West Bengal : దుర్గాదేవిగా మమతా బెనర్జీ..మహిషాసురుడిగా ప్రధాని మోదీ.. పోస్టర్ దుమారం

పశ్చిమ బెంగాల్ మహిషాసురుడిగా ప్రధాని నరేంద్ర మోదీ..రాక్షసులను సంహరించే దుర్గామాతగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఉన్న పోస్టర్ తీవ్ర దుమారం రేపుతోంది.

Mamata Banerjee as Durga, PM Modi as Mahishasur : పశ్చిమ బెంగాల్ లోని మదనాపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టర్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పోస్టర్ లో మహిషాసురుడిగా ప్రధాని నరేంద్ర మోదీ..రాక్షసులను సంహరించే దుర్గాదేవి మాతగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఉన్నారు. బెంగాల్ లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ పోస్టర్ తీవ్ర దుమారం రేపుతోంది.

మదనాపూర్ జిల్లాలో మిడ్నాపూర్ లో తృణమూల్ పార్టీ అభ్యర్థి అనిమా సాహా ఈ పోస్టర్ ను ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.కానీ ఇది ఎవరు పెట్టారు అనేదానిపై ఎవ్వరు నోరు మెదపటంలేదు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బెంగాల్ లో వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందీ పోస్టర్. దీంట్లో ఎవరైనా ప్రతిపక్ష పార్టీకి (బీజేపీకి) ఓటు వేస్తే..వారి బలి అవుతారు అనే సందేశం ఉంది. ఆ పోస్టర్ లో ఇతర పార్టీలను మేకలుగా చూపిస్తూ బలి పశువులుగా పేర్కొన్నారు. ఎవరైనా వారికి ఓటేస్తే.. వారిని బలిస్తామంటూ కింద నోట్ కూడా పొందుపరిచారు. దీంట్లో మోదీతో పాటు అమిత్ షాను కూడా రాక్షసుడిగా చూపించారు.

also read : మిగిలినదంతా ఒకే దశలో.. బెంగాల్ ఎలక్షన్ పై ఈసీకి మమత విజ్ణప్తి

దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య మండిపడ్డారు. సనాతన ధర్మానికి, ప్రధాని మోదీ, అమిత్ షాకి ఇది తీవ్ర అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

అయితే ఆ పోస్టర్ ఎలా వచ్చిందన్న విషయం కూడా తనకు తెలియదని అనిమా సాహా చెబుతున్నారు. ఇటువంటి పోస్టర్లను తానే పెట్టను అని అలాగే పెట్టనివ్వనని చెబుతున్నారు. ఫిబ్రవరి 27 నుంచి 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న క్రమంలో మదనాపూర్ జిల్లాలో ఈ పోస్టర్ తీవ్ర దుమారం రేపుతోంది.బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో అయినా పట్టు సాధించాలని భావిస్తోంది. ఈక్రమంలో ఈ పోస్టర్ వివాదంగా మారింది.

 

 

ట్రెండింగ్ వార్తలు