BRS Plan: మైనంపల్లి వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి.. ప్లాన్ బీ రెడీనా?

ఓవైపు టిక్కెట్ రద్దు చేయకుండా.. మరోవైపు పార్టీ అభ్యర్థిగా మైనంపల్లిని చూడకపోవడమే బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.

BRS Party Plan: అటు పార్టీ.. ఇటు ఎమ్మెల్యే ఎవరి మైండ్ గేమ్ (Mind Game) వారు ఆడుతున్నారు. తనకు తానే గుడ్ బై చెప్పేదాకా చూద్దామంటూ పార్టీ పెద్దలు.. పార్టీ పంపించే దాకా వెయిట్ చేద్దామని ఎమ్మెల్యే.. ఇలా ఎవరికి వారు దోబూచులాట ఆడుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో కారు డ్రైవర్ ఎవరన్నది ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. పొమ్మన లేక పొగబెడుతున్నారని తెలిసినా ఆ ఎమ్మెల్యే మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో 114 నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్న బీఆర్ఎస్ (BRS Party) ప్రచారం.. ఆ నియోజకవర్గంలో మాత్రం కనిపించడం లేదు. ఇంతకీ ఏదా నియోజకవర్గం.. ఎవరా ఎమ్మెల్యే? తెరవెనుక ఏం జరుగుతోంది?

తన కుమారుడు రోహిత్‌కు (Mynampally Rohit) మెదక్ టిక్కెట్ దక్కకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు మల్కాజిగిరి ఎమ్మెల్యే (Malkajgiri MLA) మైనంపల్లి హన్మంతరావు. (Mynampally Hanumanth Rao)  దీంతో తన టిక్కెట్ను సైతం ఫణంగా పెట్టి పార్టీ నేతలపై నోరు జారారు. దీంతో ఆయన ఇక పార్టీకి గుడ్‌బై చెప్పేస్తారని కొందరు.. పార్టీయే ఆయనకు మల్కాజిగిరి టిక్కెట్ రద్దు చేసి సస్పెండ్ చేస్తుందని మరికొందరు చర్చోపచర్చలు చేస్తూ వచ్చారు. కానీ.. ఇప్పటివరకు ఆ రెండూ జరుగలేదు. అయితే తెరవెనుక మాత్రం మైనంపల్లికి గులాబీ పార్టీ పొగ పెడుతున్నట్లు కనిపిస్తోంది. తొలి జాబితాలోనే మైనంపల్లికి మల్కాజిగిరి స్థానంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినా.. ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైనంపల్లి తనకు తానుగా పార్టీకి గుడ్ బై చెప్పేదాకా లాగేందుకే గులాబీదళం సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

మల్కాజిగిరి నియోజకవర్గంలో తాను.. తన సొంత నియోజకవర్గమైన మెదక్‌లో తనయుడు రోహిత్‌రావును ఎన్నికల బరిలో నిలిపేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే మైనంపల్లి. ఈ నేపథ్యంలోనే మైనంపల్లికి మల్కాజిగిరి టిక్కెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధిష్టానం.. మెదక్ నియోజకవర్గంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికే ఛాన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక మంత్రి హరీశ్‌రావు హస్తం ఉందని ఆరోపించారు మైనంపల్లి. మైనంపల్లి వ్యాఖ్యలను తప్పుపట్టిన గులాబీ పార్టీ నేతలు.. అప్పటి నుంచి ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. మాస్ లీడర్‌గా పేరు ఉన్న మైనంపల్లిపై పార్టీ వెంటనే చర్యలు చేపడితే తప్పుడు సంకేతాలు వెళతాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది.

ఈ విషయాన్ని స్మూత్‌గా డీల్ చేస్తూనే మైనంపల్లిని దూరంగా ఉంచాలని పార్టీ డిసైడ్ అయినట్లు సమాచారం. పార్టీలో ప్రాధాన్యత దక్కకపోతే హన్మంతరావు కూడా ఉండే అవకాశం లేదన్న అభిప్రాయంతో పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మీడియాతో చిట్‌చాట్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మైనంపల్లి వ్యవహారంపై ఆచితూచి స్పందించారు. ఆయన విషయంలో సైలెంట్‌గా తమ వ్యూహాన్ని అమలు చేయడమే రాజకీయం అంటూ వ్యాఖ్యానించారు. ఓవైపు టిక్కెట్ రద్దు చేయకుండా.. మరోవైపు పార్టీ అభ్యర్థిగా మైనంపల్లిని చూడకపోవడమే బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. తనకు తానుగా మైనంపల్లి దూరం అయ్యేలా చేయడమే గులాబీదళం వ్యూహంగా కన్పిస్తోంది.

Also Read: కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్‌కు వచ్చిన ఇబ్బందేంటి?

ఇదే సమయంలో మైనంపల్లి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరిలో తాను, మెదక్‌లో తన కొడుకు రోహిత్ పోటీ చేసి తీరుతామంటూ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అటు మెదక్ లోనూ.. ఇటు మల్కాజిగిరిలోనూ బీఆర్ఎస్‌లోని ఓ వర్గం పూర్తిగా మైనంపల్లి వెంటే నడుస్తోందన్న టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలంతా మైనంపల్లికే మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు మల్కాజిగిరిలోనూ బీఆర్ఎస్‌లోని పలువురు ముఖ్య నేతలు.. హన్మంతరావు ఎటు వెళ్తే అటు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలిస్తున్నారు. మరోవైపు మైనంపల్లి కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ చర్యలు తీసుకునేదాకా బీఆర్ఎస్‌లోనే ఉండి.. ఆ తర్వాత హస్తం గూటికి చేరిపోవాలనే ప్లాన్‌లో ఉన్నారు మల్కాజిగిరి ఎమ్మెల్యే.

Also Read: విమానంలో వచ్చి కారులో ఎందుకెళుతున్నారు.. ఠాక్రే ప్రయాణంపై ఆసక్తికర చర్చ!

ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది బీఆర్ఎస్. మైనంపల్లికి ప్రత్యామ్నాయంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డితో (Rajashekar Reddy Marri) పాటు ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ (Krishank Manne) లాంటి నేతల పేర్లను పరిశీలిస్తోంది. పార్టీ కీలక నేతలపై విమర్శలు చేస్తే సహించేది లేదన్న సంకేతాలు పార్టీ పరంగా ఇవ్వాలన్న యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాన్ ఏలో మైనంపల్లి పార్టీ వీడక పోతే.. ప్లాన్ బీ ద్వారా ఆయనను పంపించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది గులాబీ దళం.

ట్రెండింగ్ వార్తలు