Dadi Veerabhadra Rao: దాడి వాడి ఎందుకు తగ్గిపోయింది.. మళ్లీ యాక్టివ్ అవుతారా?

ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయాలకు దూరమైపోయారా? లేకపోతే పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా? ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్‌.

why dadi veerabhadra rao silent in andhra pradesh politics

Dadi Veerabhadra Rao Silence: రాజకీయాల్లో సీనియర్. మాస్టారూ అంటూ ప్రతి ఒక్కరూ గౌరవించే పెద్దాయన.. ఉత్తరాంధ్రలో (Uttarandhra) కీలక నేత.. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన నుంచి నాలుగేళ్ల క్రితం వరకు విశాఖ జిల్లా (Visakhapatnam District) రాజకీయాన్ని శాసించిన బడా నేత. కానీ, ఏమైందో ఏమో.. తన పార్టీ అధికారంలో ఉన్నా ఆయన మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వంపై ప్రశంస లేదు.. విపక్షంపై విమర్శ లేదు.. రాజకీయాలకే సంబంధం లేనట్లు తెరమరుగైపోయారు సీనియర్ నేత దాడి వీరభద్రరావు. ఉత్తరాంధ్రలో సీనియర్ లీడర్ అయిన దాడి వాడి ఎందుకు తగ్గిపోయింది?

ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయాలకు దూరమైపోయారా? లేకపోతే పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా? ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్‌. ఎన్నికలు తరుముకొస్తున్నా.. రాజకీయంగా దాడి కుటుంబం నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన దాడి వీరభద్రరావు… అనకాపల్లి ఎమ్మెల్యేగా సుదీర్ఘంగా పనిచేశారు. మంత్రిగా కీలక బాధ్యతలు నెరవేర్చారు. టీడీపీ తరఫున శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక అవ్వడమే కాకుండా ఆ పార్టీ తరఫున శాసనమండలి పక్ష నేతగా కూడా వ్యవహరించారు. రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని కారణంతో రెండున్నర దశాబ్దాల బంధాన్ని తెంచుకుని వైసీపీలో చేరారు దాడి వీరభద్రరావు.

రాజకీయ నాయకుడిగానే కాకుండా.. హిందీ భాషా పండితుడిగా.. మాస్టార్‌గా మంచి గుర్తింపు ఉన్న దాడి వీరభద్రరావు విమర్శలు ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. టీడీపీ చీలిక సమయంలో ఎన్టీఆర్‌కు అండగా నిలిచిన 30 మంది ఎమ్మెల్యేల్లో దాడి వీరభద్రరావు ఒకరు. ఆ సమయంలో తన వర్గంలో చేరమని మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినా వద్దనుకున్నారు దాడి.. ఎన్టీఆర్ మరణాంతరం లక్ష్మీపార్వతి వర్గంలో కొనసాగి చంద్రబాబు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు టీడీపీలో చేరి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఇక ఎమ్మెల్సీగా ఉండగా ప్రస్తుత సీఎం జగన్‌పై ఎన్నో పుస్తకాలు రచించారు దాడి. జగన్ లక్ష కోట్లు అవినీతి చేశారని టీడీపీ ఆరోపిస్తే.. దాడి రచించిన పుస్తకంలో ఏకంగా 16 లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడం అప్పట్లో సంచలనమైంది. ఇక ఎమ్మెల్సీగా టీడీపీ కొనసాగించకపోవడంతో తాను తిట్టిన జగన్నే.. జైలుకు వెళ్లి పరామర్శించి సంచలనం సృష్టించారు దాడి.. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమతుంటాయి. తాను తిట్టిన జగన్.. విన్న జగన్.. చూసిన జగన్ వేర్వేరు అంటూ ముఖ్యమంత్రిపై పొగడ్తలు, ప్రశంసలు కురిపించిన వైసీపీలో చేరారు దాడి.

Also Read: అన్ని జిల్లాలకు వైసీపీ నూతన కార్యవర్గం.. ఆ రెండు జిల్లాలు మినహా అంతా పాతవారే..

తాను పనిచేసే పార్టీపై పూర్తి విధేయుత ప్రకటించే దాడి.. ప్రత్యర్థులపై వాగ్దాటితో విరుచుకుపడటంతోనే ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, కొన్నాళ్లుగా వైసీపీ రాజకీయాల్లో తెరమరుగు కావడం విస్తృత చర్చకు దారితీస్తోంది. 2014లో విశాఖ పశ్చిమ నియోజవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ కూడా ఓడిపోయింది. తర్వాత 2019 ఎన్నికల్లో తండ్రికుమారులు ఇద్దరికీ టిక్కెట్లు దక్కలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దాడి వీరభద్రరావు తర్వాత ఆ పార్టీలో చేరిన ఎందరో నేతలకు ఈ నాలుగున్నరేళ్లలో నామినేటెడ్ పదవులు దక్కినా దాడి కుటుంబానికి మాత్రం ఎలాంటి ప్రాధాన్యం లభించలేదు. ఇక ఎప్పుడూ పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే వీరభద్రరావు కూడా తన మాటల దాడిని తగ్గించేశారు. పార్టీ గుర్తించలేదో.. వయోభారంతో రాజకీయాలు వద్దనుకుని ఇంటికే పరిమితమైపోయారో కానీ.. ఆయన నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడం దాడి అనుచరులను అయోమయానికి గురిచేస్తోంది.

Also Read: 24 మందితో టీటీడీ కొత్త పాలక మండలి.. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం

ఎన్నికలు సమీపిస్తుండటంతో దాడి మళ్లీ యాక్టివ్ అవుతారా? లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వైసీపీలో అనకాపల్లి సీటు ఖాళీగా లేదు. అక్కడ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాడి కుమారుడు రత్నాకర్ గతంలో పోటీ చేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను విశాఖ డైయిరీ చైర్మన్ అడారి ఆనంద్‌కుమార్‌కు అప్పగించింది అధిష్టానం. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో దాడి ఏం చేయనున్నారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. టీడీపీలో ఉండగా, ఓ వెలుగు వెలిగిన దాడి వీరభద్రరావు.. ఇప్పుడు ఏ పదవీ లేకుండా ఇంటికే పరిమితం కావడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు