అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఆడపిల్లల తల్లిదండ్రులకు చెబుతున్నా. అమ్మాయిలు లవ్ ట్రప్ లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

Pawan Kalyan : పంచాయతీరాజ్, పొల్యూషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖ అధికారులతో రివ్యూ చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. జల జీవన మిషన్ కు సంబంధించి ఎన్ని పంచాయతీలకు నీరు అందించగలుగుతున్నాం అనే అంశాలపై సమీక్ష నిర్వహించామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి ఒక సంవత్సరానికి సుమారు 1000 కోట్లు ఇసుక మీదే వస్తుందని, ఇసుక నుండి వచ్చిన ఆదాయంలో కొంత భాగం పంచాయతీలకు రావాల్సి ఉందని, అది రాలేదని పవన్ వెల్లడించారు.

పంచాయతీలకు తిరిగి రావాల్సిన నిధులు రాలేదన్నారు. సుమారు 40 నుంచి 50 పంచాయితీలకు తాగునీటి సదుపాయం లేదన్నారు. పంచాయితీల నుంచి సంపాదించిన డబ్బును తిరిగి పంచాయతీలకు ఇవ్వాలని, అది ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు.

”పంచాయతీల మీద పూర్తి వివరాలు 48 గంటల్లో మీకు తెలియజేస్తాం. హాప్ ఐలాండ్ ఎకో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. స్మార్ట్ సిటీకి సంబంధించి బాధ్యత కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ కి అప్పజెప్పాం. వాతావరణంలో మార్పులు రావడం వల్ల సముద్రం సంవత్సర సంవత్సరానికి ముందుకు వస్తోంది. దానికి నిదర్శనం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. వాతావరణంలో కర్బన్ శాతాన్ని తగ్గించే విధంగా ప్రత్యేకంగా ఆలోచన చేసి పొల్యూషన్ తగ్గించే ప్రయత్నాలు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. పొల్యూషన్ పెంచే ఫ్యాక్టరీలపై ఒక నివేదిక ఇవ్వాలని చెప్పా. 4 జిల్లాల్లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. మడ అడవులను రక్షించుకోవడం అత్యంత కీలకం.

సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ ను కాపాడేందుకు, అభివృద్ధి చేసినందుకు ప్రయత్నం చేస్తున్నా. అన్ని గ్రామాలకు మంచి నీటి సరఫరా ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపై దృష్టి పెట్టాం. గత ప్రభుత్వాలు పంచాయతీ నుంచి డబ్బులు తీసుకున్నాయి. కానీ, వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. ఎక్కడా కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదు. అసలు రావాల్సిన నిధులు ఏమేం ఉన్నాయి అనేదానిపై లోతైన దర్యాప్తు చేస్తున్నాం.

9 నెలలు క్రితం కిడ్నాప్ చేశారని ఒక తల్లి నా దగ్గరకు వచ్చి తెలియజేశారు. తేజస్విని అనే పాపని చదువుకుంటుంటే లవ్ ట్రాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకెళ్లి 9 నెలలైందని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ పాప ఆచూకీని జమ్ములో తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతంగా పనిచేశారు. బెంగళూరు, కేరళ, జమ్మూలో పలు బృందాలుగా గాలింపు చర్యలు చేశారు. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 37వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. నేను మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను అభినందిస్తున్నా. ఆడపిల్లల తల్లిదండ్రులకు చెబుతున్నా. అమ్మాయిలు లవ్ ట్రప్ లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైతే దీనిపై ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు? ఈ అంశాన్ని నేను క్యాబినెట్ లో కూడా మాట్లాడతా.

అన్ని శాఖల్లోనూ ఉద్యోగుల సంఖ్యాబలం పెంచాలి. దాంతోపాటు పోలీసుల్లో కూడా సంఖ్యాబలం పెంచే విధంగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి ఎవరొచ్చినా సుభిక్షంగా, సుఖంగా, సంతోషంగా ఉంటారని చెప్పి అనిపించుకోవాలి. మిస్సింగ్ కేసుల సంబంధించి ఒక ప్రత్యేకమైన సెల్ ని ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేస్తాం” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు