పార్టీలు మారినా మారని తలరాత.. ఆ ముగ్గురు సీనియర్లను వెంటాడుతున్న దురదృష్టం..!

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.... దూరదృష్టి లేకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అనుచరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Gossip Garage : ఆ ముగ్గురు రాజకీయ ఉద్ధండులు… ఒకప్పుడు జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ మార్కు పాలిటిక్స్‌తో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఉండేవారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంతో ఓ ఆట ఆడుకున్న ఆ ముగ్గురు నేతల రాజకీయం ఇప్పుడు పూర్తిగా తలకిందులైంది. అధికారం ఆశలన్నీ గల్లంతై శాశ్వత ప్రతిపక్షంగా మారింది ఆ నేతల తలరాత… అధికార పార్టీలో ఉంటూ… జిల్లా రాజకీయాలను శాసించాల్సిన సమయంలో మళ్లీ ప్రతిపక్ష పాత్రకే పరిమితవ్వాల్సి వచ్చింది. ఆ నేతల స్టోరీ విన్నవారంతా అయ్యో పాపం.. అంటున్నారట… ఇంతకీ ఎవరా నేతలు..? ఏమటా స్టోరీ…?

అయ్యో ఎంత తప్పు జరిగిపోయిందని తెగ బాధపడిపోతున్నారట..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు నేతల రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రులు నాగం జనార్దనరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ పొలిటికల్‌ కెరీర్‌పై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురు నేతలు… గత ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్లీ ప్రతిపక్షంలోనే ఉండిపోవాల్సి రావడం పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చకు దారితీస్తోంది. తమ తాజా పరిస్థితిని సమీక్షించుకుంటున్న ముగ్గురు నేతలు… అయ్యో ఎంత తప్పు జరిగిపోయిందని తెగ బాధపడిపోతున్నారట…. కాస్త ఓపిక పడితే రెండు దశాబ్దాల తర్వాత అధికారం రుచి చూసేవారమంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

అనవసరంగా తొందర పడ్డారని ఫీల్‌ అవుతున్న నాగం అనుచరులు..
నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నాగం జనార్దన్ రెడ్డి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. సమైక్య రాష్ట్రంలో మంత్రిగా గుర్తింపు పొందిన నేత. టీడీపీలో ఉండగా పాలమూరు జిల్లా రాజకీయాలను శాసించిన జనార్దన్‌రెడ్డి… 2004 నుంచి ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారు. 2012 వరకు టీడీపీలో కొనసాగిన నాగం.. సొంత పార్టీని స్థాపించారు. ఆ తర్వాత బీజేపీలో కొన్నాళ్లు, ఆ తర్వాత గత ఎన్నికల వరకు కాంగ్రెస్‌లో పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తనకు టికెట్‌ ఇవ్వలేదనే అసంతృప్తితో చిరకాల ప్రత్యర్థి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో చేతులు కలిపారు.

బీఆర్ఎస్ ఓటమితో మళ్లీ ప్రతిపక్షమే..
రెండు దశాబ్దాల తర్వాత ప్రతిపక్షం నుంచి అధికార పార్టీకి మారిన నాగంకు… ఆ ముచ్చట మున్నాళ్లకే ముగిసింది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమైపోవాల్సి వచ్చింది…. దీంతో నాగం జాతకం మరి మారే పరిస్థితి లేదా? అంటూ ఆయన అనుచరులు బాధపడుతున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే తమ నేతకు సరైన పదవి వచ్చేదని.. అనవసరంగా తొందర పడ్డారని ఫీల్‌ అవుతున్నారట నాగం అనుచరులు.

పదేళ్లు వ్యతిరేకించిన పార్టీలో చేరినా దక్కని అధికారం..
ఇక వనపర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి సేమ్‌ టు సేమ్‌ అంటున్నారు ఆయన అనుచరులు. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నేత చంద్రశేఖర్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రావుల… రాష్ట్ర మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఖాళీ అయినా, రావుల మాత్రం ఆ పార్టీని వదిలి పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, ఆ పార్టీపై పదేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేశారు. కానీ, చివరి నిమిషంలో టీడీపీని వీడి, బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు రావుల… పదేళ్లు వ్యతిరేకించిన పార్టీలో రావుల చేరినా, స్థానికంగా ప్రభావం చూపలేకపోయారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానం అందినా, తప్పుడు అంచనాతో బీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నారు రావుల. దీంతో తగిన మూల్యం చెల్లించుకున్నారని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఎన్నికల నుంచి ఆయనతో క్యాడర్‌ కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తోందని టాక్‌ నడుస్తోంది.

దాదాపు 20 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్రనే..
నాగం, రావుల టైపులోనే జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత ఎర్ర శేఖర్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందువరకు కాంగ్రెస్‌లోనే కొనసాగిన ఈ మాజీ ఎమ్మెల్యే… చివరి నిమిషంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.. ఈయన కూడా దాదాపు 20 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నారు. జడ్చర్ల నుంచి మూడు సార్లు టీడీపీ ఎంఎల్ఎగా గెలుపొందారు ఎర్ర శేఖర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి మహా కూటమి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ బలహీనపడిందనే ఆలోచనతో బీజేపీ గూటికి చేరారు. మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ఆ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్‌ ఆశించారు. టికెట్‌ దక్కలేదనే ఆలోచనతో బీఆర్‌ఎస్‌ గూటికి చేరిపోయారు. దీంతో ఎర్ర శేఖర్‌ పొలిటికల్‌ కెరీర్‌కు రెడ్‌ కార్డ్‌ పడిందంటున్నారు అభిమానులు.

పొలిటికల్ కెరీర్ ముగిసినట్టే?
ఇలా ముగ్గురు నేతలు 2004 వరకు అధికార పార్టీ తరఫున జిల్లాను శాసించగా, ఆ తర్వాత పదేళ్లు కాంగ్రెస్‌, మరో పదేళ్లు బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతిపక్షంలోనే ఉండిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌లో చేరి మరో ఐదేళ్లు విపక్ష పాత్రలోనే సెటిల్‌ కావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇక నాగం, రావుల వయసు కూడా 70 ఏళ్లు దాటిపోవడంతో వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పోటీ చేసే పరిస్థితి ఉంటుందా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు…. దూరదృష్టి లేకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అనుచరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Also Read : గెలిపిస్తారనుకున్న వారే ముంచేశారా..! గెలిచే అవకాశం ఉన్న చోట కాంగ్రెస్ ఎందుకు ఓడింది?

ట్రెండింగ్ వార్తలు