రేషన్ కార్డు ప్రామాణికం కాదు- రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగింది. ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుంది.

రేషన్ కార్డు ప్రామాణికం కాదు- రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy (Photo Credit : Google)

Cm Revanth Reddy : రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే అని వెల్లడించారు. రూ.2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్.

”రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చే సరికి ప్రతి సంవత్సరం జరిగే నిర్వహణ పనుల జరగడం వల్ల అంతరాయం ఏర్పడింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పా. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలకు మించి బడ్జెట్ ఉండకూడని అధికారులకు ఆదేశాలిచ్చా. బడ్జెట్ వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరించాల్సిన అవసరం లేదు.

ఉచిత బస్సు పథకం వల్ల ఆదాయం పెరిగింది- సీఎం రేవంత్ రెడ్డి
మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగింది. ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుంది. 30 శాతం నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెరిగింది. దీని వలన ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయి. గత అప్పులతో సంబంధం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతాం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అప్పులు 7లక్షల కోట్లు, నెలకు 7వేల కోట్లు కడుతున్నాం- సీఎం రేవంత్ రెడ్డి
”మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాం. అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తర్వాత కమిషన్ నియమిస్తాం. బీసీ కమిషన్ పదవీ కాలం ఆగస్టుతో పూర్తవుతుంది. కొత్త వారిని నియమించాక కులగణన చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన వాస్తవాలు అసెంబ్లీ ముందుకు తెస్తాం. చర్చల తర్వాత డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళతాం. రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. మరో లక్ష కోట్ల వరకు పెండింగ్ బైల్స్ ఉన్నాయి. నెలకు 7వేల కోట్ల అప్పులు కడుతున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు 6వేల 500 కోట్లు కట్టేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలు తక్కువ వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నాం.

కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం. 7 నుంచి 11 శాతం వడ్డీ వరకు రుణాలు తెచ్చారు. అవకాశం ఉన్నంత వరకు వడ్డీ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక శాతం వడ్డీ తగ్గినా నెలకు 700 కోట్ల భారం తగ్గుతుంది. కేంద్రంతో చర్చలు జరిపి రుణాలకు వడ్డీ తగ్గించే అంశం ఒక కొలిక్కి తీసుకొస్తాం. అవసరమైతే తక్కువ వడ్డీకి ఇచ్చే వారి నుంచి డబ్బు తీసుకుని ఎక్కువ వడ్డీకి డబ్బు తెచ్చిన అప్పులు తీర్చేస్తాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించాం. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు, కేంద్ర మంత్రులను ఇప్పటికే ఒకసారి కలిశారు. బడ్జెట్ కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలు కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే