చంద్రబాబు లెక్క మారిందా? ఈసారి అనుకున్నది సాధిస్తారా?

మొత్తానికి ఈ సారి ఢిల్లీ నుంచి నిధులు సాధించే విషయంలో పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనను గమనిస్తున్నవారంతా... అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ విశ్లేషిస్తున్నారు.

Gossip Garage : ఢిల్లీకి చంద్రబాబు… చంద్రబాబుకు ఢిల్లీ కొత్తేమీ కాదు.. 45 ఏళ్లుగా ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చి ఉంటారు… ఇప్పుడూ ఢిల్లీలోనే ఉన్నారు.. ఇందులో కొత్తేముంది? అనుకుంటున్నారా? కచ్చితంగా బాబు ఢిల్లీ టూర్‌ ఈ సారి చాలా స్పెషల్‌. ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇక దాదాపు 12 మంది కేంద్రమంత్రులను కలవాలని… రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు పూర్తి చేసుకోవాలని ప్లాన్‌.. మరి బాబు నిధులు సాధించగలరా? గత పర్యటనలకు… ఇప్పటికీ తేడా ఏంటి? చంద్రబాబు పర్యటనకు ఎందుకంత ప్రాధాన్యత…?

చంద్రబాబు ఢిల్లీ టూర్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొత్త ఆశలు రేపుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని మోదీతో 30 నిమిషాలు భేటీ అయిన చంద్రబాబు… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి… సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఇక కేంద్ర మంత్రులతోనూ కలిసి ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై చర్చించారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో టూర్‌లో చంద్రబాబు పూర్తిగా అధికారిక కార్యక్రమాలకే పరిమితం కానున్నారు. కానీ, జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలతో చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై దేశవ్యాప్తంగా అన్ని పార్టీలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఈసారి చక్రం తిప్పే స్టేజ్ లో టీడీపీ..
కేంద్ర ప్రభుత్వంలో కీలక నేతగా చక్రం తిప్పే అవకాశం గత ఎన్నికల్లో చంద్రబాబుకు లభించింది. దీంతో ఢిల్లీలో… అధికార బీజేపీలో చంద్రబాబుకు ప్రాధాన్యం పెరిగింది. చంద్రబాబు శాసించే లెవల్‌లో ఉండటంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులుపై అంచనాలు రెట్టింపయ్యాయి. విభజన తర్వాత రాష్ట్రం వెనకబడిందనే అభిప్రాయంతో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో 2014లో టీడీపీని గెలిపించినా, బీజేపీకి టీడీపీ మద్దతు అవసరం లేని పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు చంద్రబాబు.

ఇక 2019లో ఇదే కారణంగా టీడీపీ ఓడినా, గెలిచిన వైసీపీ కూడా బీజేపీకి తన అవసరం లేనందున… ఏమీ చేయలేనని చేతులెత్తేసింది. ఇప్పుడు వైసీపీ చెప్పినట్లు… కేంద్రంలో టీడీపీ అవసరం బీజేపీకి ఏర్పడింది. టీడీపీ చక్రం తిప్పే స్టేజ్‌లో ఉండటంతో చంద్రబాబు పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయించాలి..
ప్రధానితో 30 నిమిషాలు మాట్లాడిన చంద్రబాబు…. రాష్ట్రానికి ఏం కోరారన్న విషయంపై రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ ఐదేళ్లలో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. ఇప్పటికే ఈ రెండు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు… ఢిల్లీ టూర్‌లో ఆయా అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు సాధించాల్సి వుంది. ఐతే గతంలో బీజేపీ-టీడీపీ కలిసి పనిచేసినా… చంద్రబాబు అడిగిన అన్ని ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపలేదు బీజేపీ. ఇందులో ప్రధానమైనది రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. ఇప్పుడు ఈ పరిస్థితి మారిందంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు అడిగిన ప్రాజెక్టులు, నిధుల్లో ఎక్కువ శాతం కార్యరూపం దాల్చే అవకాశం ఉందంటున్నారు. ముందుగా అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు అదనపు కేటాయింపులపై ఎక్కువగా ఫోకస్‌ చేసిన చంద్రబాబు… ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.

టీడీపీ ఎంపీలకు చేతినిండా పని..
16 మంది ఎంపీలతో ఎన్‌డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారిన చంద్రబాబు… ఏం అడిగితే అవి చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఐతే రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టిన చంద్రబాబు… కేంద్రంలో బలం పెరిగినా, గతంలో మాదిరిగా కేంద్రంపై ఒత్తిడి చేయడానికి సిద్ధంగా లేరంటున్నారు పరిశీలకులు. తన ప్రాధాన్యం, రాష్ట్ర అవసరాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసినందున కేంద్రం సహకరిస్తుందని విశ్వసిస్తున్నారు చంద్రబాబు. అదే విధంగా తాము అడిగాం… కేంద్రం చేయాల్సిందే అన్నట్లు వదిలేయకుండా…. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించే పనిని టీడీపీ ఎంపీలకు అప్పగించారు చంద్రబాబు. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు మిగిలిన ఎంపీలు 14 మందికి ఢిల్లీలో చేతినిండా పని కల్పించారు చంద్రబాబు. ఒక్కో ఎంపీ కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి నిధులు సాధన, ప్రభుత్వ పథకాలకు అనుమతులు వచ్చేలా పర్యవేక్షించాల్సివుంటుందని ఇప్పటికే తేల్చిచెప్పారు చంద్రబాబు.

గతానికి భిన్నంగా చంద్రబాబు వైఖరి..
మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఆశిస్తున్న చంద్రబాబు… గతానికి భిన్నంగా ఇప్పుడు తన పని పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు ఎన్‌డీఏలో మరో కీలక భాగస్వామి, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌…. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి వ్యవహరశైలి తెలిసిన బీజేపీ పెద్దలు… ఆయన డిమాండ్‌ను ఎలా పరిష్కరిస్తారన్నది కూడా ఏపీ రాజకీయాలకు కీలకంగా మారింది. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు… బిహార్‌ విషయంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క..
రాజకీయ అవసరాల రీత్యా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. ఏపీకి హోదా వచ్చి తీరుతుందని చంద్రబాబు నమ్మకం. లేనిపక్షంలో ప్రత్యేక ప్యాకేజీ ద్వారా గరిష్టంగా నిధులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ సారి ఢిల్లీ నుంచి నిధులు సాధించే విషయంలో పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనను గమనిస్తున్న వారంతా… అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ విశ్లేషిస్తున్నారు.

Also Read : ఫైల్స్‌ కాల్చివేత అందుకేనా.. ఇది వారి పనేనా.. తప్పు మీద తప్పుతో మరింత ముప్పు తెచ్చుకుంటున్నారా?

ట్రెండింగ్ వార్తలు