IND Vs NZ Match Prediction: ఆనాటి ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? పిచ్ ఎవరికి సహకరిస్తుందంటే..

ప్రపంచ కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. న్యూజిలాండ్ ఐదు, భారత్ మూడు సార్లు గెలిచాయి. ఒకటి ఫలితం తేలలేదు. అయితే, 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. కానీ ..

India vs New Zealand

IND vs NZ World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే, ఆదివారం మరో రసవత్తర మ్యాచ్ కు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియం వేదిక కానుంది. మధ్యాహ్నం 2గంటలకు ఇక్కడ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు నాలుగేసి మ్యాచ్ లు ఆడాయి. అన్ని మ్యాచ్ లలోనూ ఇరుజట్లు గెలుస్తూ వచ్చాయి. అయితే, ఈరోజు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు విజయ పరంపరను కొనసాగిస్తుందనే అంశం క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

india vs new New Zealand

ఓటమి ఎరగని జట్లు ..
ఇండియా, న్యూజిలాండ్ రెండు జట్లు ఈ మెగా టోర్నీలో సమఉజ్జీల్లా కనిపిస్తున్నాయి. భారత్ జట్టు ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లపై వరుస విజయాలు నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టుసైతం ఇంగ్లాండ్, నెథర్లాండ్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లుపై వరుస విజయాలు సాధించింది. ఈ రెండు జట్లు వరల్డ్ కప్ 2023లో ఇప్పటి వరకు ఓటమి ఎరగని జట్లుగా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లు ఆదివారం తలపడుతున్న నేపథ్యంలో విజయాల పరంపరను కొనసాగించే జట్టు ఏదనే విషయంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Virat and Rohit

వాళ్లు రాణిస్తే మనదే విజయం..
సొంతగడ్డపై మెగా టోర్నీ జరుగుతుండటంతో భారత్ జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ మెగా టోర్నీలో మొదటి నుంచి భారత్ బ్యాటర్లు మంచి ఫామ్ ను కొనసాగిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భీకర ఫామ్ లో ఉన్నారు. వీరిలో ఒక్కరు క్రీజులో కుదురుకుపోయినా భారత్ భారీ స్కోర్ సాధించడం ఖాయం. శుభ్ మాన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్, జడేజా మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్ ఫాస్ట్ బౌలింగ్ తో అదరగొడుతుండగా.. కుల్ దీప్, జడేజా స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు కుదురుకునే అవకాశం ఇవ్వడం లేదు. ఫలితంగా భారత్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా ఉంది. ఫీల్డింగ్ లోనూ భారత్ ప్లేయర్స్ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. అయితే, హార్ధిక్ పాండ్యాకు గాయం కారణంగా ఈరోజు జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశం తక్కువే. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

IND Vs NZ Match

పిచ్ ఎవరికి అనుకూలిస్తుందంటే?
ధర్మశాలలో చల్లటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. ఆరంభంలో పేసర్లు ఈ పిచ్ పై రాణించే అవకాశం ఉంటుంది. స్పిన్నర్లకు కూడా ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది. అలాఅని బ్యాటింగ్ మరీ కష్టమేమీ కాదు. క్రీజులో కుదురుకుంటే పరుగులు రాబట్టొచ్చు. ఇక్కడ జరిగే మ్యాచ్ లో టాస్ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

shubman gill and rohit sharma

భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
ప్రపంచ కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. న్యూజిలాండ్ ఐదు, భారత్ మూడు సార్లు గెలిచాయి. ఒకటి ఫలితం తేలలేదు. అయితే, 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. కానీ, భారత్ జట్టు ఓటమిపాలై ఇంటిబాట పట్టింది. అప్పటి ఓటమి ప్రతీకారాన్ని ఈరోజు జరిగే మ్యాచ్ లో భారత్ తీర్చుకుంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తున్న న్యూజిలాండ్ జట్టును ఓడించడం అంత తేలిక కాదు. లేథమ్, ఫిలిప్స్, మిచెల్, కాన్వే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ లో అదరగొడుతున్నారు. బౌలింగ్ విభాగంలో బౌల్డ్, హెన్రీ, ఫెర్గూసన్, శాంట్నర్ లతో ఆ జట్టు బలంగా ఉంది. ఇక ఫీల్డింగ్ విభాగంలోనూ ఆ జట్టు ప్లేయర్స్ అదరగొడుతున్నారు. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ భారత్ జట్టుకు పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు.

Gill and virat

ఎవరిది పైచేయి ..
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 116 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో కివీస్ 56, భారత్ 50 వన్డేల్లో విజయం సాధించాయి. ఏడు మ్యాచ్ లు ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. ఒకటి టైగా ముగిసింది. గత ఐదు వన్డేల్లో న్యూజిలాండ్ భారత్ జట్టును ఓడించలేక పోయింది. వాటిల్లో రెండు ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు. ప్రపంచ కప్ విషయానికి వస్తే.. భారత్, న్యూజిలాండ్ జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. న్యూజిలాండ్ ఐదు, భారత్ మూడు సార్లు గెలిచాయి. ఒకటి ఫలితం తేలలేదు.

భాతర్ జట్టు (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, కుల్ దీప్, షమీ/శార్దూల్, బుమ్రా, సిరాజ్.

న్యూజిలాండ్ జట్టు (అంచనా) : కాన్వే, యంగ్, రచిన్ రవీంద్ర, మిచెల్, లేథమ్ (కెప్టెన్), ఫిలిప్స్, చాప్ మన్, శాంట్నర్, ఫెర్గూసన్, హెన్రీ, బౌల్డ్

 

ట్రెండింగ్ వార్తలు