Delhi Liquor Case: ఈడీ నోటీసులపై కవిత కీలక వ్యాఖ్యలు.. ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన విజయశాంతి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈడీ నోటీసులపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.. దీంతో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ట్విటర్ వేదికగా కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

Kavitha vs Vijayashanthi: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. శుక్రవారం లేదా శనివారం విచారణకోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కవితకు దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి. మరోవైపు గతేడాది చివర్లో లిక్కర్ స్కాం కేసు అంశంలోనే సీబీఐ కూడా కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారించింది. తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

MLC Kavitha: ఈడీ నోటీసులు, తెలంగాణలో పొత్తులపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్

ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఏం చేయాలన్నదానిపై తమ న్యాయబృందం స్పందిస్తుందని తెలిపారు. అంతేకాక.. ఈడీ నోటీసులు రాజకీయ కక్షతోనే పంపారని ఆరోపించారు. ఇవి ఈడీ నోటీసులు కాదు.. మోదీ నోటీసులు అంటూ కవిత సెటైర్లు వేశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ నోటీసులు పంపారని, తెలంగాణ ప్రజలు ఈ నోటీసులను సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. ఏడాది నుంచి కంటిన్యూగా నోటీసులు వస్తున్నాయి. ఇదంతా టీవీ సీరియల్‌లాగా సాగుతోందని విమర్శలు గుప్పించారు. అయితే, బాధ్యతగలిగిన ప్రజాప్రతినిధిగా ఈ విషయాన్ని మా లీగల్ టీంకు చెప్పాం. వాళ్లు ఇచ్చే సలహాను బట్టి ముందుకెళ్తామని కవిత పేర్కొన్నారు.

MLC Kavitha on Revanth Reddy : మోకరిల్లడం కాంగ్రెస్ వాళ్లకు కొత్తేమి కాదు.. ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

కవిత వ్యాఖ్యల పట్ల బీజేపీ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ట్విటర్ వేదికగా కవిత వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఇవి ఈడీ నోటీసులు కాదు.. మోదీ నోటీసులు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలను విజయశాంతి తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావాలని రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు.. ఆ ఆవశ్యకతకూడా లేదని అన్నారు. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత అరెస్టు కానట్లయితే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావంతో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు చేయ్యవచ్చన్న భయం బీఆర్ఎస్‌కు ఉందేమో గానీ, జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదని విజయశాంతి అన్నారు. ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు.. ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్ధోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ ఎన్నటికీ కోరుకుంటుందని ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ ..

గతంలో ఈడీ నోటీసులు ఇచ్చిన సమయంలోనే కవిత మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లు మహిళలను వారు నివసించేచోటే విచారించాలన్న సీఆర్‌పీసీలోని సెక్షన్ 160 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని కోరారు. సుప్రీంకోర్టు కాజ్ లిస్ట్ ప్రకారం శుక్రవారం ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు