SBI..Adani : అదానీ గ్రూప్ సంస్థలకు SBI ఇచ్చిన రుణాలు ఎన్నివేల కోట్లో తెలుసా..?!

అదానీకి గ్రూప్ సంస్థలకు SBI ఇచ్చిన రుణాలు ఎన్నివేల కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతున్న వేళ ఇక ఎస్బీఐ పరిస్థితి ఏంటీ అనేలా ఉంది.

SBI Adani : సామాన్యుడు రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును ఎంతో భరోసాతో బ్యాంకుల్లో దాచుకుంటాడు. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకుల్లో అయితే తమ సొమ్ముకు భద్రత ఉంటుందని ఎస్బీఐ వంటి బ్యాంకుల్లో దాచుకుంటుంటారు. కానీ ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ నష్టాల్లో కూరుకుపోతున్న వేళ సామాన్యుడు దాచుకున్న సొమ్ముకు భ్రదత ఉందా? భరోసా ఉందా? అంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అదేంటీ ఎస్బీఐలో డబ్బు దాచుకుంటే భయమేముంది? అనుకోవచ్చు. కానీ భారతదేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రుణదాత అయిన ఎస్బీఐ (State bank Of India) నష్టాల్లో కూరుకుపోయిన అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టింది. ఎస్బీఐ అదానీ గ్రూపుల్లో పెట్టిన పెట్టుబడులు రూ.21,000కోట్లు (2.6 బిలియన్ డాలర్లు). ఈ విషయాన్ని గురువారం (ఫిబ్రవరి 2,2023) ఓ నివేదిక వెల్లడించింది. ఈ విషయాన్ని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా కూడా స్పష్టంచేశారు.

హిండెన్‌బర్గ్ రిపోర్టు తరువాత గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అన్ని కుప్పకూలిపోయాయి.ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగాయని హిండెన్‌బర్గ్ వెల్లడించింది.దీంతో అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన స్టాక్స్ భారీగా నష్టపోతున్నాయి. ఈ పతనం కొనసాగుతునే ఉంది. అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమవుతున్న క్రమంలో దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై చర్చ జరుగుతోంది. అదానీ గ్రూప్‌ సంస్థలు ఎస్‌బీఐ భారీగా ఇచ్చిన రుణాల పరిస్థితి ఏంటీ? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఎస్‌బీఐ అదానీ గ్రూప్ సంస్థలకు సుమారు 2.6 బిలియన్ డాలర్లు ఇచ్చామని..నిబంధనల ప్రకారం ఎంత వరకు లోన్ ఇవ్వాలో అందులో 50 శాతం వరకు అదానీ గ్రూప్‌నకు అందించామని చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. 2.6 బిలియన్ డాలర్లు అంటే ( సుమారు రూ.21.38 వేల కోట్లు). అలాగే.. విదేశాల్లోని ఎస్‌బీఐకి చెందిన సంస్థల ద్వారా మరో 200 మిలియన్ డాలర్లు అందించినట్లు ఓ నివేదిక ఇచ్చిన సమాచారం.

అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు, ప్రస్తుత పరిస్థితులపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా కీలక వ్యాఖ్యలు చేస్తూ.. అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాలపై వెంటనే ప్రభావం ఉంటుందని భావించడం లేదన్నారు. ఇదిలా ఉంటే అదానీ గ్రూప్ సంస్థలు భారీగా నష్టపోతున్న పరిస్థితుల్లో అదానీ సంస్థలకు ఇచ్చిన రుణాలపై వివరాలు అందించాలని బ్యాంకింగ్ రెగ్యూలేటరీ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. దేశంలోని బ్యాంకులను ఆదేశించింది. అయితే, ఆర్‌బీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతు..గురువారం (ఫిబ్రవరి 2)న కూడా దాదాపు 20 శాతం పడిపోయాయి. అదానీ పోర్ట్స్,స్పెషల్ ఎకనామిక్ జోన్ 5% క్షీణించగా, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ మరియు అదానీ ట్రాన్స్‌మిషన్ 10% నష్టపోయాయి.

అదానీ షేర్లు పతనం కొనసాగతున్న క్రమంలో ఏ బ్యాంకులు రుణాలు ఇచ్చాయనే అంశం కూడా చర్చనీయాంశంగా మారిన వేళ ఏఏ బ్యాంకులు ఎంత ఇచ్చాయంటే..పంజాబ్ నేషనల్ బ్యాంక్ 70 బిలియన్ రూపాయలు అందించినట్లు గత నెలలో బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అతుల్ గోయెల్ తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు