ఆ కేసులు రీఓపెన్..! వైసీపీ కీలక నేతలే టార్గెట్‌గా ఉచ్చు బిగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

వైసీపీ కీలక నేతలు టార్గెట్‌గా ఆపరేషన్‌ మొదలుపెట్టిన చంద్రబాబు సర్కారు... ఇప్పటికే చాలా మంది నేతల ప్రమేయాన్ని గుర్తించినట్లు సమాచారం. మొత్తం కేసులను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.

Gossip Garage : టార్గెట్‌ ఫిక్స్‌… ఆపరేషన్‌ స్టార్ట్‌. యాక్షన్‌పైనే సస్పెన్స్‌… కేసులు… అరెస్టులు మాత్రమేనా.. ఇంకేమైనా చర్యలు ఉంటాయా? ఒకవైపు పోలీసులు.. మరోవైపు సీఐడీ బృందాలు… ఇంకోవైపు ఉన్నతాధికారులు గత ఐదేళ్ల పాలనను జల్లెడ పడుతున్నారు. ఎవరిని ఎప్పుడు మూసేస్తారో తెలియదు.. లిస్టులో పెద్ద తలకాయల పేర్లూ ఉన్నాయంటున్నారు. పెద్దల గుట్టు రట్టు చేసే ఆధారాలు సేకరించడమే బ్యాలెన్స్‌… మరి ఆధారాలు దొరుకుతున్నాయా? ధ్వంసమైన సమాచారాన్ని సేకరించడమే అసలు సవాలా? ఏపీలో ఏం జరుగుతోంది.. కూటమి యాక్షన్‌తో వైసీపీ నేతలకు టెన్షన్‌ ఎందుకు?

రెండు మూడేళ్ల క్రితం జరిగిన సంఘటనలపై పునర్విచారణ..
ఏపీలో అధికారం మారిన తర్వాత పొలిటికల్‌ పిక్చర్‌ కంప్లీట్‌గా మారిపోయింది. ఇన్నాళ్లు బిందాస్‌గా గడిపిన లీడర్ల ఆర్థిక మూలాలుపైన… గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న నేరాలపైనా కూటమి ప్రభుత్వం విచారణ తిరగతోడుతోంది. రెండు మూడేళ్ల క్రితం జరిగిన సంఘటనలను ప్రభుత్వం పునర్విచారణకు సిద్ధమవడంతో ఆయా కేసుల్లో నిందితులు, అప్పట్లో ఆ కేసులను దర్యాప్తు చేసిన అధికారులకు టెన్షన్‌ మొదలైంది. ఇదే సమయంలో పోలీసులను, అధికారులను మేనేజ్‌ చేసిన నేతలపైనా చర్యలు ఉంటాయనే ప్రభుత్వ హెచ్చరికతో ఎప్పుడు ఎలాంటి యాక్షన్‌ ఉంటుందోననే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుపై ఫోకస్‌..
టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో దాడి జరిగితే.. ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో కేసును రీ ఓపెన్‌ చేసిన పోలీసులు…. అప్పటి సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంతోపాటు దాడికి పురిగొల్పిన నేతలపైనా చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఈ సంఘటనలో ఇన్వాల్వ్‌ అయిన నిందితుల్లో ఎక్కువ మంది మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌ అనుచరులు ఉన్నట్లు చెబుతున్నారు. నిందితులను పట్టుకోవడంతోపాటు ఈ ముగ్గురిపైనా ఏమైనా చర్యలు తీసుకుంటారా? అన్న టెన్షన్‌ వైసీపీలో కనిపిస్తోంది.

విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసు రీ ఓపెన్‌?
ఇక కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ హత్య కేసును ప్రభుత్వం పునర్విచారించాలని భావిస్తోంది. ఈ కేసులో అనంతబాబుతోపాటు మరికొందరి ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అదేవిధంగా విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసును మళ్లీ ఓపెన్‌ చేస్తున్నారు. సుధాకర్‌ ఎపిసోడ్‌లో భూ సంబంధ వ్యవహారాలు ఉన్నాయనే సమాచారం ప్రభుత్వానికి చేరడంతో వైసీపీలో బిగ్‌ వికెట్లే టార్గెట్‌గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

గనులు, ఎక్సైజ్‌ శాఖల్లో స్కాములపై లోతుగా విచారణ..
ఇలా క్రిమినల్‌ కేసులను మళ్లీ విచారిస్తున్న ప్రభుత్వం…. గత ఐదేళ్లలో రాష్ట్రంలో గనులు, ఎక్సైజ్‌ శాఖల్లో స్కాములు జరిగాయని అనుమానిస్తోంది. ఈ రెండు డిపార్ట్‌మెంట్లతోపాటు ఆర్థిక శాఖలో నిధుల వినియోగంపైనా ఫోకస్‌ చేసింది. ఇప్పటికే ఎక్సైజ్‌ కేసులో బెవరేజస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో వాసుదేవ రెడ్డి ముందస్తు బెయిల్‌ కోరినా హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ కేసులో ఎవరిరెవరి ప్రమేయం ఉందనే విషయంపై కూపీ లాగుతున్న ప్రభుత్వం…. స్కాం చేసిన డబ్బు రికవరీకి ప్లాన్‌ చేస్తోంది.

ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలనే పక్కా వ్యూహం..!
గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఇదే సమయంలో ప్రజాధనం తిరిగి వసూలు చేసేలా ప్రత్యేక చట్టం చేయాలని ఆ లేఖలో సూచించారు. ఈ లేఖ సారాంశాన్ని పరిశీలిస్తే అనుమానితుల ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలనే పక్కా వ్యూహంతోనే ప్రభుత్వం అడుగులు వేస్తోందని భావించాల్సి వస్తోంది. గనుల లీజులు, ఇసుక తవ్వకాలు, మైనింగ్‌ వ్యవహారాల్లోనూ ఎవరెవరి పాత్ర ఉందని తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. రాయలసీమకు చెందిన ముఖ్య నేతలు గనుల లీజుల్లో అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు.

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో రూ.100 కోట్ల స్కాం..!
ఇలా ప్రభుత్వ స్థాయిలో జరిగిన అక్రమాలతోపాటు క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలపైనా ఫోకస్‌ చేసింది కూటమి ప్రభుత్వం. కాకినాడలో బియ్యం అక్రమ ఎగుమతులు ద్వారా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం…. శ్రీకాకుళం జిల్లాలో ఓ మాజీ మంత్రి భూ అక్రమాలపైనా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇక విశాఖ నగరంలో భూకబ్జాలు, రుషికొండ భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటివి తీవ్ర చర్యలకు దారి తీయొచ్చని అంటున్నారు. ఇక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా 100 కోట్ల స్కాం జరిగిందనే ఫిర్యాదును సీరియస్‌గా పరిశీలిస్తోంది ప్రభుత్వం.

మొత్తానికి వైసీపీ కీలక నేతలు టార్గెట్‌గా ఆపరేషన్‌ మొదలుపెట్టిన చంద్రబాబు సర్కారు… ఇప్పటికే చాలా మంది నేతల ప్రమేయాన్ని గుర్తించినట్లు సమాచారం. మొత్తం కేసులను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.

Also Read : ఆపరేషన్ ద్వారంపూడి..! మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగిస్తున్న పవన్ కల్యాణ్..!

ట్రెండింగ్ వార్తలు