శభాష్ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఫిర్యాదు చేసిన 11 నిమిషాల్లో 18 లక్షలు ఫ్రీజ్

ఫిర్యాదు అందిన 11 నిమిషాల వ్యవధిలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించి డబ్బు ఫ్రీజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అభినందించారు.

Cyber Crime Police :  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు కేటుగాళ్ల బారిన పడకుండా చూడగలిగారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18లక్షలను సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కకుండా చేశారు. బాధితుడు ఫిర్యాదు చేసిన 11 నిమిషాల్లోనే సైబర్ క్రైమ్ పోలీసులు 18 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయించగలిగారు. సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించిన తీరు పట్ల ప్రశంసలు అందుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అంబర్ పేట్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని సైబర్ కేటుగాళ్ళు మోసం చేశారు. ఆధార్ ద్వారా డ్రగ్స్ పార్సల్ చేస్తున్నాడంటూ ఫెడెక్స్ కొరియన్ నుండి ఫోన్ చేశారు కేటుగాళ్ళు. తమను తాము ముంబై సైబర్ క్రైమ్ పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. ముంబై నుండి ఇరాన్ కు డ్రగ్స్ పంపిస్తున్నావని బెదిరించారు. నీ అకౌంట్ లో ఉన్న డబ్బు పంపిస్తే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెరిఫై చేసి, తిరిగి పంపిస్తామని నమ్మించారు. నకిలీ ఎఫ్ఐఆర్, ఆర్బీఐ నోటీసులను పంపించి టెకీని భయపెట్టారు. ఇదంతా నిజమేనని నమ్మేసిన టెకీ.. భయాందోళనకు గురయ్యాడు. తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. అయితే, లోన్ తీసుకొని డబ్బు పంపాలని కేటుగాళ్లు ఒత్తిడి చేశారు. లేదంటే అరెస్ట్ తప్పదని బెదిరించారు.

దీంతో బాధితుడు 18 లక్షలు పర్సనల్ లోన్ తీసుకుని సైబర్ చీటర్స్ చెప్పిన అకౌంట్ కు ఆ అమౌంట్ ను ట్రాన్సఫర్ చేశాడు. ఆ తర్వాత వారు స్పందించకపోవడంతో.. టెకీకి అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించాడు. ఆ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న మరుక్షణమే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీకాంత్.. ఎన్‌సిఆర్‌పి పోర్టల్‌ ఆన్‌లైన్‌లో ఫిర్యాదును నమోదు చేశాడు. ఆ వెంటనే ఐసిఐసిఐ బ్యాంక్‌ సిబ్బందితో మాట్లాడాడు. బాధితుడి అకౌంట్ నుండి ట్రాన్స్ ఫర్ అయిన 18 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయించాడు.

అలా ఫిర్యాదు అందిన 11 నిమిషాల వ్యవధిలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించి డబ్బు సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కకుండా..  ఫ్రీజ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అభినందించారు. సాధారణంగా సైబర్ క్రైమ్ మోసాలు జరిగినప్పుడు.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మోసపోయిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఫలితం ఎక్కువగా ఉండే చాన్స్ ఉంది. దాన్నే గోల్డెన్ అవర్ అంటారు. అయితే, ఇప్పుడు అది గోల్డెన్ మినిట్స్ గా మారింది.

Also Read : భీమిలిలో ఊహించని విషాదం.. కొడుకు మృతి, తట్టుకోలేక తండ్రి కూడా..

ట్రెండింగ్ వార్తలు