UP Assembly Polls : వివాదంలో కాన్పూర్ మేయర్.. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ ఫొటోలు..!

యూపీలో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో చిక్కుకున్నారు. ఓటు వేస్తూ ఫొటోలు దిగారు.

UP assembly polls : యూపీలో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో చిక్కుకున్నారు. పోలింగ్ బూత్ లోపల ఓటు వేస్తుండగా ఆమె ఫొటో దిగడం వివాదాస్పదమైంది. కాన్పూర్‌లోని హడ్సన్ స్కూల్ పోలింగ్ బూత్‌లో ప్రమీలా పాండే తన ఓటును వినియోగించుకున్నారు. ఈ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ఫొటోలను ఆమె వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అది కాస్తా జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి వెళ్లడంతో మేయర్ పాండేపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీక్రెట్ బ్యాలెట్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆమెపై కేసు నమోదు అయింది. ఓటు వేసేటప్పుడు ఫొటోలు తీయడం.. ఆ ఓటు గోప్యతను ఉల్లంఘించినట్టే అవుతుందని, తద్వారా సదరు వ్యక్తి ఏ గుర్తుకు ఓటు వేశారో తెలిసిపోతుందని అధికారులు అంటున్నారు.

ఓటు హక్కును వినియోగించుకునే సందర్భంలో ఈవీఎం ఫొటోలు తీయ‌డం ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు. ‘హడ్సన్ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో ఓటింగ్ గోప్యతను ఉల్లంఘించారు. సంబంధిత సెక్షన్ల కింద ప్రమీలా పాండేపై FIR నమోదు చేస్తున్నాం’ అని కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం (ఫిబ్రవరి 20)న మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖ రాజకీయ నేతలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ మూడో దశ ఎన్నికల పోలింగ్‌లో 627 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారంలో ఉండగా.. ఈ ఎన్నికల్లో గెలుపుతో అధికారాన్ని చేజిక్కించుకోనేందుకు ఇతర పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. యూపీలో 2.15 కోట్ల మంది ప్రజలు ఓటుకు అర్హులు కాగా.. వారిని ఆకర్షించేందుకు అన్ని పార్టీలు పలు హామీలను గుప్పించాయి. రాష్ట్రంలో ఏడు రౌండ్లలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎవరివైపునుందో చూడాలి.

Read Also : UP Elections: యూపీ మూడో దశ పోలింగ్.. 16జిల్లాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు..

ట్రెండింగ్ వార్తలు