కనీసం ముఖం కూడా చూపెట్టలేదు, సీఎం రేవంత్ రెడ్డిని లైట్‌ తీసుకున్న ఎమ్మెల్యే..! ఎందుకీ ధిక్కార స్వరం?

తన సొంత ఇంట్లో ఉండి కూడా రేవంత్ పర్యటనను లైట్ తీసుకున్నారు. దీంతో అటు పార్టీ వర్గాల్లోను, ఇటు జనంలోను ఈ వ్యవహారం హాట్ డిబేట్‌కు తెరతీసింది.

Donthi Madhava Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడా ఎమ్మెల్యే హాట్‌ టాపిక్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం లైట్ తీసుకున్న నేత… సీఎం అయినా సో వాట్… నా నియోజకవర్గానికి నేనే సుప్రీం అనేంత ఘట్స్… కాంగ్రెస్ లో నేనే సీనియర్… వీసీ బ్యాచ్‌తో నాకేంటి?… నేను ఏసీ బ్యాచ్… ఇక్కడ నేనే రాజు.. నేనే మంత్రి… అన్నట్లు ఉంటుంది ఆ ఎమ్మెల్యే తీరు…. అదేంటి సీఎంనే లైట్ తీసుకోవడమా? పార్టీ చీఫ్‌కే పవర్ చూపించడమా? ఏసీ బ్యాచ్… బీసీ బ్యాచ్ ఏంటి అనుకుంటున్నారా?

సీఎంకు ముఖం కూడా చూపెట్టలేదు..
తెలంగాణ రాజకీయాలలో నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి స్టైలే వేరు. కాంగ్రెస్‌ పార్టీ అంతా ఒక్కతాటిపై ఉన్నట్లు కనిపిస్తున్నా… నా రూటే సెపరేటు అంటున్నారు ఈ సీనియర్‌ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రిగా, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డిని సైతం లైట్‌ తీసుకోవడంతో కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారారు ఎమ్మెల్యే దొంతి. ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలి? అంటూ ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే… కాంగ్రెస్‌లో తాజా ఫైర్‌బ్రాండ్‌గా మారారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇదే తీరు. తాజాగా వరంగల్‌ పర్యటనకు వచ్చిన సీఎంకు ముఖం కూడా చూపెట్టలేదు మాధవరెడ్డి. కాంగ్రెస్‌లో సీనియర్‌గా ఉన్న మాధవరెడ్డిని మంత్రిగా తీసుకోకపోవడం వల్లే ఈ ధిక్కారం ప్రదర్శిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలలుగా సీఎంకు దూరంగా ఉన్నా… తాజాగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలోనైనా తనకు బెర్త్‌ ఇవ్వాలని… తన స్టైల్‌లో ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

సీఎం పర్యటనను లైట్ తీసుకున్నారు..
జిల్లాల పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖ సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా ఘన స్వాగతం పలికారు. కానీ, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం అటువైపు చూడలేదు. వరంగల్ నగరంలోనే తన సొంత ఇంట్లో ఉండి కూడా రేవంత్ పర్యటనను లైట్ తీసుకున్నారు దొంతి. దీంతో అటు పార్టీ వర్గాల్లోను, ఇటు జనంలోను ఈ వ్యవహారం హాట్ డిబేట్‌కు తెరతీసింది. హనుమకొండ కలెక్టరేట్ లో సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. వరంగల్ లో దాదాపు ముఖ్యమంత్రి ఆరున్నర గంటల పాటు గడిపారు. ఈ సమయంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్ష నిర్వహిస్తున్న ప్రాంతానికి కూత వేటు దూరంలో ఉన్న ఆయన నివాసంలోనే ఉన్నారు తప్ప సీఎం టూర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

పార్టీకి, ప్రభుత్వానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు?
ఇక GWMC అభివృద్ధి కోసం నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేసినా, తనకు ఆహ్వానం లేదని సాకు చూపి ఆ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇలా స్వపక్షంలోనూ విపక్ష పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే… అసలు ఎందుకు పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారనే విషయంపై మాత్రం ఎక్కడా నోరు మెదపడం లేదు.

పార్టీలు మారిన వారికి మంత్రి పదవులా?
ఐతే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అంతరంగం మాత్రం వేరుగా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 1999 నుంచి పార్టీని అంటి పెట్టుకున్న తనకు పార్టీలో సముచితమైన గౌవరం ఇవ్వడం లేదన్న ఆవేదనలో ఉన్నారంటున్నారు. సీనియర్‌ నేత జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమానంగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు నెరిపితే… తనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించలేదని, అసలు కాంగ్రెస్ వాది-ఏసీ బ్యాచ్‌గా తనకు న్యాయం జరగలేదనేది దొంతి వాదనగా ఉందట. వలస నేతలు అంటే వీసీ బ్యాచ్.. పార్టీలు మారిన వారిని సీఎం తన మంత్రివర్గంలో చేర్చుకున్నారనే ఆగ్రహంతో అసంతృప్తితో మాధవరెడ్డి రగిలిపోతున్నారంటున్నారు. రాష్ట్ర రాజకీయాలు, సీఎంతో సంబంధం లేకుండా నేరుగా అధిష్టానంతోనే మాట్లాడి అమాత్య పదవి సాధించాలనే వ్యూహంలో ఈ తరహా ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు.

సీఎంనే ధిక్కరించే స్థాయిలో మాధవరెడ్డి రాజకీయాలు..
ఇలా సీఎంనే ధిక్కరించే స్థాయిలో మాధవరెడ్డి రాజకీయాలు ఇప్పుడే స్టార్ట్‌ చేయలేదు. గతం నుంచే సీఎంతో ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు ఎమ్మెల్యే దొంతి. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో కూడా సేమ్ సీన్ జరిగింది. ములుగు నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. నర్సంపేట మీదుగా మహబూబాబాద్‌కు పాదయాత్ర వెళ్లాల్సి ఉండగా, నర్సంపేటలో రేవంత్ రెడ్డిని మాధవరెడ్డి కాలు మోపనివ్వలేదు సరికదా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం ఆయనను ఆహ్వానించలేదు. దీంతో నియోజకవర్గం జంప్ చేసి.. మహబూబాబాద్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తన పాదయాత్ర చేపట్టాల్సి వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా నర్సంపేటలో రేవంత్ రెడ్డి ప్రచారానికి రాలేదు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో మహబూబాబాద్ సభకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్న సభలో పార్లమెంట్ పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. 7వ నియోజకవర్గమైన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం సీఎం రేవంత్ సభకు దూరంగా ఉన్నారు.

నేనింతే.. హైకమాండే నాకు బాస్..!
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న నుంచి ఎమ్మెల్యే దొంతికి ఉన్న గ్యాప్ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కూడా కలవడం లేదు. ఎవరేమనుకుంటే నాకేంటి నేనింతే.. నాకు నచ్చినట్టు నేనుంటా.. నేను కాంగ్రెస్‌ వాదిని.. కాంగ్రెస్‌ హైకమాండే నాకు బాస్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నారు మాధవరెడ్డి. మొత్తానికి మంత్రి అవ్వాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకోడానికి పార్టీపై మాధవరెడ్డి తెస్తున్న ఒత్తిడి హైలెట్‌గా నిలుస్తోందంటున్నారు పరిశీలకులు.

Also Read : బీఆర్ఎస్ నుంచి నెక్ట్స్ వెళ్లేది ఆ ఇద్దరేనా? ఆ భయంతోనే పార్టీ మారనున్నారా?

ట్రెండింగ్ వార్తలు