హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే కాదు: రాహుల్ గాంధీ
విపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలిసారిగా లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Rahul Gandhi first speech as opposition leader in Lok Sabha
Rahul Gandhi in Lok Sabha: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా లోక్‌సభలో సోమవారం అధికార, విపక్షాల మధ్య వాదోపవాదనలు జరిగాయి. విపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలిసారిగా లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే కాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాడుతుంటే తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. తన ఎంపీ పదవితో పాటు ఇంటిని లాక్కున్నారని వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాము గర్వపడుతున్నామన్నారు.
అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తాం
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ పథకం సైన్యం రూపొందించింది కాదని, నోట్ల రద్దు మాదిరిగానే ప్రధాని కార్యాలయంలో పుట్టిందన్నారు. స్వల్ప కాలిక శిక్షణతో యుద్ధరంగంలోకి అగ్నివీరులను పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చైనా సైనికులు 5 ఏళ్ల పాటు శిక్షణ పొందుతారని, వారి ముందు అగ్నివీరులు భయంతో విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అగ్నివీరులకు అమరవీరుల హోదా దక్కడం లేదని, వారికి పెన్షన్ సదుపాయం లేదని తెలిపారు.
Also Read: బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజకీయ చాణక్యం.. మోదీ సర్కారుకు మెలిక
ప్రొఫెషనల్ పరీక్షలను కమర్షియల్‌గా మార్చారు
నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ విధానాలతో ఉపాధి కల్పన కలగా మారిందన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లో చిచ్చు పెట్టారని.. మణిపూర్ లో మంటలు రాజేశారని మండిపడ్డారు. దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉందని స్వయంగా చెప్పిన ప్రధాని మోదీ.. హఠాత్తుగా ఒక రోజు నోట్లు రద్దు చేశారని గుర్తు చేశారు. ప్రొఫెషనల్ పరీక్షలను కమర్షియల్ గా మార్చారు. ధనవంతుల పిల్లల కోసమే నీట్ పరీక్షను రూపొందించారు. రైతు ఉద్యమంలో 700 మంది రైతులు బలయ్యారని, ఢిల్లీలో రైతుల ఆందోళన చేసిన రహదారి ఇప్పటికీ మూసి ఉందని వెల్లడించారు.