Delhi Police Arrest: ఎయిర్‌పోర్ట్‌ల్లో వందల మందిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశంలోని వివిధ నగరాల్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులను మోసగిస్తోన్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Delhi Police Arrest: దేశంలోని వివిధ నగరాల్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులను మోసగిస్తోన్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినేష్ కుమార్ అనే వ్యక్తి విద్యార్థిగా నటిస్తూ ఫ్లైట్ మిస్ అయ్యిందని సాకులు చెప్పి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసేవాడు. వారి నుంచి డబ్బులు అప్పుగా తీసుకుని మళ్లీ వేస్తా అని నమ్మించి తర్వాత మోసం చేసేవాడు.

ఇలా ఇప్పటివరకు వంద మంది వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఎవరికీ కూడా తిరిగి చెల్లించలేదు. వందల మందిని మోసం చేసిన నిందితుడు దినేష్.. ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకుని, తర్వాత తన టార్గెట్‌ ప్యాసింజర్‌ని ఎంచుకుని ఫ్లైట్‌ మిస్సింగ్‌ అంటూ డ్రామా చేస్తాడు.

మోసపోతారు అని నమ్మిన వ్యక్తులను గుర్తించి ఇటువంటి పనిచేసేవాడు. వారి వద్ద డబ్బులు తీసుకుని తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా దినేష్ ఢిల్లీలోని ఐజీ ఎయిర్‌పోర్ట్‌లో యష్‌ రాకేష్ అనే వ్యక్తి నుంచి గూగుల్ పే ద్వారా సుమారు 10 వేల రూపాయలు తీసుకున్నాడు. తర్వాత తిరిగి ఇవ్వలేదు.

యష్‌కి డబ్బులు తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎయిర్‌పోర్టులో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి టెర్మినల్-2 నుంచి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ సమయంలో కూడా ఓ ప్రయాణికుడిని మోసం చేసేందుకు దినేష్ ప్రయత్నిస్తూ ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. దినేష్‌పై వివిధ నగరాల్లో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు