US – Canada: అక్రమంగా సరిహద్దులు దాటుతూ అతిశీతల వాతావరణానికి భారతీయ కుటుంబం బలి

అక్రమంగా సరిహద్దులు దాటుతూ అతిశీతల వాతావరణానికి నెలల వయసున్న పసికందు సహా ముగ్గురు భారతీయులు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

US – Canada: యూఎస్-కెనడా సరిహద్దుల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అక్రమంగా సరిహద్దులు దాటుతూ అతిశీతల వాతావరణానికి నెలల వయసున్న పసికందు సహా ముగ్గురు భారతీయులు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కెనడాలోని ఎమర్సన్ నగర సమీపంలో అమెరికా-కెనడా దేశ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన కొందరు భారతీయులను అమెరికా కస్టమ్స్ అధికారులు పట్టుకోవడంతో ఈ విషయం వెలుగు చూసింది. అమెరికా కస్టమ్స్ అధికారులు, స్థానిక మీడియా కథనాల మేరకు..భారతీయులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు గుంపుగా ఏర్పడి.. కెనడా గుండా అమెరికా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. మానవ అక్రమ రవాణా చేసే ముఠాతో వీరు ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు ఆ ముఠా సభ్యులు.. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్ నుంచి వీరిని అమెరికా సరిహద్దు దాటించేందుకు ప్రణాళిక వేశారు.

Also read: Crime News: లిఫ్ట్ లో అనుమానాస్పద స్థితిలో పనిమనిషి మృతి

మానిటోబా కెనడాలోనే అత్యంత అతిశీతల ప్రాంతం. మైనస్ డిగ్రీల చలి ఉండే ఈప్రాంతంలో నాలుగు అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంటుంది. అటువంటి ప్రాంతంలో చిమ్మచీకటిలో, గడ్డగట్టిన మంచులో నడుచుకుంటూ భారతీయులు బుధవారం నాడు అక్రమంగా అమెరికా సరిహద్దు వద్దకు బయలుదేరారు. ఈక్రమంలో చలికి తట్టుకోలేక ఒక కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి ఇద్దరి పిల్లలు మృతి చెందారు. మృతుల్లో వారాల వయసున్న పసికందు, ఓ యువకుడు కూడా ఉన్నారు. మృతదేహాలను అక్కడే వదిలి సమూహంలో మిగతా సభ్యులు అమెరికా సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ వీరిని యూఎస్ కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. పట్టుకున్నవారిలో ఒకరి వద్ద నవజాత శిశువుకు సంబంధించిన ఆహారం, డైపర్లు, ఇతర వస్తువులు లభించగా, శిశువు గురించి అధికారులు ప్రశ్నించారు.

Also read: Rains in Telangana: తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు

శిశువు మృతి చెందిందంటూ సమూహంలో సభ్యులిచ్చిన సమాచారంతో కెనడా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసిన యూఎస్ అధికారులు సరిహద్దుల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అనంతరం నలుగురి మృతదేహాలను గుర్తించి..ఇరు దేశాల భారత రాయబార కార్యాలయాలకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న షికాగో (యూఎస్)లోని భారత రాయబార కార్యాలయ అధికారులు, టొరంటో (కెనడా)లోని భారత రాయబార కార్యాలయ అధికారులు మృతదేహాలను భారత్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. మృతదేహాల తరలింపుకు సహకరించాల్సిందిగా యూఎస్-కెనడా అధికారులను కోరారు.

మనుషులను అక్రమంగా సరిహద్దు దాటించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కాగా ఇటీవల మెక్సికో, యూకే(బ్రిటన్), కెనడా దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో భారతీయులు అక్రమ మార్గంలో అమెరికా వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం అధికారులు తెలిపారు. గతంలో భారతీయులు ఇటువంటి చర్యలకు పాలపడిన దాఖలాలు లేవని.. గత రెండు మూడేళ్ళుగా అమెరికాకు అక్రమంగా వలస వస్తున్నవారిలో ఎక్కువమంది భారతీయులే ఉంటున్నారని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.

Also read: Andre Russel: బీపీఎల్ మ్యాచ్ లో విచిత్రంగా ఔటైన ఆండ్రే రస్సెల్

ట్రెండింగ్ వార్తలు