పీసీసీ అధ్యక్ష పదవిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

రాబోయే పదేండ్లలో పీసీసీ అధ్యక్షుడిని అవుతా, ముఖ్యమంత్రిని కూడా అవుతానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Jagga Reddy: పీసీసీ అధ్యక్ష పదవి గురించి తనతో ఎవరూ సంప్రదించలేదని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా విధేయుడిగా నడుచుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనను గాంధీ భవన్ అటెండర్‌గా చెయ్యమంటే సంకోచం లేకుండా చేస్తానని అన్నారు. రాబోయే పదేండ్లలో పీసీసీ అధ్యక్షుడిని అవుతా, ముఖ్యమంత్రిని కూడా అవుతానని ఆయన వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోదీకి అధికారం తాత్కాలికమని జగ్గారెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మాత్రమే పని చేస్తాయి. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి నరేంద్ర మోదీ ప్రధానిగా అధికారం ఉంది. దిగిపోతే ఎలాంటి అధికారాలు ఆయనకు ఉండవు. కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా రాజకీయ అధికారం సోనియా , రాహుల్ గాంధీలకు ఉంటుంది. మోదీ అధికారం తాత్కాలికం మాత్రమే దిగిపోతే అధికారం ఉండదు. మోదీ హామీలపై దృష్టి పెట్టకుండా.. యాభై సంవత్సరాల కిందటి ఎమర్జెన్సీ అంశాన్ని తీసుకురావడం దురదృష్టకరం. ఎప్పుడో జరిగిన ఘటనని ప్రధాని ప్రస్తావించడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగమా? ప్రధాని నరేంద్ర మోదీ తీరును rss భగవత్ కూడా తప్పు బట్టారు.

Also Read: రేషన్ కార్డు ప్రామాణికం కాదు- రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

గోద్రా ఘటనపై పార్లమెంట్ లో చర్చకు సిద్ధమా? మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే గోధ్రా ఘటన జరిగి 2000 మంది చనిపోయారు. ఎమర్జెన్సీ పెట్టినప్పుడు బీజేపీనే లేదు ఆ తర్వాత 1980 పుట్టిన పార్టీ. బీజేపీకి గత చరిత్ర లేదు. నల్ల చట్టాలు తెచ్చి రైతులను హింసించింది నిజం కాదా.. దీనిపై చర్చకు రాగలుగుతారా? దేశ భక్తులం అంటున్న బీజేపీ పుల్వామా ఘటనపై పార్లమెంట్ లో ఎందుకు చర్చకు పెట్టలేదు? చిన్న చిన్న ఘటనలు జరిగితే సవరించుకుని ముందుకు వెళ్లిన శక్తివంతమైన నాయకురాలు ఇందిరా గాంధీ. ఇప్పుడు సోనియా గాంధీ శక్తివంతమైన నాయకురాలు. బీజేపీ ఒక ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ వంద ఎమర్జెన్సీల గురించి మాట్లాడుతుందని జగ్గారెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు