బీఆర్ఎస్ నుంచి నెక్ట్స్ వెళ్లేది ఆ ఇద్దరేనా? ఆ భయంతోనే పార్టీ మారనున్నారా?

ఏదిఏమైనా ఈ ఇద్దరు కారు దిగేయడం ఖాయమేనంటున్నారు. ఎవరు ఎటువైపు వెళతారనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు.

బీఆర్ఎస్ నుంచి నెక్ట్స్ వెళ్లేది ఆ ఇద్దరేనా? ఆ భయంతోనే పార్టీ మారనున్నారా?

Gossip Garage : ఈడీ దాడులు… రాజకీయ ఒత్తిళ్లు… బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? పార్లమెంట్ పోరు ముగిశాక…. కారు పార్టీకి బైబై చెప్పేస్తున్న ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌ చేతిని అందుకోడానికి ఎందుకు అంత ఆత్రంగా ఎదురుచూస్తున్నారు? కాంగ్రెస్‌ ఆపరేషన్‌ కన్నా.. కేసులతో పరేషాన్‌ ఎక్కువగా ఉందా? కేంద్ర సంస్థల టార్గెట్‌ నుంచి తప్పించుకోడానికి ఎమ్మెల్యేలు ఎంచుకుంటున్న మార్గాలేంటి? ఎవరు ఎటువైపు జంప్‌ చేయబోతున్నారు?

ఆ ఇద్దరు కాంగ్రెస్ లోకా? బీజేపీలోకా?
కారులో కల్లోలం రోజురోజుకు ఎక్కువవుతోంది. కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు… కేంద్ర సంస్థల కేసుల భయం ఎమ్మెల్యేలను కారు దిగేలా చేస్తోందంటున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం తీర్థం పుచ్చుకోగా, మరో ఇద్దరు లైన్ లో ఉన్నారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. ఇవ్వాలో… రేపో ఆ ఇద్దరూ గోడ దూకేయడం ఖాయమనే ప్రచారమే ఎక్కువగా వినిపిస్తోంది. ఐతే ఈ ఇద్దరూ కాంగ్రెస్‌కే వెళ్తారా? లేక కేంద్రం అండ కోసం బీజేపీ గూటికి చేరతారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి వలసలు..
పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి వలసలు మొదలయ్యాయి. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, యాదయ్య వరుసగా కాంగ్రెస్‌ గూటికి చేరారు. వీరి తర్వాత పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమాలాకర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి గంగుల తమ పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఈ ప్రచారాన్ని గంగుల ఖండించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక కన్ఫూజన్ లో గంగుల..!
ఇదే సమయంలో ఆయన అనుచరులైన ముగ్గురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. దీంతో గంగుల ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీల్లో చేరే విషయంలో కన్ఫూజన్‌లో ఉన్నారంటున్నారు. ఎన్నికలకు ముందు గంగులపై ఈడీ దాడులు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్తే మళ్లీ ఈడీ పంజా విసురుతుందేమోననే ఆలోచన కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిని సృష్టించిందంటున్నారు. అయితే గంగుల కాంగ్రెస్‌లోకి వస్తే… స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతమవుతుందనే ఆలోచనలో కాంగ్రెస్‌ నాయకత్వం కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వం అండ లేకపోవడంతోనే ఈడీ దాడులు?
ఇక పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిది సేమ్‌ ఇదే స్టోరీ.. ఆయనపై ఈ మధ్య కాలంలోనే ఈడీ దాడులు చేసింది. మహిపాల్‌రెడ్డికి చెందిన వ్యాపార సంస్థలపై కేసు నమోదు చేసిన ఈడీ…. ఆయన సోదరుడిని అరెస్టు చేసింది. దీంతో ప్రభుత్వం అండ లేకపోవడంతోనే తనపై ఈడీ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు మహిపాల్‌రెడ్డి. ఇక అప్పటి నుంచే ఆయన పార్టీ మారతారనే ప్రచారం మొదలైంది. ఈడీ దాడుల అనంతరం మహిపాల్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. కష్టాల్లో తోడుంటామని భరోసా ఇచ్చారు.

పార్టీ మారే విషయంపై సీరియస్ గా ఆలోచన..
కానీ, తన వ్యాపారాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను దృష్టిలో పెట్టుకుని పార్టీ మారే విషయంపై మహిపాల్‌రెడ్డి సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ఒకసారి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. అప్పట్లోనే మహిపాల్‌రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. కానీ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎంను కలవాల్సి వచ్చిందని అప్పట్లో వివరణ ఇచ్చిన మహిపాల్‌రెడ్డి ఆలోచనల్లో మార్పు వచ్చిందని సమాచారం. ఈడీ దాడులతో గతంలో కాంగ్రెస్‌లో చేరివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని సన్నిహితులతో చెబుతున్నారంటున్నారు.

మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలు… బీఆర్‌ఎస్‌ను వీడే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరే విషయంలో మంత్రి దామోదర రాజనరసింహతో చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మంత్రి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

ఎటూ తేల్చుకోలేకపోతున్న గంగుల..
ఇక… గంగుల కమలాకర్‌ మాత్రం రెండు పార్టీల్లో దేనిలోకి వెళ్లాలనేది తేల్చుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరాలా? కేంద్రమంత్రి బండి సంజయ్‌తో సఖ్యత కోరుకోవడం ద్వారా కరీంనగర్‌లో మరింత బలపడేలా బీజేపీని ఎంచుకోవాలా అన్నదానిపై అనుచరులతో చర్చిస్తున్నారు గంగుల. ఏదిఏమైనా ఈ ఇద్దరు కారు దిగేయడం ఖాయమేనంటున్నారు. ఎవరు ఎటువైపు వెళతారనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు.

Also Read : త్వరలో మంత్రివర్గ విస్తరణ.. స్పష్టం చేసిన మంత్రి.. హోం మంత్రిగా సీతక్క?