ఉడుకుతున్న ఉత్తరప్రదేశ్…పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా ప‌లు న‌గ‌రాల్లో ఆందోళ‌న‌కారులు హింస‌కు దిగారు. ఫిరోజాబాద్, గోర‌ఖ్‌పూర్‌, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహ‌ర్ లో నిర‌స‌న‌కారులు పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. బులంద్‌షెహ‌ర్ లో ఆందోళనకారులపై పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. పలువురు ఆందోళనకారులతో పాటుగా పోలీసులు కూడా గాయపడ్డారు. ఆందోళనకారులపై లీఠీ చార్జ్ కూడాచేశారు.

ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో కూడా అల్ల‌ర్లు జ‌రిగాయి. అక్క‌డ 144వ సెక్ష‌న్ విధించినా.. ఆందోళ‌న‌కారులు భారీ సంఖ్య‌లో రోడ్ల‌పైకి వ‌చ్చారు.  ఫిరోజాబాద్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు మృతిచెందాడు. కాన్పూర్ లో అయితే ఇవాళ ఆందోళనకారులు పోలీసుల జీపును వెంబడించారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ల‌క్నోతో పాటు ప‌లు న‌గ‌రాల్లో పోలీసులు డ్రోన్ల‌తో భ‌ద్ర‌త‌ను స‌మీక్షించారు. ల‌క్నోలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు పోలీసులు చెప్పారు. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ర‌ద్దు చేశారు. గురువారం జ‌రిగిన హింసాఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇంట‌ర్నెట్‌ను నిలిపివేయ‌డంతో అల‌హాబాద్ కోర్టులో ఇవాళ ఆన్‌లైన్ సేవ‌లు స్తంభించాయి.

హింస‌కు దిగితే ఊరుకునేది లేద‌ని యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేయ‌రాద‌న్నారు. ఆందోళ‌న‌కు పాల్ప‌డిన వారిని సీసీటీవీ ఫూటేజ్‌ ద్వారా గుర్తిస్తున్నామ‌న్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా విధ్వంసం సృష్టిస్తే.. వారి ఆస్తుల‌ను జ‌ప్తు చేసి.. ప్ర‌భుత్వ ఆస్తుల‌కు న‌ష్ట‌ప‌రిహారంగా వేలం వేస్తామ‌ని సీఎం వార్నింగ్ ఇచ్చారు. మంగుళూరులో ఇద్దరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోగా,యూపీలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు