India Real Estate: రియల్ ఫ్యూచర్.. 2030 నాటికి ఊహకందని రేంజ్ కి రియల్ ఎస్టేట్ మార్కెట్!

India real estate future

India real estate future: రియల్ ఎస్టేట్.. ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడిన రంగం. కేవలం సొంతింటి కలను సాకారం చేసే రంగమే కాదు.. దేశ ఆర్థికరంగానికి చేయూతనిస్తూ.. వ్యవసాయ రంగం  తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది కూడా రియల్ ఎస్టేటే. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రియల్ ఎస్టేట్ రంగం వచ్చే 2030 నాటికి ఎలా ఉండబోతోంది? రానున్న ఏడేళ్లలో నిర్మాణ రంగంలో వచ్చే మార్పులేంటి? భవిష్యత్తులో ఇళ్లు, నివాస స్థలాల ధరలు ఎంతమేర పెరగనున్నాయి?

ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఇల్లు, ఇంటి స్థలం మాత్రమే. కానీ కాలక్రమేనా దేశంలో రియల్ ఎస్టేట్ చాలా రంగాలపై ప్రభావం చూపే రేంజ్కి అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంతో రియల్ ఎస్టేట్కు ఏదో విధంగా సంబంధం ఉండే విధంగా మారిపోయింది. నగరాలు, పట్టణాలు ఎక్కడ చూసినా నిర్మాణాలే కనిపిస్తున్నాయి. అపార్ట్మెంట్లు, కార్యాలయాల భవనాలు, మాల్స్‌, వేర్‌ హౌసింగ్‌, హోటల్స్‌, విద్యాసంస్థల నిర్మాణాలతో పాటూ మౌలిక వసతుల కల్పన కోసం రహదారులు, మెట్రో రైల్‌స్టేషన్ల వరకు పెద్దఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. దేశంలో మౌలిక వసతుల కొరత కారణంగా రానున్న రోజుల్లో ఇంకా భారీ ఎత్తున వీటి నిర్మాణాలు రాబోతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు రాబోయే రోజుల్లో వీటికి ఇంకా డిమాండ్‌ ఉంటుందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి.

India real estate future by 2030

23 శాతానికి పెరగనున్న రియల్ ఎస్టేట్ వాటా
మరీ ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన రంగం రియల్‌ ఎస్టేట్‌. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం వాటా 18.4 శాతంగా ఉండగా 2029-30కి 21 నుంచి 23 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. భారత్ లో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం రియల్ ఎస్టేట్. ఈ రంగంలో ప్రస్తుతం 7 కోట్ల మంది ఉపాధి పొందుతుండగా 2030కి పది కోట్ల మందికి రియాల్టీ రంగం ఉపాధి కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 22 లక్షల మంది ఇంజినీర్లు పనిచేస్తుండగా వచ్చే ఏడేళ్లలో వీరి సంఖ్య 33 లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికి, యంత్రాలు, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ గురించి తెలిసినవారికి, నిర్మాణ రంగానికి సంబంధించి సాంకేతికతలు, సాఫ్ట్‌వేర్లో ప్రావీణ్యులైన వారికి ఉద్యోగ అవకాశాలు అపారంగా పెరగనున్నాయి. 2030 నాటికి నైపుణ్యం కలిగిన ఉద్యోగులు 68.84 లక్షల నుంచి 1.05 కోట్లకు పెరగనున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనా వేస్తోంది.

Also Read: ఒక్కో ప్లాట్ ధర రూ.6 కోట్ల నుంచి రూ.30 కోట్లు.. అయినా తగ్గేదేలే అంటున్న జనం

ట్రిలియన్ డాలర్లకు నిర్మాణ రంగం
ఇక భారత్‌లో 2030 నాటికి నిర్మాణ రంగం ఒక ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకుంటుందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా అంచనా వేస్తోంది. ప్రస్తుతం 650 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల వద్ద ఉన్న రియల్ మార్కెట్, వచ్చే ఏడేళ్లలో మరో 350 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు పెరగనుందని తెలిపింది. పెరుగుతున్న జనాభాకు తగ్గ మౌలిక వసతుల కల్పన, గృహ వసతి కల్పించాల్సి ఉంటుందని.. దానికి తగ్గట్టు భవిష్యత్తులో ఈ రంగం మరింత వృద్ధికి అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 2010లో పట్టణ జనాభా 30 శాతం ఉండగా, 2022లో 37 శాతానికి పెరిగింది. ఇక 2030కి 40 శాతానికి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో 2025 నాటికే నగర, పట్టణ జనాభా 50 శాతానికి రీచ్ అవుతుందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు ఐటీ, ఐటీ ఆధారిత, ఉత్పత్తి రంగాల్లో ఉపాధి అవకాశాలతో రియల్ ఎస్టేట్ మార్కెట్‌ ఊహించని స్థాయిలో పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: రూ.50 లక్షల్లో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్.. శంషాబాద్‌ వైపే భవిష్యత్తు రియల్ ఎస్టేట్

India real estate future by 2030

40 శాతం పెరగనున్న ఇళ్ల ధరలు
ఇక 2030 సంవత్సరానికి రియల్ ఎస్టేట్లో ధరల పెరుగుదల అనూహ్యంగా ఉంటుందని రియాల్టీ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ లో ప్రాంతానికి అనుగుణంగా 8 నుంచి 12 శాతం ఇళ్లు, ఇంటి స్థలాల ధరలు పెరిగాయి. ఇక వచ్చే ఏడేళ్లలో అంటే 2030 నాటికి ధరలు ఎంతమేర పెరుగుతాయో ఊహించలేమంటున్నారు రియల్ రంగ నిపుణులు. సంవత్సరానికి సుమారుగా 5 శాతం ధరలు పెరిగినా 2030 నాటికి 35 నుంచి 40 శాతం ఇంటి ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంటే హైదరాబాద్లో ప్రస్తుతం కోటి రూపాయలు ఉన్న ఇంటి ధర ఏడేళ్ల తరువాత కోటిన్నర అవుతుందన్న మాట. భూముల ధరలు, నిర్మాణ వ్యయాన్ని బట్టి ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అందుకే సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్న వారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు