Veer Savarkar: రాహుల్ గాంధీపై కేసు నమోదు చేస్తానంటున్న వీర్ సావర్కర్ మనవడు

రాహుల్ గాంధీ సావర్కర్‌ను అవమానించడం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ సావర్కర్‌ను అవమానించారు, కాబట్టి నేను శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను. సమరయోధుడిని అవమానించినందుకు నేను ఫిర్యాదు చేస్తాను

Veer Savarkar: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయనున్నట్లు వీర్ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ వీర్ సావర్కర్ ద్రోహి అని, బ్రిటీష్‭కు తొత్తుగా వ్యవహరించారంటూ ఆరోపించారు. అప్పట్లో బ్రిటషర్లకు సావర్కర్ రాసిన లేఖను మీడియాకు చూపినప్పటికీ.. రాహుల్ వ్యాఖ్యలతో మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

సావర్కర్‭కు భారతరత్న ఇవ్వాలని, ఆయన దేశభక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ శివసేన) అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. ఇక ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే స్పందిస్తూ అనుచిత వ్యాఖ్యలు ఎవరిపై చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు స్పందిస్తూ ‘‘రాహుల్ గాంధీ సావర్కర్‌ను అవమానించడం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ సావర్కర్‌ను అవమానించారు, కాబట్టి నేను శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను. సమరయోధుడిని అవమానించినందుకు నేను ఫిర్యాదు చేస్తాను’’అని రంజిత్ చెప్పారు.

దీనికి ముందు మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్లకు వీర్ సావర్కర్ రాసిన లేఖలో ‘సర్, నేను మీకు నమ్మకైన బంటుగా ఇక నుంచి ఉంటానని మిమ్మల్ని వేడుకుంటున్నాను’ అని అన్నారు, అందులో ఆయన సంతకం కూడా ఉంది. బ్రిటిషర్లకు సావర్కర్ సహాయం చేశారు. అలాగే మహాత్మా గాంధీ, జవహార్‭లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారికి ద్రోహం చేశారు’’ అని అన్నారు.

సావర్కర్‭పై ఇలాంటి ఆరోపణలు చాలా కాలంగానే ఉన్నాయి. అయితే అధికార భారతీయ జనతా పార్టీ సావర్కర్‭ను దేశభక్తుడిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. సావర్కర్‭ స్వస్థలం మహారాష్ట్ర కావడంతో ప్రస్తుతం అదే రాష్ట్రంలో యాత్ర చేస్తున్న రాహుల్ ఈ విధంగా స్పందించారని అంటున్నారు.

Maharashtra: ఉద్ధవ్ థాకరేపై ప్రతీకారం తీర్చుకున్నాను.. స్వయంగా ఒప్పుకున్న దేవేంద్ర ఫడ్నవీస్

ట్రెండింగ్ వార్తలు