Ayodhya Ram Mandir : రాముడు అయోధ్య నుంచి లంకకు నడిచి వెళ్లినదారిలో పాదుకలతో పాదయాత్ర చేస్తున్న భక్తుడు..

రామయ్య అంటే ప్రాణం. అయోధ్య రామయ్య కోసం పాదయాత్ర చేపట్టారు ఓ భక్తుడు. రామయ్య అడుగు జాడల్లోనే అడులు వేసుకుంటు బయలుదేరారు. రాముడు అయోధ్య నుంచి లంకకు నడిచి వెళ్లినదారిలోనే అడుగులో అడుగు వేస్తు రామయ్య పాదుకలతో నడుస్తున్నారు.

Srinivasa Sastri Padayatra to Ayodhya : అయోధ్యలో భవ్యమైన రామమందిర ప్రారంభానికి శుభ ముహూర్తం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ తరుణం మరికొన్ని రోజుల్లోనే రానే వచ్చింది. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు ఉవ్విళూరుతున్నారు. ఈ క్రమంలో రామయ్యకు ఎంతోమంది భక్తులు భారీ కానుకలను సమర్పించుకుంటున్నారు. దీంట్లో భాగంగా అయోధ్య రామునికి పాదుకలు సమర్పించేందుకు పాదయాత్ర ద్వారా బయలు దేరివెళ్లారు హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి.

అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు ఈ శ్రీనివాస శాస్త్తి.. రాముడు అయోధ్య నుంచి లంకకు నడిచి వెళ్లినదారిలో నడుస్తున్నారు. ఈ పాదయాత్ర రామేశ్వరంలో మొదలై… రాముడు అరణ్య వాసంలో భాగంగా తిరిగిన ప్రదేశాలన్నీ తిరుగుతూ వెళ్తున్నారు. మార్గమధ్యంలో శృంగేరీ, కంచి, పూరీ, ద్వారకా పీఠాధీశుల ఆశీర్వాదాలు తీసుకుంటూ అయోధ్య వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరాముడి భవ్య ఆలయం ప్రారంభం కాబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామమందిర నిర్మాణం తలపెట్టింది రామతీర్థా క్షేత్ర ట్రస్ట్. ఇందుకోసం దేశ వ్యాప్తంగా భక్తుల నుంచి విరాళాలు సేకరించింది.

ఈ సమయంలో శ్రీనివాస శాస్త్రి వెండి ఇటుకలను రామమందిర నిర్మాణం కోసం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి రాముడిపైన భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. 9 కిలోల వెండితో రాముడి పాదుకలు తయారు చేసి అయోధ్యకు తీసుకుని వెళ్తున్నారు. రామేశ్వరం నుంచి అయోధ్య వరకు దాదాపు రెండు వెల కిలోమీటర్ల వరకు ఆయన ప్రయాణించనున్నారు. ఈ ప్రయాణంలో భారతదేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ జనవరి 15 సంక్రాంతి కల్లా ఆయన అయోధ్య రామమందిరానికి చేరుకోనున్నారు.

అయోధ్యలో రామ భక్తుల కోసం ప్రతిరోజు పదివేల లడ్డూలను ఆయన పంచిపెడుతూ తన రామభక్తిని చాటుకోనున్నారు. జనవరి 22వ తేదీన భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శ్రీరాముని సేవలో తరించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు