Narayankhed: నారాయణఖేడ్ కాంగ్రెస్‌లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. లీడర్ల మధ్య వార్ ఎందుకు?
పట్లోళ్ల, సురేష్ షెట్కార్ కుటుంబాలు మొదటి నుంచి ఒక ఒప్పందంతో ముందుకెళ్తున్నాయి. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకసారి షెట్కార్ ఫ్యామిలీ పోటీ చేస్తే మరోసారి పట్లోళ్ల ఫ్యామిలీ పోటీ చేసేలా ఏనాడో ఒప్పందు కుదుర్చుకున్నారట.
Narayankhed: అటు ఎంపీ..ఇటు ఎమ్మెల్యే. మధ్యలో క్యాడర్, లీడర్లు. పార్టీకి కంచుకోటగా ఉన్నచోట ఇద్దరు కీలక నేతల మధ్య నడుస్తోన్న గ్రూప్ వార్ ఇది. అధికారంలో ఉండి.. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నా..అభివృద్ధి కంటే కోల్డ్ వార్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారట. డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టకుండా ఆ ఇద్దరు నేతలు కత్తులు దూసుకోవడం అధికార కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిందట. ఇంతకు ఆ నియోజకవర్గాలు ఎక్కడ? ఆ లీడర్ల మధ్య వార్ ఎందుకు?
అధికారంలోకి వచ్చేదాక ఒక బాధ. పవర్‌లోకి వచ్చాక ఇంకో బాధ. అప్పుడు అధికారం లేదన్న లోటు. ఇప్పుడు తమ ఆధిపత్యమే నడవాలనే పట్టుదల. దీంతో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి కుటుంబాల మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో సురేష్ షెట్కార్ అసెంబ్లీకి పోటీ చేయాలని ముచ్చటపడ్డారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా బరిలోకి దిగుతానని పట్లోళ్ల సంజీవ రెడ్డి పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. దీంతో పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి సురేష్ షెట్కార్‌ను పార్లమెంట్ బరిలో నిలిపింది. సంజీవరెడ్డికి అసెంబ్లీ సీటు ఇచ్చింది. ఇద్దరూ గెలిచారు. ఒకరు పార్లమెంటుకు, మరొకరు అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత అంతా సెట్ అయ్యింది..ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నట్లు కనిపించినా గ్రూపు రాజకీయాలు గరమెక్కాయి. నామినేటెడ్, పార్టీ పదవులు తమ వర్గానికే ఇవ్వాలంటూ ఇద్దరు ఎంపీ, ఎమ్మెల్యే పట్టుబడుతుండటం రచ్చకు దారితీస్తోంది.
పార్టీలో అన్ని పదవులు ఈ రెండు కుటుంబాలకే..!
ఎంపీ సురేష్ షెట్కార్ తన సోదరుడు నగేష్ షెట్కార్‌కు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడు శేఖర్ రెడ్డికి డీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకునే క్రమంలో ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరిని నమ్ముకుని పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు తమకు ఏ పదవులు రాక గుర్రుగా ఉన్నారట. నాలుగైదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు ఈ రెండు కుటుంబాలే దక్కించుకోవడంపై ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇక తన తండ్రి దివంగత కృష్టారెడ్డి లెగసీతో పార్టీ శ్రేణులకు కూడా పదవులు ఇప్పించుకుని నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించాలన్న స్కెచ్‌తో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పావులు కదువుతున్నారు. మరోసారి పార్లమెంట్‌కు పోటీ చేసే ఆలోచనలో లేని సురేష్ షెట్కార్ ఎంపీగా ఉండగానే భవిష్యత్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట.
నలిగిపోతున్న సీనియర్లు, క్యాడర్..
పట్లోళ్ల, సురేష్ షెట్కార్ కుటుంబాలు మొదటి నుంచి ఒక ఒప్పందంతో ముందుకెళ్తున్నాయి. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకసారి షెట్కార్ ఫ్యామిలీ పోటీ చేస్తే మరోసారి పట్లోళ్ల ఫ్యామిలీ పోటీ చేసేలా ఏనాడో ఒప్పందు కుదుర్చుకున్నారట. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ఒప్పందాన్ని పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో కూడా అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతోనే ఉన్నట్లు వినికిడి.
అందుకు తగ్గట్లుగానే ఆయన వ్యవహరిస్తుండటంతో షెట్కార్ గ్రూపు మండిపడుతోంది. ఈ రెండు ఫ్యామిలీల గ్రూప్ వార్‌తో పార్టీ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు నలిగిపోతున్నారట. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రెండు కుటుంబాలకు చెందిందేనా..? పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులూ వారికే కానీ మాకు లేవా అంటూ గుర్రుగా ఉన్నారట క్యాడర్, లీడర్లు.
పదవులు, రెండు గ్రూపుల మధ్య ఆధిపత్యం పోరాటాలు తప్ప ఈ ప్రాంత అభివృద్ధిపై మీరు ఏనాడూ దృష్టి పెట్టింది లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్రంలో నారాయణఖేడ్ నుంచే అత్యధికంగా ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కీచులాడుకోవడంతోనే కాలం వెళ్లదీస్తున్నారని సామాన్య జనం రగిలిపోతున్నారట. పార్టీ అధిష్టానం కలుగజేసుకుని వీరి గ్రూపు రాజకీయాలకు చెక్ పెడుతుందో లేదో చూడాలి.
Also Read: ఫిరాయింపుల ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్.. ఆ ఇద్దరికి స్పీకర్ మరోసారి నోటీసుల వెనుక వ్యూహం ఏంటి?
