AP Schools Summer Holidays : ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

AP Schools Summer Holidays : ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ లోగా అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేయాలని స్కూళ్ల యాజమాన్యాలను విద్యాశాఖ ఆదేశించింది.

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. వేసవి తాపంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధుల సంగతి చెప్పక్కర్లేదు. బడి పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రభుత్వం ఒంటిపూట బడులే నిర్వహిస్తోంది. అయినప్పటికి మిట్టమధ్యాహ్నం ఇంటికి చేరుకునే సరికి పిల్లలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ముందు ముందు మరింత మండే కాలం రానుంది. మాడు పగిలేలా ఎండల తీవ్రత పెరగనుంది. ఈ నేపథ్యంలో స్కూళ్లకు వేసవి సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

రెండేళ్లుగా కరోనా కారణంగా ఏపీలో విద్యా సంవత్సరంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సిలబస్ తగ్గించారు. సెలవులు కుదించారు. ఏకంగా విద్యా సంవత్సరంలో మార్పు చేశారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్ధులను పాస్ కూడా చేసేశారు. ఈసారి కరోనా తీవ్రత తగ్గడంతో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇకపోతే ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ చాలా మార్పులే చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాల్సి ఉంది. అయితే, సిలబస్ పూర్తి కాకపోవడంతో సెలవులను మే 6 వరకూ పొడిగించాల్సి వచ్చింది.

ఇక గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ అనే తేడా కనిపించదు.. ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏప్రిల్ 24వ తేదీ నుంచే స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ వేసవి సెలవులు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి. మే 23 నుంచి జూన్‌ 1 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పాఠశాలలు జూన్ 13వ తేదీన తిరిగి తెరుచుకోనున్నాయి.

కాగా, వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు మే 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి.

ట్రెండింగ్ వార్తలు