గెలిపిస్తారనుకున్న వారే ముంచేశారా..! గెలిచే అవకాశం ఉన్న చోట కాంగ్రెస్ ఎందుకు ఓడింది?

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెకండ్ క్యాడర్ నేతలతో నెట్టుకొచ్చిన పార్టీ.. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి బలమైన నేతల చేరికతో పటిష్టంగా కనిపించినా, ఎన్నికల నాటికి సీన్‌ మొత్తం రివర్స్‌ అయిందంటున్నారు.

Gossip Garage : చేతిలో అధికారం ఉందని ధీమానో…. బడా లీడర్లు అంతా తమ వెంటే ఉన్నారనే అత్మ విశ్వాసమో కానీ, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ హస్తం పార్టీ చేతులెత్తేయాల్సి వచ్చింది. గెలుపు పక్కా అనుకున్న చోట… బొక్కా బోర్లా పడటం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారట స్థానిక లీడర్లు… ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందని.. అసలు ఓటమికి కారణాలేంటి? అని ఆరా తీస్తుంటే… గెలిపిస్తారనుకున్న వారే ముంచేశారని వాదనే ఎక్కువగా వినిపిస్తోందట… అసలు ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లో ఏం జరిగింది? గెలవాల్సిన చోట… ఎందుకు ఓటమి ఎదురైంది?

అనతి కాలంలోనే బలమైన పార్టీగా ఎదిగిన కాంగ్రెస్..
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని సవాల్‌గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికారంలోకి వచ్చిన నుంచే ఆపరేషన్‌ స్టార్ట్‌ చేశారు. ఆదివాసీ ఓటర్లు అధికంగా ఉన్నారనే ఆలోచనతో మంత్రి సీతక్కను జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించారు. అంతేకాకుండా… సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడైన సత్తు మల్లేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక ఇన్‌చార్జి మంత్రిగా మంత్రి సీతక్క పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో విసృతంగా పర్యటించారు. చేరికలపై ఫోకస్ పెట్టి వివిధ పార్టీల నేతలను జాయిన్ చేయించారు. సీనియర్‌ నేతలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేటి కోనప్ప, విఠల్ రెడ్డి వంటి చాలా మందిని తిరిగి పార్టీలోకి తెచ్చారు. అనతికాలంలోనే పాత, కొత్త నేతలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలమైన పార్టీగా ఎదిగింది.

రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తికి కాంగ్రెస్ టికెట్..
ఇక చేరికలతో పార్టీ పుంజుకుందనే అభిప్రాయంతో దాదాపు రెండు డజన్ల మంది ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నించారు. కానీ, రాజకీయాలతో సంబంధం లేని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణకు టికెట్ కేటాయించింది కాంగ్రెస్‌. గతంలో ఆదివాసీ ఉద్యమాలు చేయడం, మానవహక్కుల వేదకలో క్రియాశీలంగా పనిచేయడంతో సుగుణ అభ్యర్థిత్వంపై మొగ్గుచూపారు అగ్రనేతలు. పార్టీలో చాలామంది ఆత్రం సుగుణకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకించినా.. మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పట్టుబట్టి మరీ సుగుణకు టికెట్ ఇప్పించేలా ప్రయత్నాలు చేశారు.

Also Read : పార్టీలు మారినా మారని తలరాత, 2 దశాబ్దాలుగా విపక్షంలోనే.. సీనియర్లను వెంటాడుతున్న దురదృష్టం

తమను పట్టించుకోలేదని ప్రచారానికి దూరం..
కానీ, విపక్షాలు కాంగ్రెస్‌ అభ్యర్థి నేపథ్యాన్నే అస్త్రంగా మార్చుకుని సక్సెస్‌ అయ్యారు. లంబాడాలకు వ్యతిరేకంగా ఆమె పని చేయడాన్ని, మతం మారడాన్ని విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేశారు. ఇదే సమయంలో మంత్రి సీతక్క ఎక్కువగా ఉట్నూరుకే పరిమితం కావడంతో మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని సమన్వయం చేయలేకపోయారని అంటున్నారు. మంత్రి సీతక్క కేవలం ఉట్నూరు నేతలకే ప్రాధాన్యమిచ్చారని, తమను నిర్లక్ష్యం చేశారని మిగిలిన నియోజవర్గాల నేతలు అసంతృప్తితో సరిగా ప్రచారం చేయలేదని చెబుతున్నారు. ఇక పార్టీ ఇన్‌చార్జిగా వచ్చిన సత్తు మల్లేశ్‌ సైతం ఒంటెద్దు పోకడలతో కార్యకర్తలను, ముఖ్య నేతలను పట్టించుకోలేదనే కారణంతో కీలక సమయంలో అంతా గప్‌చుప్‌గా ఉండిపోయారంటున్నారు.

ఆ ఇద్దరి అనుభవాన్ని వాడుకోలేకపోయారు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెకండ్ క్యాడర్ నేతలతో నెట్టుకొచ్చిన పార్టీ.. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి బలమైన నేతల చేరికతో పటిష్టంగా కనిపించినా, ఎన్నికల నాటికి సీన్‌ మొత్తం రివర్స్‌ అయిందంటున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి ఎంపీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరినా, ఈ ఇద్దరు నేతల అనుభవాన్ని పెద్దగా వాడుకోకపోవడమూ ఓ కారణంగా చెబుతున్నారు.

జిల్లా రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తుల వల్లే ఓటమి..
మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఎంతో పేరున్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని సైతం లైట్‌ తీసుకోవడం నష్టం చేకూర్చిందని చెబుతున్నారు. కేవలం ముగ్గురు నేతల కనుసన్నలోనే రాజకీయాలు నడిచాయని… అనుభవ రాహిత్యం, జిల్లా రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తుల వల్లే ఓటమి మూటకట్టుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పార్టీ ఫండ్‌ ఖర్చు చేయడంలోనూ కొందరు చేతివాటం ప్రదర్శించారని అంటున్నారు. మొత్తానికి గెలిచే అవకాశం ఉన్న సీటును కాంగ్రెస్‌ నేతలు చేజేతులా వదులకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : లోకేశ్ రెడ్‌బుక్‌కు, కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్‌కు ఏమైనా సంబంధం ఉందా?

ట్రెండింగ్ వార్తలు