YS Sharmila : షర్మిలకు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి చెక్..! కారణం అదేనా? షర్మిల ఏం చేయనున్నారు?

మొత్తం మీద షర్మిల పరిస్థితి ఎటూ తేలకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు అసెంబ్లీ ఎన్నికలు అయ్యేవరకు.. YS Sharmila

YS Sharmila – Congress : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల దారేంటి? నిన్న మొన్నటి వరకు జరిగిన ప్రచారానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకపోవడానికి కారణం ఏమిటి? కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడ్డట్టేనా? తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలతో అధిష్టానం ఏకీభవించిందా? ఇక ఇప్పుడు షర్మిల ముందున్న ఆప్షన్స్ ఏంటి?

సరిగ్గా రెండేళ్ల క్రితం వైఎస్ఆర్ టీపీ (YSRTP) పేరిట పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ తెరపైకి వచ్చారు. దివంగత రాజశేఖర్ రెడ్డి చర్మిషాతో తెలంగాణలో నిలదొక్కుకోవాలని చూశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర (Sharmila Padayatra) చేయడంతో పాటు సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కానీ, షర్మిల ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అనుకున్న మైలేజ్ మాత్రం సాధించలేకపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రూటు మార్చారు షర్మిల. కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీతో తెలంగాణలో జట్టు కడితే మంచిది అనే నిర్ణయం తీసుకున్నారు షర్మిల.(YS Sharmila)

Also Read: మైనంపల్లి వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి.. ప్లాన్ బీ రెడీనా?

మొదట్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలని భావించారు షర్మిల. కానీ, పొత్తుకు కాంగ్రెస్ ససేమిరా అనడంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కూడా సిద్ధమైపోయారు. పార్టీ విలీన ప్రక్రియకు సంబంధించిన చర్చలన్నీ కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం ద్వారా నడిచాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన షర్మిల.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. దీంతో ఏ క్షణాన అయినా కాంగ్రెస్ లో షర్మిల పార్టీ కలిసిపోతుందని అంతా భావించారు.

అంతా సవ్యంగా సాగుతోంది అని అనుకుంటున్న సమయంలోనే విలీనానికి పెద్ద సమస్య వచ్చి పడింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వీ.హనుమంతరావు, రేణుకా చౌదరి లాంటి ముఖ్యనేతలంతా రంగంలోకి దిగారు. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకుంటే ఏపీకి పని చేయించుకోవాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

లేదంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాతే విలీన కార్యక్రమాన్ని పెట్టుకోండని తేల్చి చెప్పేశారు. ఎన్నికలకంటే ముందే షర్మిలను చేర్చుకుంటే 2018 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయనే ఆందోళనను పార్టీ అధిష్టానం ముందు ఉంచారు. దీంతో 2018లో చంద్రబాబు ఫ్యాక్టర్ లా రానున్న ఎన్నికల్లో షర్మిల ఫ్యాక్టర్ ఎక్కడ అధికారాన్ని దూరం చేస్తుందోనని భావనతో అధిష్టానం పెద్దలు కూడా పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.(YS Sharmila)

ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సోనియా, రాహుల్ గాంధీలు.. షర్మిలకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు అయ్యేదాక షర్మిల చేరిక విషయాన్ని హోల్డ్ లో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిన నేపథ్యంలో షర్మిల సైతం పునరాలోచనలో పడ్డారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తాను అని షర్మిల ఎప్పుడో ప్రకటించారు. పార్టీ కార్యాలయం సైతం అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే, పాలేరు టికెట్ కోసం మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read: మీరు డబ్బాలు కొట్టుకుంటున్నట్టు మహిళా బిల్లు మీ పోరాట ఫలితమే అయితే, మీకు దమ్ముంటే ఇలా చేయండి- కేటీఆర్‌కు షర్మిల సవాల్

ఆ సీటు తుమ్మలకే ఇచ్చేందుకు హస్తం పార్టీ సుముఖత వ్యక్తం చేస్తోంది. ఇక, ఇప్పట్లో కాంగ్రెస్ లో విలీనం అవకాశం లేకపోవడంతో ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారట షర్మిల. కాంగ్రెస్ ఆప్షన్ పక్కన పెట్టేసి ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అనేదానిపైన కూడా మంతనాలు సాగిస్తున్నారట షర్మిల. మొత్తం మీద షర్మిల పరిస్థితి ఎటూ తేలకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు అసెంబ్లీ ఎన్నికలు అయ్యేవరకు షర్మిల వెయిట్ చేస్తారా? లేక ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు