మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా డిమాండ్‌.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని జేడీయూ నిర్ణయం

జేడీయూ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి రాజకీయ చాణక్యం ప్రదర్శించారు.

మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా డిమాండ్‌.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని జేడీయూ నిర్ణయం

Nitish Kumar ask centre for Special Category Status to Bihar

Nitish Kumar: జేడీయూ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. బిహార్‌కు ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఢిల్లీలో శనివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ అంశాన్ని నితీశ్ కుమార్ లేవనెత్తారు. ప్రత్యేక కేటగిరీ హోదా డిమాండ్ చాలా కీలకమైందని ఆయన గుర్తు చేశారు. గత ఏడాది రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తీర్మానాన్ని బిహార్ మంత్రివర్గం ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల రాబడిలో రాష్ట్ర వాటా పెరుగుతుందని జేడీయూ భావిస్తోంది.

వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు పెంచాలని జేడీయూ కేంద్రాన్ని కోరుతోంది. వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు పెంచిన రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కూడా ఆ పార్టీ పట్టుబడుతోంది. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (ఎన్‌డీఏ) విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి జేడీయూ కార్యవర్గం అభినందనలు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ మంచి ఫలితాలు రాబట్టడంతో నితీశ్ కుమార్‌ను కూడా అభినందించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాలను గెలిచిన జేడీయూ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: CRPC రూల్స్‌ ఇక మరింత కఠినం.. అప్‌డేట్ అయిన ఐపీసీ సెక్షన్స్‌.. వివరాలు ఇవిగో

జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సంజయ్ ఝా
నితీశ్ కుమార్ నాయకత్వానికి జేడీయూ జాతీయ కార్యవర్గం మద్దతు తెలిపింది. ఆయన నాయకత్వంలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా ఎన్నికయ్యారు. కాగా, నీట్ యూజీ 2024 అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేసిన జేడీయూ.. సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.