Telangana Assembly : త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. దళిత బంధు పథకానికి చట్టబద్ధత

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Assembly sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో మూడు లేదా నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించడానికి కేసీఆర్‌ సర్కార్ రెడీ అవుతుంది. ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని ప్రవేశపెట్టారన్న విమర్శలను తిప్పికొట్టేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ పథకం దళితుల అభివృద్ధి కోసమే ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దళిత సాధికారత కోసం గత బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ప్రభుత్వం- దళిత బంధు పథకం అమలు చేసి ఆ నిధులను భారీగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

గత బడ్జెట్ సమావేశాలను పరిశీలిస్తే… ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ నెలలోనే సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈనెల 16న పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆలోపే లేదా బహిరంగసభ అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి …. పథకానికి చట్టబద్ధత తేవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

వీలైతే వచ్చే వారంలో నాలుగైదు రోజుల పాటు ఉభయ సభల సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దళిత బందుకు అసెంబ్లీ, మండలి ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పించినట్లయితే దళితులకు భవిష్యత్తులో కూడా పథకం ఫలాలు అందే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే దళితుల్లో మరింత భరోసా కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత కార్మికుల కోసం చేనేత భీమా పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది. అసెంబ్లీ వేదికగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు