Gun License Scam : తుపాకీ లైసెన్స్‌ల కేసులో సీబీఐ 40 చోట్ల దాడులు

అక్రమంగా తుపాకీ లైసెన్సు‌లు విక్రయించిన కేసులో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి ఇంట్లో  సహా 40 చోట్ల  సీబీఐ అధికారులు ఈ ఉదయం దాడులు చేశారు.

Gun License Scam : అక్రమంగా తుపాకీ లైసెన్సు‌లు విక్రయించిన కేసులో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి ఇంట్లో  సహా 40 చోట్ల  సీబీఐ అధికారులు ఈ ఉదయం దాడులు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన షాహిద్ చౌదరితో  పాటు పలువురు అధికారులు ఇళ్లలో కూడా సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారు.

శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా,రాజౌరీ లలో దాడులు నిర్వహించారు. ఇక్బాల్ చౌదరి కథువా,రియాసి,రాజౌరి, ఉధంపూర్ జిల్లాలలో డిప్యూటీ కమీషనర్ గా పని చేసిన కాలంలో ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నకిలీ పేర్లతో వేలాది మందికి తుపాకీ లైసెన్స్ మంజూరు చేసినట్లు చౌదరి పై ఆరోపణలు వచ్చాయి.

షాహిద్ ఇక్బాల్ చౌదరి  2009 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. 2012 నుంచి ఇప్పటి వరకు జమ్ము కాశ్మీర్ కేంద్రంగా రెండు లక్షల నకిలీ తుపాకీ లైసెన్స్ లు మంజూరైనట్లు సీబీఐ అధికారులు తెలిపారు.  ప్రస్తుతం చౌదరి గిరిజన వ్యవహారాల విభాగం అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రెటరీ హోదాలో పనిచేస్తున్నారు. తుపాకీ లైసెన్స్‌ల కుంభకోణం కేసుకు సంబంధించి ఎనిమిది మంది మాజీ డిప్యూటీ కమిషనర్లను కూడా సీబీఐ విచారిస్తోంది.

గతేడాది ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ సహా ఇద్దరు అధికారులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. కుప్వారా డిప్యూటీ కమీషనర్లుగా పనిచేసిన సమయంలో రాజీవ్ రంజన్, ఇత్రాత్ హుస్సేన్ రఫిక్ లు అక్రమంగా లైసెన్స్ లు జారీ చేసివట్లు ఆరోపణలు వచ్చాయి. గతేడాది ఫిబ్రవరిలో ఈ కుంభకోణంలో సంబందంఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్ధిక లావాదేవీలలో అతడి పాత్ర ఉన్నట్టు గుర్తించారు. ఈ కుంభకోణం వెనుక లోతైన కుట్ర ఉందని సీబీఐ గతంలోనే తెలిపింది.

రాజస్థాన్ ఏటీఎస్ ఈ కుంభకోణాన్ని 2017లో బయట పెట్టి 50 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసింది. వీరిలో రంజన్ సోదరుడుతోపాటు తుపాకీ డీలర్లకు  మధ్యవర్తులుగా పని చేస్తున్న వారు కూడా ఉన్నారు.  తుపాకీ లైసెన్స్ ల  కుంభకోణం  దేశంలోనే అతిపెద్ద తుపాకీ  లైసెన్స్ రాకెట్టుగా గుర్తించారు. అప్పటి జమ్ము కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎప్ వోహ్రా  ఈ కేసు దర్యాప్తును సీబీఐ కి అప్పగించారు.

ట్రెండింగ్ వార్తలు