కాంగ్రెస్‌లో కేకే రేపిన తుఫాన్ ఏంటి? వలస నేతలకు వచ్చిన కష్టం ఏంటి?

కేకే రాజీనామా చేయడం వెనుక అసలు మర్మం ఏంటో అర్థం కాక కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఒక్క రాజీనామా లేఖతో కేకే కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించారనే చెప్పాలి.

కాంగ్రెస్‌లో కేకే రేపిన తుఫాన్ ఏంటి? వలస నేతలకు వచ్చిన కష్టం ఏంటి?

Gossip Gargae : ఆలోచించి చేశారా? అనుకోకుండా చేసేశారా? చేయాలని చేశారా? ఏదో అనుకుని చేస్తే మరొకటి అయిందా.. ? చేశారు సరే… ఆ ఒక్కరు చేసిన దాంతో ఇంతమందికి తిప్పలా? ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? నాకు తెలియాలి? అన్నట్లు కాంగ్రెస్‌ రాజకీయం గందరగోళంగా మారింది. సీనియర్ నేత కేకే కాంగ్రెస్ కండువా కప్పుకుంటూనే హస్తం పార్టీలో ఓ తుఫాన్ రేపారు…? కేకే రేపిన ఆ తుఫాన్ ఏంటి?

కేకే రాజీనామాతో కాంగ్రెస్ లో పెను దుమారం..
సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేకే కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే… ఆ పార్టీ నేతలకు షాక్ ఇచ్చారా? అన్న చర్చ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేకే కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లినా… అధికారికంగా బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక ఇలా పార్టీలో చేరిన వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు కేకే. తాను నైతిక విలువలు పాటిస్తున్నానని చెప్పదల్చుకున్నారో? లేదా కూతురు భవిష్యత్ కోసం తన పదవిని పణంగా పెట్టేద్దాం అనుకున్నారో గానీ … కేకే చేసిన రాజీనామా మాత్రం కాంగ్రెస్‌లో పెను దుమారం రేపుతోంది. తన రాజీనామాతో కాంగ్రెస్ లోకి వలస వద్దామనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు… ఇప్పటికే చేరిన వారికి సైతం కేకే షాక్ ఇచ్చారంటున్నారు పరిశీలకులు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేయడంతో తమపైనా ఒత్తిడి పెరుగుతుందని తలపట్టుకుంటున్నారు వలస ఎమ్మెల్యేలు.

తాము కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన..
తన రాజీనామా తర్వాత చోటు చేసుకునే పరిణామాలను కేకే ఊహించారో లేదో కానీ, ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన వారు మాత్రం ఇప్పుడేం చేయాలన్న ఆలోచనలో పడ్డారని అంటున్నారు. తాము కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారట…. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేరగా, ఏ ఒక్కరూ తమ పదవులకు రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా వారిని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయమని కోరలేదు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్, కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరినా, ఆమె కూడా ఇంతవరకు రాజీనామా చేయలేదు.

చర్చకు దారితీసిన కేకే రాజీనామా వ్యవహారం..
అంతకుముందే బీఆర్ఎస్ లో చేరిన డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా కూడా ఇప్పటిదాకా రాజీనామా ఊసే ఎత్తలేదు. దీంతో కేకే రాజీనామా వ్యవహారం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేకే… కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లినా… బీఆర్ఎస్ కూడా ఆయన రాజీనామా చేయమని కోరలేదు. పార్టీలో ఆయనకు తగినంత గౌరవం ఇచ్చినా, అర్థాంతరంగా వెళ్లిపోయారని మాత్రమే విమర్శించింది.

రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన కేటీఆర్..
ఇక ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేసిన వెంటనే రాజకీయంగా పావులు కదిపింది బీఆర్‌ఎస్‌. కేకే బాటలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ‘కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం… మరి మిగిలిన అరడజను మంది ఎమ్మెల్యేల సంగతేంటి? అంటూ యే కైసా న్యాయపత్ర హై అని ప్రశ్నిస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ను ట్యాగ్‌ చేయడంతో కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీంతో ఏ ఒత్తిడి లేకపోయినా కేకే ఎందుకు రాజీనామా చేశారో అర్థం చేసుకోలేక కాంగ్రెస్ నేతలు జుట్టు పీక్కుంటున్నారట.

పార్టీలు మారినా.. సభ్యత్వాలకు రాజీనామా చేసింది లేదు..
తన రాజీనామా ఆమోదించరనే ఆలోచనతో కేకే రాజీనామా చేశారా? అని సరిపెట్టుకుందామన్నా… కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు. ప్రతిపక్షం నుంచి ఎంపీ రాజీనామా చేస్తే బీజేపీ ఆమోదించకుండా ఉంటుందా? అన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు గతంలో పార్టీలు మారినా… ఎవరూ తమ సభ్యత్వాలకు రాజీనామా చేయలేదు. గతంలో ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ టీడీపీ సభ్యులుగా ఉంటూనే బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరు తమ పదవీకాలాన్ని బీజేపీ సభ్యులుగా పూర్తి చేసుకున్నారు కానీ, టీడీపీ నుంచి గెలిచి పార్టీ మారామని రాజీనామా చేయలేదు. గతంలోనే కారు దిగేసిన దివంగత డీఎస్ సైతం రాజ్యసభ పదవికి రాజీనామా చేయలేదు.

కాంగ్రెస్ వలస పక్షులకు సవాల్..
అయితే కేకే మాత్రం తన రూటే సెపరేటు అన్నట్లు ఎవరూ చేయని విధంగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కేకే రాజీనామా చేయడం వెనుక అసలు మర్మం ఏంటో అర్థం కాక కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఒక్క రాజీనామా లేఖతో కేకే కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించారనే చెప్పాలి. కేకేకు ఉన్న నైతికత పార్టీలు మారిన మిగిలిన వారికి లేదా? అంటూ వలస నేతలపై ఒత్తిడి పెరిగే ఛాన్స్ కన్పిస్తోంది…. దీన్నుంచి కాంగ్రెస్ వలస పక్షులు ఎలా బయటపడతారో చూడాలి మరి!

Also Read : దానం నాగేందర్‌‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? ఇంతకీ బీజేపీ వ్యూహం ఏంటి?