KVP: కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్‌కు వచ్చిన ఇబ్బందేంటి?

కాంగ్రెస్ పార్టీలో జాతీయస్థాయిలో ముఖ్య నేతగా పేరున్న కేవీపీపై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలు ఎక్కుపెడుతుండగా, కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఆయనపై చిర్రుబుర్రులాడుతుండటం ఆసక్తికరంగా మారుతోంది.

KVP Ramachandra Rao: ఆయన మాజీ ఎంపీ, దశాబ్దాలుగా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక నేత.. తెర ముందు పెద్దగా కనిపించకపోయినా.. వైఎస్సార్ (YSR) సీఎంగా ఉన్నప్పుడు రాజకీయమంతా ఆయన కనుసన్నల్లోనే సాగేదంటారు. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ తెరపై పెద్దగా కనిపించని ఆ నేత.. తెలంగాణ ఎన్నికల ముందు ఇప్పుడు హాట్‌టాపిక్ (Hot Topic) అయిపోయారు. ఇటు బీఆర్ఎస్‌తో పాటు.. అటు కాంగ్రెస్లోని ఓ వర్గానికి సైతం టార్గెట్‌గా మారిపోయారు. మీ వాడంటే.. మీ వాడంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఆత్మ బంధువు కేవీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇద్దరికి కేవీపీ టార్గెట్ ఎందుకయ్యారు? కాంగ్రెస్ నేత కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు? కేవీపీతో బీఆర్ఎస్‌కు (BRS Party) వచ్చిన ఇబ్బందేంటి?

కేవీపీ రామచంద్రరావు.. ఏపీ, తెలంగాణా రాజకీయాల్లో పరిచయం అక్కరల్లేని నేత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆత్మ బంధువు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలోనూ కేవీపీనే చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాలకే పరిమితమైనా.. తెరపైకి మాత్రం ఎప్పుడూ పెద్దగా రాలేదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో జాతీయస్థాయిలో ముఖ్య నేతగా పేరున్న కేవీపీపై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలు ఎక్కుపెడుతుండగా, కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఆయనపై చిర్రుబుర్రులాడుతుండటం ఆసక్తికరంగా మారుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడిగా తెరపై రేవంత్ రెడ్డి కనిపిస్తున్నా తెరవెనక నడిపిస్తుందంతా కేవీపీయే అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ నేతలను నడిపించేది ఆంధ్రా నేతలే అంటూ మరోసారి సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగించే పనిలో పడ్డారు కేటీఆర్. కాంగ్రెస్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, మాజీ ఎంపీ కేవీపీకి ఎలాంటి సంబంధాలు లేకపోయినా.. ఆంధ్రా లీడర్లను బూచిగా చూపే ఎత్తు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Also Read: ఎవర్రా బానిసలు? ఆమెను ఒక్క మాట అన్నా పాపం తగులుతుంది- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు

కేటీఆర్ ఎత్తుగడను గమనించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా విరుగుడు చర్యలు స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ తన పార్టీ నేతను విమర్శిస్తే ఎదురుదాడి చేయాల్సిన రేవంత్‌రెడ్డి.. ఆసక్తికరంగా తను కూడా సొంతపార్టీ నేత కేవీపీపైనే బాణాలు వేస్తున్నారు. ఈ రివర్స్ అటాక్ ఇప్పుడు రెండు పార్టీల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కేవీపీ కనెసన్నల్లో నడుస్తోందంటూ విమర్శలు చేయడం ద్వారా సరికొత్త చర్చకు తెరలేపారు రేవంత్‌రెడ్డి. కేవీపీ, సీఎం కేసీఆర్ సామాజిక వర్గం ఒకటే కావడంతో.. అలా లింక్ కలిపి.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టే పనిలో పడ్డారు రేవంత్. కేవీపీ చెప్పిన వారికే ప్రభుత్వంలో పదవులు, పోస్టింగులు ఇచ్చారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు రేవంత్.

Also Read: వలస నేతల చేరికలకు బ్రేకులు వేస్తోందెవరు.. బీజేపీలో ఏం జరుగుతోంది?

మొదటి నుంచి కూడా కేవీపీతో దూరంగానే ఉన్న రేవంత్.. ఇదే అవకాశంగా చెలరేగిపోతున్నారు. కేటీఆర్ ఇచ్చిన అస్త్రంతో అటు బీఆర్ఎస్‌ని, ఇటు కేవీపీతోపాటు తనకు కొరకరాని కొయ్యిలుగా మారిన టీ కాంగ్రెస్ సీనియర్లను ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కేవీపీతో సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఈ రకంగా కేవీపీని టార్గెట్ చేయడం ద్వారా సీనియర్లకు ముకుతాడు వేయవచ్చనే భావిస్తున్నారు రేవంత్‌రెడ్డి.

Also Read: ఈడీ నోటీసులపై కవిత కీలక వ్యాఖ్యలు.. ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన విజయశాంతి

అయితే రేవంత్ వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్స్ తప్పు పడుతున్నారు. పార్టీ కోసం ఎంతో శ్రమించిన నేతను గౌరవించాల్సింది పోయి.. సీఎం కేసీఆర్తో లింకు పెట్టడం కరెక్టు కాదంటున్నారు టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు. గతంలో కోవర్ట్ అంటూ ముద్రవేసి సీనియర్లను అవమానించడమే కాకుండా.. ఇప్పుడు కేటీఆర్ విమర్శలనే అస్త్రాలుగా చేసుకుని కేవీపీ లాంటి నేతపై దాడి చేయడమేంటంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణా తెరపై జరిగే రాజకీయంలో ఎక్కడా కనిపించని కేవీపీ.. ఇలా బిఆర్ ఎస్, కాంగ్రెస్ విమర్శలకు కేంద్రంగా మారడం చర్చనీయాంశమవుతోంది. తనపై వస్తున్న విమర్శలకు సరైన సమయంలో స్పందిస్తానంటూ కేవీపీ కూడా తేల్చిచెప్పడంతో .. ఈ వ్యవహారం కాంగ్రెస్లో ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదు.

ట్రెండింగ్ వార్తలు