BJP Telangana: వలస నేతల చేరికలకు బ్రేకులు వేస్తోందెవరు.. బీజేపీలో ఏం జరుగుతోంది?

తెలంగాణ బీజేపీలో చేరికలు ఓ ప్రహసనంగా మారిపోయాయి. పార్టీలో చేరేందుకు వస్తున్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకాల్సిన సమయంలో.. రెడ్ సిగ్నల్ వేస్తూ షాకులిస్తోంది తెలంగాణా బీజేపీ.

Telangana BJP : ఎన్నికలు వస్తున్నాయంటే ఏ పార్టీ అయినా కొత్తగా నేతల చేరికలను ప్రోత్సహిస్తుంటుంది. జనాల దృష్టిని ఆకర్షించేలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు వలస నేతలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతూ.. తమ పార్టీ పట్ల సానుకూలత ఉందని ప్రచారం చేసుకుంటుంది. కానీ, తెలంగాణ బీజేపీలో మాత్రం రాజకీయం (Telangana Politics) మరోలా నడుస్తోంది.. కమలంతో చేతులు కలిపేందుకు వస్తున్న వారికి గేట్లు అంత ఈజీగా తెరవడం లేదట కమలనాథులు. పార్టీలోకి రమ్మంటూ ఓ వర్గం ఆహ్వానాలు పంపుతుంటే.. మరోవైపు గుమ్మం వరకు వచ్చిన వారికి ముఖంపై తలపులు మూసేస్తోంది. అసలు ఇంతకీ బీజేపీలో ఏం జరుగుతోంది? వలస నేతల చేరికలకు బ్రేకులు వేస్తోందెవరు?

తెలంగాణ బీజేపీలో చేరికలు ఓ ప్రహసనంగా మారిపోయాయి. పార్టీలో చేరేందుకు వస్తున్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకాల్సిన సమయంలో.. రెడ్ సిగ్నల్ వేస్తూ షాకులిస్తోంది తెలంగాణా బీజేపీ. పార్టీలో చేరతామని వారం పదిరోజులుగా హడావుడి చేస్తున్న వారిపై.. అభ్యంతరాలు ఉంటే ఆదిలోనే అడ్డుచెప్పడం మానేసి.. వారు పార్టీ కార్యాలయం వరకు వచ్చాక నో ఎంట్రీ బోర్డు చూపుతోంది. ఈ మధ్యకాలంలో ఇలా ఇద్దరు నేతల విషయంలో బీజేపీ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. మాజీ మంత్రి కృష్ణయాదవ్, (krishna yadav) వ్యాపారవేత్త చీకోటి ప్రవీణ్ (chikoti praveen) చేరికకు బీజేపీలో ఓ వర్గం ప్రయత్నించగా, మరో వర్గం అడ్డుకోవడం రాజకీయంగా హాట్‌టాపిక్ అయింది.

హైదరాబాద్ నగరంలో అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కృష్ణయాదవ్, క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు ఎంతో ఉత్సాహం చూపారు. కృష్ణయాదవ్ మీడియా సమావేశం పెట్టి తాను కమలం కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అంబర్‌పేట్ (Amberpet) నుంచి బీజేపీ గుర్తుపై పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఇలా కృష్ణయాదవ్ ఏకపక్షంగా తన పోటీపై ప్రకటించడం బీజేపీలోని కీలక నేతలకి మింగుడు పడలేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) నియోజకవర్గమైన అంబర్‌పేటపై పార్టీలో చేరకముందే కృష్ణయాదవ్ కర్చీఫ్ వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బీజేపీలో ఓ వర్గం నేతలు. అంతే కృష్ణయాదవ్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈటలకు షాక్ ఇచ్చేలా జాయినింగ్కు బ్రేక్ వేశారు.

Also Read: రఘునందన్‌రావు తప్ప.. ఎక్కడా కనిపించని హేమాహేమీల పేర్లు!

ఇక చీకోటి ప్రవీణ్ విషయంలో కమలం ఇచ్చిన జర్క్ ఇంకా హైలెట్.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు మందీమార్బలంతో రెడీ అయ్యారు ప్రవీణ్. బీజేపీలోని ఓ ఎంపీ ప్రోత్సాహంతో కేంద్ర పెద్దల ఆశీస్సులతో కలమం తీర్థం పుచ్చుకోడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కరడుగట్టిన హిందువు చీకోటి వంటివారు పార్టీలో చేరితే మంచిదేనంటూ ప్రోత్సహించారు. కేంద్ర పెద్దలు ఓకే అన్నా.. రాష్ట్రంలో ఓ వర్గం చీకోటి చేరికకు సై అన్నా.. మహిళా నేతలు మాత్రం అడ్డుచక్రం వేసేశారు. ఈ మహిళా నేతల వెనుక మరోవర్గం ఉందన్న ప్రచారం సాగుతోంది.

Also Read: అడవి బిడ్డల ఆసక్తికర పోరు.. ములుగులో ఎవరిదో పైచేయి?

క్యాసినో వ్యాపారం చేసే చీకోటిని పార్టీలోకి చేర్చితే రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు అవుతుందనంటూ కొందరు మహిళా నేతలు నేరుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. దీంతో అంతవరకు చీకోటి చేరికపై సానుకూలంగా ఉన్న కేంద్ర పెద్దలు ఒక్కసారి ప్లేట్ ఫిరాయించారు. చివరి నిమిషంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ ద్వారా చీకోటి చేరకుండా డోర్స్ క్లోజ్ చేసేశారు… కృష్ణయాదవ్ చేరిక విషయంలో కొంత తర్జన భర్జన జరుగుతున్నా.. చీకోటిని మాత్రం బ్లాక్ లిస్టులో పెట్టేసినట్లు చెబుతున్నారు. రాజకీయాలపై ఆశతో బీజేపీ వైపు చూసిన చీకోటికి బండి సంజయ్ లాంటి బడా లీడర్లు బహిరంగంగా మద్దతు తెలిపినా.. మహిళానేతలు గట్టిగా పట్టుబట్టడంతో బ్రేక్ పడిపోయింది.

Also Read: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు 20 సీట్లకు మించి రావు- బండి సంజయ్ జోస్యం

పార్టీలో చేరతామన్నవారిపై అభ్యంతరాలు ఉంటే వద్దని ముందే చెప్పాలిగాని.. తమను బజారు కీడ్చేలా.. ప్రతిష్ట దిగజార్చేలా చివరివరకు ఏ విషయం చెప్పకుండా.. ఆఖరి నిమిషంలో అవమానించడం సమంజసం కాదని కుంగిపోతున్నారట కొందరు నేతలు. కృష్ణయాదవ్, చీకోటి ప్రవీణ్ ఎపిసోడ్‌తో బీజేపీలో చేరే విషయమై కొందరు నేతలు అయోమయం ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. బీజేపీలో రెండు గ్రూపులు ఉండటం.. ఒకరు అవును అంటే మరొకరు కాదంటుండటంతో ఎన్నికల ముందు తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంటోంది తెలంగాణ బీజేపీ.

ట్రెండింగ్ వార్తలు