమ్ చూర్ : టమాటాకు బదులుగా మామిడిని వాడుకోవచ్చు. మామిడి కాయలు బాగా లభ్యమయ్యే రోజుల్లో వాటిని పొడి చేసుకంటే ఆమ్ చూర్ రెడీ అవుతుంది. అలా మామిడి గుజ్జును గానీ ఆమ్ చూర్ ను గానీ కూరల్లో టమాటాకు బదులుగా వాడుకోవచ్చు.

చాలామంది మామిడికాయలు బాగా అందుబాటులో ఉండే రోజుల్లో కాయల్ని కోసి ఎండబెట్టి ఒరుగుల్లా తయారు చేసి సంవత్సరం అంతా వాడుకుంటారు. అలా మామిడి ఒరుగుల్ని టమాటాలకు బదులుగా వాడుకోవచ్చు. పులుసులు, కూరలు, రసం, సాంబారు వంటివాటిల్లో మామిడి ఒరుగులు, ఆమ్ చూర్ వాడుకోవచ్చు. చక్కటి రుచి కూడా వస్తుంది.

Also Read: పచ్చని కాపురంలో ‘టమాటా’ చిచ్చు.. ఇల్లు వదిలివెళ్లిపోయిన భార్య

వాక్కాయలు : వాక్కాలు అంటేనే పులుపు. పప్పుల్లో వాక్కాయలు వేసుకుంటే ఆ టేస్టే వేరయా అన్నట్లుగా ఉంటుంది. అంతేకాదు వాక్కాయలతో చేసిన పప్పు సూపర్ టేస్ట్. ఇక వాక్కాయలతో పులిహోర చేసుకుంటే రుచి మామూలుగా ఉండదు. వాక్కాలతో చేసే వంటకాలు మంచి రుచితో పాటు చక్కటి గ్రేవీగా నోరూరించేలా తయారవుతాయి.

ఆకుకూరలు : అలాగే పులుపు ఉండే ఆకు కూరలు కూడా కూరల్లో వాడుకోవచ్చు. ఉదాహకరణకు చుక్కకూర, గోంగూర,గంగవావిలికూరలు లాంటివి కూరల్లో చేర్చుకోవచ్చు. వీటి వినియోగం వల్ల చక్కటి గ్రేవీతో పాటు రుచి కూడా వస్తుంది. అంతేకాదు వీటి వినియోగం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నాన్ వెజ్ కూరల్లో చికెన్ గోంగూర, గోంగూర మటన్ వంటి వంటలు చాలా చాలా ఫేమస్ అనే విషయం తెలిసిందే. అలాగే గోంగూర పచ్చి రొయ్యలు వెరీ వెరీ ఫేమస్. మటన్ చుక్కకూర రుచి అద్దిరిపోతుంది.

ఇలా మనస్సుంటే మార్గం ఉంటుంది. టమాటాలు లేకుంటే ఏమి మేమున్నాంగా.. అనే ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి ఈ ప్రకృతిలో.

ట్రెండింగ్ వార్తలు