మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా.. అడ్డుపడుతున్నది ఎవరు? దేనికోసం?

ఆరు మంత్రి పదవుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారట.

Gossip Garage : ఏదో అనుకుంటే… ఇంకేదో జరుగుతోంది… అమాత్య పదవి రావడం ఖాయం అనుకున్న వారికి అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆశావహుల ఆశలపై నీళ్లు జల్లింది. అదిగో ఇదిగో అంటూ ఊరించి ఉసూరుమనిపించింది. అసలు ఉంటుందో ఉండదో తెలియదు.. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చామన్న ఆనందం… పదవుల కోసం వేచి చూసే టెన్షన్ లోనే ఆవిరవుతోంది. ఇంతకీ మంత్రివర్గ విస్తరణ ఎందుకు వాయిదా పడింది…? అధిష్టానం బ్రేక్ వేసిందా? సీనియర్ నేతలే అడ్డంకిగా మారారా ? అసలేం జరిగింది?

క్యాబినెట్ విస్తరణ నిరవధిక వాయిదా..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా పడింది. ఆషాఢ మాసం ముందే అమాత్య యోగం వస్తుందని ఆశించిన నేతల ఆశలపై నీళ్లు జల్లుతూ క్యాబినెట్ విస్తరణను నిరవధిక వాయిదా వేసింది కాంగ్రెస్ హైకమండ్. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే క్యాబినెట్ లో ఖాళీలను భర్తీ చేస్తామని గతంలో ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక ఇన్‌చార్జి గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌డ్డి భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మరింత ఎక్కవయ్యాయి.

అనుచరులకు, బంధువులకు మంత్రిపదవులు ఇవ్వాలని డిమాండ్..
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం…. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుంటారని, ఢిల్లీ టూర్ ముగిసిన వెంటనే విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు తమ అనుచరులకు, బంధువులకు మంత్రిపదవులు ఇప్పించుకునే విషయంలో పట్టు వీడకపోవడంతో అధిష్టానం బ్రేక్ వేసిందంటున్నారు. ఆషాఢం ముందే జరగాల్సిన విస్తరణ వాయిదా పడటంతో మళ్లీ ఎప్పుడు ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. ఈ ఆరు మంత్రి పదవులతోపాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి చేసి ఇకపై పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలని భావించారు సీఎం రేవంత్ రెడ్డి. తాను అనుకున్న వారితో ఒక లిస్టు తయారు చేసి హైకమాండ్ అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారు. ఐతే, తమ వారికి మంత్రి పదవులు ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ చిట్టా ఇవ్వడంతో మంత్రివర్గ కూర్పు కుదరలేదంటున్నారు. ఈ కారణంతోనే విస్తరణకు బ్రేక్ పడిందని ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాల సమాచారం.

ప్రాంతాలు, సామాజిక వర్గ సమీకరణలతో లిస్ట్ రెడీ..
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో సహా క్యాబినెట్ లో 12మంది మంత్రులు ఉన్నారు. ఐతే కొన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఆయా జిల్లాలకు చెందిన నేతలు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు గ్రేటర్ హైదరబాద్ లో ఒక్కరు కూడా మంత్రిగా లేరు. అదే విధంగా మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ప్రాంతాలు, సామాజిక వర్గ సమీకరణలతో ఓ లిస్టు సిద్ధం చేశారు సీఎం.

ఆరు మంత్రి పదవుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారట.. అదే విధంగా శ్రీహరి ముదిరాజ్‌తోపాటు మరో ఇద్దరి పేర్లను హైకమాండ్‌కు నివేదించారట సీఎం రేవంత్. ఈ లిస్టులో ప్రేమ్‌సాగర్ రావు డిప్యూటీ సీఎం భట్టి చాయిస్ కాగా, ఆ జిల్లా నుంచి సీనియర్ నేత గడ్డం వివేక్ కూడా మంత్రి పదవిని ఆశిస్తూ… లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ తో పాటు ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలను వాడుకుని కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు వివేక్.

తన భార్యకు కూడా పదవి ఇవ్వాలని మంత్రి మెలిక..
ఇక నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి బెర్త్ కన్ఫార్మ్ అయినప్పటికీ… అదే జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా రాహుల్ గాంధీ కోటరీ కింద పదవిని ఆశిస్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పుడే మంత్రి పదవిని ఇస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పుడు క్యాబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారంటున్నారు. అయితే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండటంతో సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులిస్తే… తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత, మంత్రి ఉత్తత్ కుమార్ రెడ్డి మెలిక పెట్టారంటున్నారు. అంతేకాకుండా నల్గొండ జిల్లా నుంచి బాలునాయక్ పేరును పరిశీలించాల్సిందిగా ఉత్తమ్ సూచించారంటున్నారు.

అదే వర్గానికి మంత్రి పదవులు ఇవ్వడం కరెక్ట్ కాదనే వాదన..
ఉత్తమ్, భట్టి సూచించిన వారితోపాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లి పదవుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేయడంతో విస్తరణ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించిందట కాంగ్రెస్ హైకమాండ్. రాష్ట్ర పార్టీలో ఈ విషయమై చర్చించి, ఏకాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక వర్గాల సమతుల్యం పాటించడం కూడా కత్తిమీద సామే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే మంత్రి వర్గంలో రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎక్కువగా ఉండగా, ఇప్పుడు అదే వర్గానికి చెందిన మరో ఇద్దరికి ఇవ్వాలని నిర్ణయించడం సరికాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో మొత్తం విస్తరణను ప్రస్తుతానికి అటకెక్కించాలని నిర్ణయించింది కాంగ్రెస్ హైకమాండ్. అంతా సర్దుమణిగాకే విస్తరించాలని…. అంతవరకు ఈ వ్యవహారాన్ని సస్పెన్స్‌గానే మిగల్చాలని నిర్ణయించింది కాంగ్రెస్ అగ్ర నాయకత్వం. దీంతో ఆశావహుల ఆశలన్నీ ఆవిరైపోయాయి.

Also Read : కాంగ్రెస్‌లో కేకే రేపిన తుఫాన్ ఏంటి? వలస నేతలకు వచ్చిన కష్టం ఏంటి?

ట్రెండింగ్ వార్తలు