YSRCP MPs On Development : సింగపూర్‌లా ఏపీ రాజధాని కట్టాలంటే రూ.2లక్షల కోట్లు కావాలి- వైసీపీ ఎంపీలు

సింగపూర్ లా రాజధాని కట్టాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలని, ఎక్కడి నుంచి తీసుకొస్తారని వైసీపీ ఎంపీలు ప్రశ్నించారు.(YSRCP MPs On Development)

YSRCP MPs On Development : ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజధాని సహా పలు అంశాలపై వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా టీడీపీ ఎంపీలపై వైసీపీ ఎంపీలు ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ని అనకూడని, స్థాయికి సరిపోని మాటలు టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రూ.48 వేల కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారని, నమ్మడానికి రాష్ట్రంలో చెవిలో పూలు పెట్టుకున్న వారెవరూ లేరని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం 34 నెలల్లో లక్ష 75 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. లక్షా 32 వేల కోట్లు నేరుగా ఖాతాల ద్వారా అందజేశారని వెల్లడించారు. టీడీపీ ఎంపీలు నోటికొచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాగ్ అడిగిన అంశాలపై ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం ఇచ్చారని అన్నారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఆదుకున్నారని వైసీపీ ఎంపీలు చెప్పారు.(YSRCP MPs On Development)

AP Finance : రూ.48 వేల కోట్ల దుర్వినియోగం.. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలి-యనమల

నవరత్నాల రూపంలో రాష్ట్రానికి మంచి చేయాలని ముఖ్యమంత్రి జగన్ చూస్తుంటే.. నవరత్నాలు టీడీపీకి నవ రోగాల్లా కనిపిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు హయాంలో రేషన్ కార్డు, ఇతర సంక్షేమ ఫలాలు అందాలంటే డబ్బులు తీసుకునే వారని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో బెల్టు షాపులు ఉండేవన్నారు. కానీ, ఇప్పుడు ఒక్క బెల్టు షాపూ లేదన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో రాజధానిలో ఒక్క పక్కా భవనం కూడా కట్టలేదన్నారు. సింగపూర్ లా రాజధాని కట్టాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలని, ఎక్కడి నుంచి తీసుకొస్తారని వైసీపీ ఎంపీలు ప్రశ్నించారు.

శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పాలని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కాకూడదా? అని ఆయన అడిగారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. చంద్రబాబు, జగన్ చరిత్ర బేరీజు వేసుకుంటే.. చంద్రబాబు టీడీపీని ఎన్టీఆర్ ఉంచి లాక్కున్నారు… జగన్ సోనియాను ఎదిరించి పార్టీ పెట్టి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారు అని చెప్పారు. టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తోందన్నారు. ఉగాది నాటికి 26 జిల్లాలు ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంటే.. కుప్పం, హిందూపురం పరిస్థితి ఏంటని అడుగుతున్నారని ఎంపీ భరత్ మండిపడ్డారు.

Ambati On Chandrababu : 29న చంద్రబాబు అరాచకాలను బయటపెడతాం-అంబటి రాంబాబు

కాగా, ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రశ్నించింది. ఆదాయానికి మించి అప్పులు తీసుకొస్తుండడంతో ఏపీ ప్రభుత్వం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోందని విమర్శలు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని చెబుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదుట నిరసన సైతం తెలిపారు.

ప్రభుత్వానికి ఆర్థిక క్రమ శిక్షణ కొరవడిందని, వాస్తవాలకు విరుద్ధంగా సీఎం జగన్ మాట్లాడుతున్నారంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ఇతరత్రా అంశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉందని, శ్రీలంక ఆర్థిక పరిస్థితి కంటే ఘోరంగా ఉందని.. త్వరలోనే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Nara Lokesh : ఏపీలో ఏదోరోజు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

రూ.48 వేల కోట్ల లెక్కల విషయాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రస్తావించారు. ఈ డబ్బంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపణలు చేశారు. రూ.48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టారంటే.. స్పెషల్ బిల్లుల పేరిట ఖర్చు పెట్టడం జరిగిందని ప్రభుత్వం చెబుతోందని.. ఒకవేళ ప్రజల కోసం ఖర్చు పెడితే ఆ విషయాలను ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు యనమల. నిధుల దుర్వినియోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఏపీ విషయంలో కేంద్రం ఆర్టికల్ 360 అమలు చేయాలని కోరారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు యనమల.

ట్రెండింగ్ వార్తలు