లోక్‌స‌భ‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం.. విపక్షాల నినాదాలతో హోరెత్తిన సభ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌స‌భ‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెబుతున్నారు.

Narendra Modi in Lok Sabha: వికసిత్ భారత్‌ దిశగా రాష్ట్రపతి ప్రసంగం కొనసాగిందని, వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా రాష్ట్రపతి మార్గదర్శనం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం లోక్‌స‌భ‌లో ఆయన మాట్లాడుతూ.. సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మరోవైపు మణిపూర్ అంశంపై చర్చించాలన్న డిమాండ్ తో విపక్ష సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రధాని ప్రసంగిస్తున్నంతసేపు నినాదాలు చేశారు.

నేషన్ ఫస్ట్..
పదేళ్లలో ప్రపంచంలో భారత్ ఖ్యాతి పెరిగిందని, 2024లో లోక్‌స‌భ‌ ఎన్నికల తీరును ప్రపంచ దేశాలు ప్రశంసించాయని ప్రధాని మోదీ తెలిపారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. వికసిత్ భారత్ సిద్ధిస్తోందని, కోట్లాది మంది ప్రజల సంకల్పం నెరవేరుతోందన్నారు. అవినీతి లేకుండా పాలన అందిస్తున్నామని పునరుద్ఘాటించారు. తమ పాలనలో గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్‌ చేశాం
ప్రజలు తమపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజలంతా తమవైపే ఉన్నారని, బుజ్జగింపు రాజకీయాలను వారు తిర్కరించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు 100 లోపు సీట్లకు పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి క్లీన్‌స్వీప్‌ చేసిందని తెలిపారు. కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందని, తమిళనాడులో గట్టిపోటీ ఇచ్చామన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలో గతంలోకన్నా ఎక్కువ ఓట్లు సాధించామని చెప్పుకొచ్చారు.

Also Read: హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే కాదు: లోక్‌స‌భ‌లో రాహుల్ గాంధీ

”2014కు ముందు అన్నీ కుంభకోణాలే. రూపాయిలో 85 పైసలు అవినీతి జరిగేది. బొగ్గు కుంభకోణంలో ఎంతో మంది పెద్దల చేతికి మసి అంటుకుంది. 2014కు ముందు కొందరు బ్యాంకులను లూటీ చేశారు. ఇప్పుడు బ్యాంకుల పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. తీవ్రవాద కార్యకలాపాలు బాగా తగ్గాయి. 2014కు ముందు ఎంతో మంది సైనికులు అమరులయ్యారు. ఇప్పుడు తీవ్రవాదులకు భారత్ దీటైన జవాబిస్తోంది. గత పదేళ్లలో మొబైల్ ఫోన్ల తయారీలో అతపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించాం. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దూసుకుపోతున్నామ”ని ప్రధాని మోదీ వివరించారు.

ట్రెండింగ్ వార్తలు